CPS: ‘సీపీఎస్‌’పై త్వరలోనే నిర్ణయం

 


‘సీపీఎస్‌’పై త్వరలోనే నిర్ణయం

మండలి’లో మంత్రి బుగ్గన 

సాక్షి, అమరావతి: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌)పై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోనుందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మంగళవారం శాసన మండలిలో తెలిపారు. సీపీఎస్‌ రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని, లేదా ఎప్పటిలోగా రద్దు చేస్తారో చెప్పాలని పీడీఎఫ్, బీజేపీ ఎమ్మెల్సీలు అడిగిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్‌ మోషేన్‌రాజు తిరస్కరించారు. దీంతో వారు వెల్‌లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. వెంటనే బుగ్గన స్పందించి సమాధానమిచ్చారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రుల బృందం సీపీఎస్‌పై అధ్యయనం చేసిందని, దానిని అధికారుల కమిటీ కూడా పరిశీలించిందని, కోవిడ్, ఆర్థిక ఇబ్బందులతో జాప్యం జరిగిందని  వివరించారు. సీఎం జగన్‌ ప్రతీవారం సీపీఎస్‌పై సమీక్ష నిర్వహిస్తున్నారని, దానర్ధం దానిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశమేనని బుగ్గన తెలిపారు. మంత్రి వివరణపై సంతృప్తి చెందని పీడీఎఫ్, బీజేపీ సభ్యులు మళ్లీ ఆందోళనకు దిగారు. వారికి టీడీపీ సభ్యులు కూడా జతకలిశారు. కాసేపు సీపీఎస్‌ రద్దు చేయాలని.. మరికాసేపు కల్తీసారా మరణాలపై చర్చకు అనుమతించాలని నినాదాలు చేస్తూ సభకు అడ్డుపడ్డారు. అదే సమయంలో ఓ సభ్యుడు ఈల వేయగా.. లోకేష్‌ తదితరులు చప్పట్లు కొడుతూ గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారు.

రాద్ధాంతం మధ్యే ప్రశ్నోత్తరాలు

ఇక సభ్యుల రాద్ధాంతం మధ్యే మండలి చైర్మన్‌ మోషేన్‌రాజు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగించారు. సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు బదులిచ్చారు. 


Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad