Cyclone Asani : అసని తుఫాను ఎలా కదులుతుందో మీరు కూడా చూడవచ్చు.
తుఫాను ప్రభావం వల్ల వర్షాలు, ఈదురుగాలులు వస్తే మనం ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తుంది. ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే తప్పక బయటికి వెళ్లాల్సి రావచ్చు. అలాంటి సమయాల్లో తుఫాను ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవడం తప్పనిసరి అవుతుంది. ప్రస్తుతం అగ్నేయ బంగాళఖాతంలో అసని తుఫాను (Cyclone Asani) కేంద్రీకృతమైంది. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్రతో పాటు చాలా ప్రాంతాల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం మచిలీపట్నానికి సమీపంలో పశ్చిమ వాయువ్య దిశగా ఈ తుఫాను పయనిస్తోంది. అయితే ఈ తుఫాను ఎలా ప్రయాణిస్తోంది… ఏ దిశగా కదులుతోంది.. ఎలాంటి ప్రభావం చూపుతోందన్న విషయాలను మీరే స్వయంగా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. శాటిలైట్, రాడార్ చిత్రాలను చూడవచ్చు. భారత వాతావరణ శాఖ (India Meteorological Department) అధికారిక వెబ్‌సైట్‌లో ఈ వివరాలను చూడవచ్చు. ఎలాగో చూడండి.
ఎలా తెలుసుకోవాలి..?
అసని తుఫాను ఏ దిశగా కదులుతున్నదో మనం ప్రభుత్వ వెబ్‌సైట్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. ప్రస్తుతం ఎక్కడ కేంద్రీకృతమైందో స్పష్టంగా చూడవచ్చు. ఈ సమాచారం అంతా భారత వాతావరణ శాఖ ( India Meteorological Department - IMD ) అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఇందుకోసం ఆ వెబ్‌సైట్ (https://mausam.imd.gov.in/) లోకి వెళ్లాలి. దీంట్లో తుఫాను లైవ్ ట్రాకింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. IMD వెబ్‌సైట్‌లో ఎలా ట్రాక్ చేయాలి?
తుఫాను కదలికలు, వివరాలను చూడగలిగేలా మూడు పద్దతులు IMD వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. శాటిలైట్, రాడార్, శాటిలైట్ వ్యూ విత్ లైట్నింగ్ అనే ఆప్షన్లు ఉంటాయి.
శాటిలైట్ (Satellite)
ప్రస్తుతం అసని తుఫాను కచ్చితంగా ఏ ప్రాంతంలో కేంద్రీకృతమైందో శాటిలైట్ ఆప్షన్ ద్వారా చూడవచ్చు. శాటిలైట్ ఎప్పటికప్పుడు అందించే ఇమేజ్‌లే ఇవి.
రాడార్ (Radar)
భారత వాతావరణ శాఖ..ప్రత్యేకమైన రాడార్ వ్యవస్థను కలిగి ఉంది. దీని ద్వారా వాతారణంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుస్తుంది. అసని తుఫాను వల్ల ఏఏ ప్రాంతాలపై ప్రభావం ఉంటుందో ఈ రాడార్ ఆప్షన్ వల్ల మనకు తెలుస్తుంది.
శాటిలైట్ విత్ లైట్నింగ్ (Satellite with Lightning)
వర్షాలకు సంబంధించిన విషయాలను ఈ ఫీచర్ చూపిస్తుంది. వానలు, ఉరుములు ఏ ప్రాంతంలో, ఏ మేరకు ఉండే అవకాశం ఉందన్నది శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఈ ఫీచర్ తెలుపుతుంది. ఎక్కడ అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందో ఈ ట్రాకింగ్ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు.
ప్రస్తుతం తుఫాను గమనానికి సంబంధించిన వివరాలను ఈ ఫీచర్ల ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే తుఫానుకు సంబంధించిన మరిన్ని వివరాలను రిపోర్టుల రూపంలో ఐఎండీ ఎప్పటికప్పుడు పబ్లిష్ చేస్తుంటుంది. అన్నీ IMD వెబ్‌సైట్‌లో ఉంటాయి. అలెర్ట్‌లను కూడా ఇస్తుంది. విభిన్న ప్రాంతాల్లో రోజువారి వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా తెలియజేస్తుంటుంది.
మరోవైపు రేపు సాయంత్రం అసని తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తర కోస్తాలో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, కురుస్తున్నాయి. ఒడిశాపైన కూడా తీవ్ర ప్రభావం పడుతోంది