Beautiful location: అక్కడ ఒకే రోజు మూడు కాలాలు..! వర్షం, పొగమంచు, మండే ఎండలు,ఎక్కడంటే.

 Beautiful location: అక్కడ ఒకే రోజు మూడు కాలాలు..! వర్షం, పొగమంచు, మండే ఎండలు, తక్కువ ధరలో అద్భుత టూరిజం..ఎక్కడంటే.


వేసవి వచ్చిందంటే చాలు ఎండలు మండిపోతుంటాయ్..! ఇంట్లో ఉంటే ఉక్క పోత.. బయటకు వెళ్తే మాడుపగిలే ఎండలు. దీంతో ఇక.. కాస్త చల్లదనం కలిగే ప్రాంతాల వైపు వెళుతుంటారు పర్యాటకులు. జమ్మూకాశ్మీర్.. సిమ్లా.. డార్జిలింగ్.. ఊటి. ఎందుకంటే.. ఎక్కడ ఎండలు మండుతున్నా.. ఆయా ప్రాంతాల్లోనే కాస్త శీతల పరిస్థితులు ఉంటాయి. దీంతో ఎంతో మంది ప్రత్యేకంగా టూర్లకు ప్లాన్లు వేసుకునే వెళ్తుంటారు. కానీ ఈసారి తెలుగు ప్రజలు.. ఆంధ్ర ఊటీ వైపు దృష్టిసారించారు. ఎందుకంటే ఈ వేసవిలో కాస్త భిన్నంగా అరకులో వాతావరణం కనిపిస్తోంది. తెల్లవారుజామున నిప్పులు కురిసే భానుడు బదులు… దట్టమైన పొగ మంచు కురుస్తోంది.

అరకు అనగానే ఎత్తైన కొండలు.. ఆ కొండలపై నుంచి జాలువారే జలపాతాలు.. దట్టమైన అడవి.. ప్రకృతి సోయగాలు. ఇలా అడుగడుగునా అద్భుత ప్రకృతి సుందర దృశ్యాలే..! ఇవన్నీ వర్షాకాలం, శీతాకాలంలో ఈ ప్రకృతి దృశ్యాలు కనువిందు చేస్తుంటాయి. దట్టమైన పొగ మంచు కురుస్తూ ఉంటుంది. కొండలమధ్య మేఘాలు కమ్ముకుని సుందరంగా కనిపిస్తుంటాయి. అందుకే శీతాకాలం సీజన్‌లో పర్యాటకుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతుంది. కానీ ఈసారి మాత్రం మండువేసవిలోనూ అదే స్థాయిలో పర్యాటకులు వస్తున్నారు. భిన్నమైన వాతావరణంలో అందరితో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు.


 

మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో.. ఆంధ్రా ఊటీ అరకులో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ప్రతి ఏటా వేసవిలో ఎండలు మండిపోతూ ఉక్కరి బిక్కిరి చేస్తుంటాయి. కానీ ఈసారి ఈ ఎండలు ఉంటున్నాయి,.. కాకపోతే మధ్యాహ్నమే..! తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు దట్టమైన పొగ మంచు కమ్ముకుని కనిపిస్తోంది. కొండల్లో, లోయల్లో పొగమంచు అలముకొని ఉంటుంది. మధ్యాహ్నం కాస్త ఎండ కలిగినా.. సాయంత్రం అవగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. మేఘాలు కమ్ముకుని విపరీతమైన వర్షం కురుస్తోంది.

 ఒకే రోజులో పొగమంచు, ఎండ, వర్షం.. ఇలా భిన్నమైన వాతావరణం గత కొద్ది రోజులుగా అరకులో కనిపిస్తోంది. దీంతో ఆహ్లాద కరమైన వాతావరణంలో తిరుగుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు పర్యాటకులు. విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ఆ నోటా ఈ నోటా పాకడంతో అరకుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad