School in Bus: భవిష్యత్‌ పాఠాలు ఇలానేనా..? బస్సునే బడిగా మార్చిన వైనం


ఓ రాష్ట్ర ప్రభుత్వం తుక్కుగా అమ్మాల్సిన బస్సులను తరగతి గదులుగా మార్చేస్తోంది. ఏదో ఒక పనిమీద వేరే ఊరికి వెళ్తే తప్ప బస్సు ఎక్కని కొందరు పిల్లలిప్పుడు.. అదే బస్సులో ఎంచక్కా పాఠాలు నేర్చుకుంటున్నారు. కేరళ రాష్ట్రంలో చాలా బస్సులు డొక్కుగా మారడంతో కొన్ని నెలలుగా మూలన పడేసారు. మరోవైపు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో గదుల కొరతతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారట. దాంతో ఈ రెండు సమస్యలకు పరిష్కారంగా.. తుక్కుగా మారాల్సిన పాత బస్సులను.. అక్కడి రవాణా, విద్యాశాఖ ఆధ్వర్యంలో తరగతి గదులుగా తీర్చిదిద్దారు.ఇటీవలే తిరువనంతపురం పట్టణంలోని మనకౌడ్‌ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో తరగతి గదిగా మార్చిన ఓ ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. 

ఈ బడిలో దాదాపు 1600 మంది విద్యార్థులున్నారు. వారిలో కొందరు ఈ కొత్త విద్యాసంవత్సరం నుంచి.. ఆకట్టుకునే రంగుల్లో రకరకాల బెంచీలూ, వివిధ బొమ్మల చిత్రాలతో ముస్తాబైన ఈ డబుల్‌ డెక్కర్‌ బస్సులో పాఠాలు నేర్చుకుంటున్నారు. అంతేకాదు ఈ బస్సులో టీవీ, ఏసీ సౌకర్యం కూడా ఏర్పాటు చేసారట. పిల్లలంతా ఎంచక్కా ఆడుతూపాడుతూ చదువుకునేలా టీచర్లు అన్ని ఏర్పాట్లు చేశారు. త్వరలోనే మరోబస్సును కూడా తరగతి గదిగా రెడీ చేస్తారట. ఇక ఈ బస్సులో రెండో అంతస్తులో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తారట. వీటివల్ల పిల్లలకు బడికి రావడానికి ఆసక్తి కలుగుతుందంటున్నారు. ఈ బడి బస్సుల ఆవరణల్లో పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు. ‘క్లాస్‌రూం ఆన్‌ వీల్స్‌’ పేరిట కాలం చెల్లిన బస్సులన్నింటినీ తరగతి గదులుగా మార్చి.. ప్రభుత్వ బడులకు అందిస్తామని కేరళ రాష్ట్ర రవాణా శాఖ ఇప్పటికే ప్రకటించింది

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad