PRC NEWS: కొత్త పీఆర్సీ అమలు అంశాన్ని అబయెన్సులో పెట్టాలి

 కొత్త పీఆర్సీ అమలు అంశాన్ని అబయెన్సులో పెట్టాలి


ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 11వ పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ఏకమై పీఆర్సీ సాధన సమితి పేరిట ఉద్యమాన్ని ప్రారంభిచనున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ఈ క్రమంలో పీఆర్సీ సాధన సమితి నేతలు సీఎస్ సమీర్ శర్మతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం సీఎస్ కు విజ్ఞాపన పత్రాన్ని పీఆర్సీ సాధన సమితి నేతలు అందజేశారు. కొత్త పీఆర్సీ అమలు అంశాన్ని అబయెన్సులో పెట్టాల్సిందిగా సీఎస్ కు ఇచ్చిన విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు. జనవరి నెలకు సంబంధించి డిసెంబర్ వేతనం అమలు చేయాలని నేతలు కోరారు.

సమ్మె నోటీసు ఇచ్చేందుకు సాంకేతిక ఇబ్బందులు ఉండటంతో సోమవారం ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వనున్న పీఆర్సీ సాధన సమితి నేతలు తెలిపారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం నిర్ణయాన్ని ఉద్యోగులు, టీచర్లంతా వ్యతిరేకిస్తున్నారని పీఆర్సీ సాధన సమితి స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అర్ధం చేసుకోవాలని సీఎస్ సమీర్ శర్మ కోరారు. ఉద్యోగులకు భారీ ఎత్తున నష్టం జరుగుతోందని నేతలు వెల్లడించారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా సమ్మె చేయడానికి వెనుకాడడం లేదని ఉద్యోగ సంఘాల నేతల స్పష్టం చేశారు.


ఉద్యమంలోకి ఏ రాజకీయ పార్టీనీ అనుమతించం : బొప్పరాజు

ఉద్యమంలోకి ఏ రాజకీయ పార్టీనీ అనుమతించమని పీఆర్సీ సాధన సమితి ప్రతినిధులు బండి శ్రీనివాస్, బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలను.. ట్రేడ్ యూనియన్ నేతలను మాత్రం ఉద్యమంలోకి అనుమతిస్తామని, సీపీఎస్ రద్దు అంశంపై గట్టిగా ఉద్యమిస్తామన్నారు. ఫిబ్రవరి 7 నుంచి నిరవధి సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 24న నోటీసు ఇస్తామని, 23వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేపడుతామన్నారు. 26న అన్ని తాలూకా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహానికి మెమొరాండాల సమర్పిస్తామన్నారు.

ఈ నెల 27 నుంచి 30 వరకు నాలుగు రోజుల పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు వారు వెల్లడించారు. ఫిబ్రవరి 3వ తేదీన ఛలో విజయవాడ కార్యక్రమం, ఫిబ్రవరి 5 నుంచి సహాయ నిరాకరణ, ఫిబ్రవరి 7 నుంచి నిరవధిక సమ్మె చేస్తామన్నారు. సంఘాలుగా మా మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలున్నా.. సాధారణ ఉద్యోగుల కోసం మేమంతా కలిశామని తెలిపారు. మంత్రుల కమిటీ ఏదో వేశామని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం మొండిగా ఉంది. ఆర్టీసీ కార్మికులు కూడా ఉద్యమించేలా పాల్గొనాలి. జీవోలను రద్దు చేయాలి.. లేదా అబెయన్సులో పెట్టాలి.. ఆ తర్వాతే చర్చలకు వెళ్తామని వారు వ్యాఖ్యానించారు.



Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad