కోర్టు అంటే లెక్కలేని ఐఏఎస్ లు…ఆనక..క్షమించమంటూ పశ్చాత్తాపం
8 మంది ఐఏఎస్‌లకు ‘సేవా శిక్ష’
ధిక్కరణ కేసులో హైకోర్టు సంచలన తీర్పు
నెలలో ఒక ఆదివారం... ఏడాదిపాటు సంక్షేమ హాస్టళ్లకు వెళ్లాలిఅక్కడి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపాలిఒకపూట సొంత ఖర్చుతోనే భోజనం పెట్టాలితొలుత శిక్షగా రెండు వారాల జైలు, జరిమానా క్షమాపణలు చెప్పడంతో ‘సేవా శిక్ష’గా మార్పుబడి ప్రాంగణాల్లోని సచివాలయాలు, ఆర్బీకేలను ఖాళీ చేయించాలన్న ఉత్తర్వులపై అలసత్వంఉద్దేశపూర్వకంగానే అధికారుల నిర్లక్ష్యంసుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదుజస్టిస్ బట్టు దేవానంద్ కీలక తీర్పు
‘సేవా శిక్ష’ ఎవరికి.. ఏ జిల్లాలో?
గోపాలకృష్ణ ద్వివేది - కృష్ణా జిల్లా, గిరిజా శంకర్ - ప్రకాశం జిల్లా, బి.రాజశేఖర్ - శ్రీకాకుళం, వి.చిన వీరభద్రుడు - విజయనగరం, వై.శ్రీలక్ష్మి - పశ్చిమ గోదావరి, జె.శ్యామలరావు - అనంతపురం, జి.విజయ్ కుమార్ - కర్నూలు జిల్లా, ఎంఎం నాయక్- నెల్లూరు.
అమరావతి, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు ఆదేశాలను ధిక్కరించిన ఎనిమిది మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు న్యాయస్థానం ‘సేవా శిక్ష’ విధించింది. పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలపై నిర్లక్ష్యం ప్రదర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నెలలో ఒక ఆదివారం... ఏడాదిపాటు సంక్షేమ వసతి గృహాలకు వెళ్లి, అక్కడి విద్యార్థులకు సేవ చేయాలని ఆ అధికారులను ఆదేశించింది. ఆ రోజున ఒక పూట తమ సొంత ఖర్చులతో విద్యార్థులకు భోజనం అందించాలని తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను ఖాళీ చేయించాలన్న ఆదేశాల అమలులో విఫలమైనందుకు కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకుంది.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం ఈ సంచలన తీర్పు వెలువరించారు. పంచాయితీరాజ్‌శాఖ కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజా శంకర్, పాఠశాల విద్యాశాఖ అప్పటి ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్, అప్పటి కమిషనర్ వి.చినవీరభద్రుడు, పురపాలకశాఖ ప్రస్తుత ప్రత్యేకప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, పురపాలకశాఖ అప్పటి ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావు, పురపాలకశాఖ అప్పటి డైరెక్టర్ జి. విజయ్‌కుమార్, ప్రస్తుత డైరెక్టర్ ఎం.ఎం నాయక్‌లకు కోర్టు శిక్ష విధించింది. ఏ అధికారి ఏ జిల్లాలో సేవ చేయాలో కూడా న్యాయమూర్తి స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలను అధికారులు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని నిర్ధారిస్తూ... తొలుత వీరికి 2 వారాల సాధారణ జైలుశిక్షతోపాటు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. ఆ సొమ్మును చెల్లించడంలో విఫలమైతే మరోవారం జైలుశిక్ష అనుభవించాలని స్పష్టం చేశారు. ‘మీరు చెప్పుకోవాల్సిందేమైనా ఉందా?’ అని అధికారులను ప్రశ్నించారు. ఆపై అధికారులు ఒకరి తర్వాత ఒకరు న్యాయమూర్తి ముందుకొచ్చి... ఉత్తర్వులను సకాలంలో అమలు చేయనందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తులో అలా జరగకుండా చూసుకుంటామన్నారు. తమ వయస్సుతోపాటు ఇంతకాలం అందించిన సేవలను పరిగణనలోకి తీసుకొని క్షమించాలని కోరారు.
దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ... సామాజిక సేవ చేయడానికి అంగీకరిస్తే మానవతా దృక్పథంతో క్షమాపణను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. అందుకు ఐఏఎస్ అధికారులు అంగీకరించారు. దీంతో... న్యాయమూర్తి తీర్పును సవరించి, జైలు శిక్షకు బదులు ‘సేవా శిక్ష’ విధించారు. ‘‘నెలలో ఒక ఆదివారం చొప్పున ఏడాదిలో 12 ఆదివారాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు సమయం కేటాయించాలి. విద్యార్థుల్లో స్ఫూర్తి రగల్చాలి. ఆ రోజున విద్యార్థులకు సొంత ఖర్చులతో మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం ఏర్పాటు చేయాలి’’ అని ఆదేశించారు. ప్రతి నెలా అధికారులు హాస్టల్‌ను సందర్శించిన ఫొటోలను హైకోర్టు రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌కు పంపించాలని స్పష్టం చేశారు. కోర్టుకు ఇచ్చిన హామీని అమలు చేయడంలో విఫలమైతే కోర్టు ధిక్కరణ వ్యాజ్యాన్ని తిరిగి తెరిచేవీలు రిజిస్ట్రీకి కల్పించారు.