ఉద్యోగుల PRCపై బిగ్ ట్విస్ట్: సీఎం జగన్ హామీ ఇచ్చిన గంటల్లోనే..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కారు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. దీంతో పీఆర్‌సీ సహా సంబంధిత అంశాలపై ఉద్యోగ సంఘాలతో కార్యదర్శుల కమిటీ సమావేశం అర్ధంతరంగా ముగిసింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో భాగస్వాములైన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సచివాలయం మొదటి బ్లాక్‌లోని సీఎం సమావేశ మందిరంలో శుక్రవారం ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పీఆర్‌సీ నివేదిక ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరగా.. నివేదికలోని సాంకేతిక అంశాలపై అధ్యయనం చేయాలని అధికారులు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పీఆర్‌సీ నివేదిక ఇవ్వలేమని స్పష్టం చేశారు.
చదవండి : కొత్త పీఆర్సీ లో మీ బేసిక్ పే ఎంతో తెలుసుకోండి
పీఆర్‌సీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో ప్రకటన చేశారని.. సీఎం హామీ మేరకు 10 రోజుల్లో పీఆర్‌సీ ప్రకటిస్తామని కార్యదర్శుల కమిటీ తెలిపింది. దీనిపై ఉద్యోగ సంఘాలు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అసలు పీఆర్‌సీ నివేదిక ఇవ్వకుండా చర్చలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. దీంతో కార్యదర్శుల కమిటీ సమావేశం అసంపూర్తిగానే ముగిసింది.
ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ... 71 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మళ్లీ ఇచ్చామని వెల్లడించారు. కార్యదర్శుల కమిటీది కాలయాపన తప్ప మరొకటి కాదని తప్పుపట్టారు. ప్రభుత్వం ఏదో ఒకటి చెప్పే వరకు ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందన్నారు.
తెలుసుకోండి: మీ నెల జీతం వివరాలు తెలుసుకోండి ( పే స్లిప్ )
కాగా, శుక్రవారం తిరుపతిలో పర్యటిస్తున్న సీఎం జగన్ పీఆర్‌సీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు. సరస్వతి నగర్‌లో సీఎంను కలిసిన ఉద్యోగులు.. పీఆర్‌సీ ప్రకటించాలని కోరారు. దీంతో 10 రోజుల్లో పీఆర్‌సీ ప్రకటిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. అయితే, తాజా సమావేశంలో పీఆర్‌సీ నివేదిక ఇవ్వకపోవడంతో మరోసారి దీనిపై సందిగ్ధత కొనసాగుతోంది.