GPS తోనే ఉద్యోగులకు మెరుగైన పెన్షన్‌

GPS తోనే ఉద్యోగులకు మెరుగైన పెన్షన్‌

సీపీఎస్‌ ఉద్యోగులకు ప్రస్తుతం బేసిక్‌లో 20 శాతమే పెన్షన్‌

ప్రభుత్వ ప్రతిపాదిత జీపీఎస్‌ ద్వారా అయితే బేసిక్‌లో 33% మేర పెన్షన్‌

సెకండరీ గ్రేడ్‌ టీచర్‌కు సీపీఎస్‌లో రూ.15,647 పెన్షన్‌

అదే ప్రతిపాదిత జీపీఎస్‌లో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌కు రూ.25,856 పెన్షన్‌

సీపీఎస్‌ కంటే జీపీఎస్‌ ద్వారా పెన్షన్‌ 65 శాతం అధికం

పాత పెన్షన్‌ విధానంలోకి సీపీఎస్‌ ఉద్యోగులను తెస్తే రాష్ట్ర ఆదాయానికి మించి వేతనాలు, పెన్షన్ల వ్యయం

ఇప్పటికే ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం రాష్ట్ర సొంత ఆదాయంలో చాలా ఎక్కువ

ఆ భారాన్ని రాష్ట్ర ప్రజానీకం, ఆర్థిక వ్యవస్థ భరించ లేవంటున్న ఆర్థిక శాఖ వర్గాలు

సాక్షి, అమరావతి: సీపీఎస్‌ (కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌) ఉద్యోగుల న్యాయబద్ధమైన ఆందోళనను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమే కాకుండా.. వారి ఆర్థిక అభ్యున్నతికి స్థిరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసింది. తద్వారా ఓవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటూ మరోవైపు సీపీఎస్‌ ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం మరింత మెరుగైన పెన్షన్‌ పొందేలా గ్యారెంటీ పెన్షన్‌ స్కీమ్‌ (జీపీఎస్‌)ను ప్రతిపాదించింది. ఇప్పటికే ఉద్యోగుల వేతనాలు, పెన్షన్‌ల వ్యయం రాష్ట్ర సొంత ఆదాయంలో భారీగా ఉంది. సీపీఎస్‌ స్కీమ్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ పథకాన్ని వర్తింపచేస్తే.. రాష్ట్ర సొంత ఆదాయాన్ని మించి వేతనాలు, పెన్షన్లకు వ్యయమవుతుందని ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీన్ని రాష్ట్ర ప్రజలతోపాటు ఆర్థిక వ్యవస్థ భరించలేవని పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఎస్‌ ఉద్యోగుల ఆర్థిక అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం జీపీఎస్‌ను ప్రతిపాదించింది. 


జీపీఎస్‌తోనే అధిక పెన్షన్‌

ప్రస్తుతం సీపీఎస్‌ ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం మూల వేతనం (బేసిక్‌)లో 20 శాతం పెన్షన్‌ వస్తోంది. సీపీఎస్‌ వల్ల ఎంత పెన్షన్‌ వస్తుందనేది పూర్తిగా వడ్డీ రేట్లమీద ఆధారపడి ఉంటుంది. వడ్డీ రేట్లను తగ్గిస్తే వచ్చే పెన్షన్‌ మొత్తం కూడా తగ్గే ప్రమాదం ఉంది. ఉదాహరణకు ఒకప్పుడు బ్యాంకుల్లో నగదు డిపాజిట్‌ చేస్తే 8 శాతం వరకు వడ్డీ ఇచ్చేవారు. ఈ 8 శాతం వడ్డీ ప్రస్తుతం 4 శాతానికి తగ్గిపోయింది. ఇదే ధోరణి కొనసాగితే ఇంకా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. అదే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్‌లో అయితే మూల వేతనంలో 33% పెన్షన్‌ రానుంది. దీనివల్ల పెన్షన్‌ 65 శాతం మేర పెరుగుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఉదాహరణకు ప్రస్తుతం సీపీఎస్‌లో ఉన్న సెకండరీ గ్రేడ్‌ టీచర్‌కు పదవీ విరమణ అనంతరం పెన్షన్‌ రూ.15,647 వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదిత జీపీఎస్‌లో అయితే సెకండరీ గ్రేడ్‌ టీచర్‌కు పదవీ విరమణ అనంతరం రూ.25,856 పెన్షన్‌ రానుంది. అదే ఆఫీసర్‌ సబార్డినేట్‌ ఉద్యోగికి ప్రస్తుత సీపీఎస్‌లో పదవీ విరమణ అనంతరం రూ.9,579 పెన్షన్‌ వస్తుండగా, అదే ఉద్యోగికి ప్రతిపాదిత జీపీఎస్‌లో రూ.15,829 పెన్షన్‌ రానుంది. రాష్ట్ర జనాభా, భవిష్యత్‌ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జీపీఎస్‌ను ప్రతిపాదించినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది.

ఆచరణ సాధ్యం కాకే..

సీపీఎస్‌తో ఉద్యోగులతోపాటు వివిధ ఉద్యోగ సంఘాలు కోరుతున్న మేరకు పాత పెన్షన్‌ పథకాన్ని వర్తింప చేయడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆచరణ సాధ్యం కాదని ఆర్థిక శాఖ గణాంకాలతో సహా వివరించింది. ఇప్పటికే ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం రాష్ట్ర సొంత ఆదాయంలో చాలా ఎక్కువగా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో పాత పెన్షన్‌ పథకాన్ని సీపీఎస్‌ ఉద్యోగులకు వర్తింపచేయడం అసాధ్యమని వెల్లడించింది. ఆర్థిక పరిస్థితులే ఇందుకు కారణమని తెలిపింది. ప్రస్తుతం సీపీఎస్‌ ఉద్యోగుల 20 శాతం కంట్రిబ్యూషన్‌ కొనసాగిస్తూ పాత పెన్షన్‌ పథకం వర్తింపచేస్తే 2100 నాటికి ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం రూ.21,88,047 కోట్లు అవుతుందని వివరించింది. ఇది రాష్ట్ర సొంత ఆదాయంలో 119 శాతంగా ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా రాష్ట్ర రాబడిలో తప్పనిసరి వ్యయం ఏకంగా 395 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం 20 శాతం కంట్రిబ్యూషన్‌ లేకుండా సీపీఎస్‌ ఉద్యోగులకు పాత పెన్షన్‌ స్కీమ్‌ వర్తింపచేస్తే 2100 నాటికి వేతనాలు, పెన్షన్ల వ్యయం రూ.22,81,207 కోట్లు అవుతుందని తెలిపింది. ఇది రాష్ట్ర సొంత ఆదాయంలో 124 శాతమని వెల్లడించింది. కాగా, రాష్ట్ర రాబడిలో తప్పనిసరి వ్యయం 446 శాతం మేర పెరుగుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది.

జీపీఎస్‌ వల్ల మేలు 

ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తోంది. కరోనా, రాష్ట్ర ఆదాయం తగ్గడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులుగా మనం ప్రభుత్వం గురించి కూడా కొంత ఆలోచించాలి. ప్రతిదానిపై వ్యతిరేకంగా ఆలోచించడం సరికాదు. ప్రభుత్వానికి ఉద్యోగులపై కక్ష ఉండదు. జీపీఎస్‌ వల్ల ఉద్యోగులకు మేలు జరుగుతుంది. మన గురించి ఆలోచించే ప్రభుత్వానికి సహకరించడం మంచిది.     కళ్లేపల్లి మధుసూదనరాజు, అధ్యక్షుడు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం

జీపీఎస్‌ను ఆహ్వానిస్తున్నాం..

మెజారిటీ రాష్ట్రాల్లో సీపీఎస్‌ అమలవుతోంది. అయితే తన పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం సీఎం వైఎస్‌ జగన్‌ జీపీఎస్‌ను ప్రతిపాదించారు. పాత పెన్షన్‌ విధానంలో బేసిక్‌పై 50 శాతం పెన్షన్‌ ఇచ్చేవారు. జీపీఎస్‌ కింద ఇప్పుడు 33.5 శాతం పెన్షన్‌ ఇస్తామనే ప్రతిపాదన చాలా బాగుంది. ఉద్యోగులు రిటైర్‌ అయ్యాక మంచిగా ఉండాలని తాను ఆలోచిస్తున్నట్లు పీఆర్సీ ప్రకటించే సమయంలోనే సీఎం ఉద్యోగ సంఘాలతో చెప్పారు. సీపీఎస్‌ విషయంలో బాధపడుతున్న ఉద్యోగులకు 33.5 శాతం పెన్షన్‌ గ్యారంటీ ఆహ్వానించదగ్గ విషయం.

– కె.జాలిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, వైఎస్సార్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad