PRC ఉద్యమంపై ప్రతీకారం! టీచర్ల గొంతు నొక్కుతున్నారు.

 పీఆర్‌సీ ఉద్యమంపై ప్రతీకారం!

టీచర్ల గొంతు నొక్కుతున్నారు.. అరాచకంగా అరెస్టులు

హక్కుల కోసం రోడ్డెక్కడం తప్పా?

టీడీపీ వ్యూహ కమిటీ భేటీలో చంద్రబాబు ఆగ్రహం

అమరావతి, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి):  ప్రశ్నించిన ప్రతి గొంతునూ అణచివేయడమే లక్ష్యంగా జగన్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, తప్పు ఎత్తిచూపితే భరించలేని స్థితికి దిగజారిందని ధ్వజమెత్తారు. సోమవారమిక్కడ టీడీపీ వ్యూహ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఇచ్చిన హామీ అమలు చేయకపోతే ప్రశ్నించే హక్కు ఈ రాష్ట్రంలో పౌరులకు లేదా? నిన్నటిదాకా ప్రతిపక్షాలను వేధించారు. ఇప్పుడు ఉద్యోగులు, ఉపాధ్యాయులపై పడ్డారు. అరాచకంగా అరెస్టులు చేస్తున్నారు. హక్కుల కోసం రోడ్డెక్కడం తప్పా? ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమకు రావలసిన వాటి కోసం పోరాటం చేయడం నేరమా? ఎన్నికల ముందు వారితో ఇలాగే మాట్లాడారా? ఉపాధ్యాయుల గొంతు నొక్కడంతోపాటు రాష్ట్రంలో విద్యా రంగాన్ని నాశనం చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంవత్సరాన్ని జూన్‌ 12 నుంచి జూలై 4కి మార్చడం ఏమిటి?’ అని విరుచుకుపడ్డారు.

యువత భవిష్యత్‌ అగమ్యగోచరం..

జగన్‌ తన అసమర్ధ పాలనతో రాష్ట్రంలో యువత భవిష్యత్‌ను కాలరాశారని చంద్రబాబు విమర్శించారు. పెట్టుబడులు లేక పరిశ్రమలు రాక ఉపాధి దొరక్క వారి భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారిందని, యువత తీవ్ర అసంతృప్తి, ఆవేదనతో ఉన్నారని చెప్పారు. ‘ఏ తప్పును ఎత్తిచూపినా ఎదుటివారిపై బురదజల్లి తప్పించుకోవాలని చూడడం ఈ ప్రభుత్వంలో ప్రతివారికి అలవాటై పోయింది. రాష్ట్రంలో వందల మంది మహిళలపై తీవ్ర స్థాయి నేరాలు చోటు చేసుకుంటే ఎంత మందికి న్యాయం చేశారు? ఎంత మందిని శిక్షించారు? పోలవరం ప్రాజెక్టును ఈ ప్రభుత్వం తన అసమర్థతకు బలి చేసింది. డయాఫ్రం వాల్‌ దెబ్బ తింటే మూడేళ్లు ఎందుకు దాచి పెట్టారు? పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టినా మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుని ప్రాజెక్టును నాశనం చేశారు. మిగులు విద్యుత్‌ ఉన్న రాష్ట్రంలో కరెంటు కోతలు తెచ్చి పెట్టారు. ఫలితంగా వ్యవసాయం, పరిశ్రమలు, ఆక్వా పరిశ్రమ దెబ్బతిన్నాయి. ఆదాయాలు పడిపోయాయి’ అని ఆవేదన వ్యక్తంచేశారు. దళిత వర్గాలకు టీడీపీ ప్రభుత్వంలో జరిగినంత మేలు మరే ప్రభుత్వంలో జరగలేదని, జగన్‌ సర్కారు వారిని రాజకీయంగా వాడుకుంటూ టీడీపీపై వ్యతిరేక ప్రచారం చేస్తోందని విమర్శించారు. ‘రాష్ట్రంలో అంటరానితనం నిర్మూలించి దళిత వర్గాలను ముందుకు తేవడంపై అధ్యయనం కోసం ప్రత్యేకంగా పున్నయ్య కమిషన్‌ వేశాం.

ఆయన సిఫారసులెన్నిటినో అమలు చేశాం. రెండు గ్లాసుల విధానాన్ని నిర్మూలించాం. ఎస్సీ, ఎస్టీ చట్టాలపై అవగాహన కల్పించాం. ఆ వర్గాల సంక్షేమానికి నిధుల లభ్యత పెంచాం. ఆ వర్గాల్లో విద్యావకాశాలు పెంచడానికి గురుకుల పాఠశాలలు పెట్టడంతోపాటు విదేశీ విద్యకు సాయం అందించాం. జగన్‌రెడ్డి ఇందులో ఏదీ చేయలేదు’ అని దుయ్యబట్టారు.

కొత్త నేరాలకు దారులు..

మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కేసులో సాక్ష్యాధారాలను కోర్టులో చోరీ చేయడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిందని, నేరగాళ్లు వినూత్నంగా నేరాలు చేయడానికి వైసీపీ ప్రభుత్వం దారులు చూపిస్తోందని టీడీపీ వ్యూహ కమిటీ విమర్శించింది. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వ్యవహార శైలిని తప్పుబట్టింది. ‘అత్యాచార బాధితులకు న్యాయం చేయకుండా ప్రశ్నించిన వారిపై రాజకీయ కక్ష సాధింపులకు మహిళా కమిషన్‌ దిగుతోంది. ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే రాష్ట్రంలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు పెరుగుతున్నా ప్రశ్నించకుండా ప్రతిపక్షాలపై కక్ష సాధింపులకు దిగుతోంది’ అని విమర్శించింది.

తిరుమల వెళ్తున్న భక్తుల కారును ఒంగోలులో బలవంతంగా లాక్కోవడమే కాకుండా ఇప్పుడు ఆ కుటుంబాన్ని విచారణ పేరుతో వేధించడం దారుణమని పేర్కొంది. బాధిత కుటుంబానికి క్షమాపణ చెప్పాల్సింది పోయి నోటీసులు ఇచ్చి వేధించడం ఏమిటని నిలదీసింది. వైసీపీ ప్రభుత్వ బాదుళ్లపై చేపట్టిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. టీడీపీ సభ్యత్వ నమోదును యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేయాలని వ్యూహ కమిటీ నిర్ణయించింది.


Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad