TS: టీచర్ల ఆస్తులపై పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు - వెంటనే నిలిపివేస్తూ ప్రభుత్వ ఆదేశాలు
apschools13June 25, 2022
0
హైదరాబాద్: ఉపాధ్యాయుల ఆస్తులపై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. స్థిర, చరాస్తుల క్రయవిక్రయాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. నల్గొండ జిల్లా చందంపేట మండలం గుంటిపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహమ్మద్ జావేద్ అలీ విధులకు హాజరుకాకుండా రాజకీయ కార్యకలాపాలు, స్థిరాస్తి వ్యాపారాలు, వక్ఫ్‌బోర్డు సెటిల్‌మెంట్లలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని 2021లో ఆరోపణలు వచ్చాయి. విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం.. జావేద్ అలీపై వచ్చిన ఆరోపణల్లో చాలా వరకు నిజమేనని తేల్చింది. శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిఫార్స్ చేసింది. జావేద్ అలీపై చర్యలతో పాటు పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ఉద్యోగులందరికీ సంబంధించి ఉత్తర్వులు ఇవ్వాలని గతేడాది ఏప్రిల్‌లో విజిలెన్స్ విభాగం సిఫార్స్ చేసింది. సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు ఉండాలని సూచించింది. సిబ్బంది ఏటా ఆస్తుల వివరాలు సమర్పించడంతో పాటు, స్థిర..చరాస్తి క్రయ విక్రయాలకు ముందస్తు అనుమతి పొందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం సిఫార్సు మేరకు పాఠశాల విద్యాశాఖ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంతకీ ఈ సర్క్యూలర్ ఏముంది?
– APCS (1964) సర్వీస్ రూల్స్ 9లోని సబ్‌రూల్‌ను గుర్తు చేసిన సర్క్యూలర్
– టీచర్లంతా ఏడాదికోసారి ఆదాయం లెక్కలు చూపించాల్సిందే
– స్థిర, చర ఆస్తులు అమ్మినా, కొన్నా ముందస్తు అనుమతి తప్పనిసరి
– తన పేరుమీద, కుటుంబీకుల పేరు మీద కొన్నాసరే లెక్కలు చూపించాలి
– కొనడానికి తగిన ఆదాయవనరు లెక్కలు చూపించాలి..!
సమర్పించాల్సిన లెక్కలేంటి?
– కారు, మోటార్‌సైకిల్, ఇతర వాహనం ఏది కొన్నా చెప్పాల్సిందే
– ఏసీ, టీవీ, వీసీఆర్, ఫ్రిజ్.. ఇతర ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏం కొన్ని చెప్పాల్సిందే
– బంగారం, వెండి, ఆభరణాలు, పాత్రలు ఏం కొన్నా చెప్పాల్సిందే
– బ్యాంక్ డిపాజిట్స్, బ్యాంక్ బ్యాలెన్స్‌లు, ఇతర పెట్టుబడుల గుట్టు విప్పాల్సిందే
టీచర్లపై కక్షకట్టిన సీఎం: బండి సంజయ్
టీచర్ల ఆస్తుల విషయంలో విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేయడంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్లపై సీఎం కేసీఆర్ కక్షగట్టారని ఆరోపించారు. ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు వెల్లడించాలనే ఆదేశాలు కక్ష సాధింపులో భాగమేనన్నారు. సీఎం కేసీఆర్ ఆస్తులను ఏటా ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలు వెల్లడించే ధైర్యముందా? అని నిలదీశారు.
LATEST NEWS:25.06.2022 : ఆ జీవో వెంటనే నిలిపివేస్తూ ప్రభుత్వ ఆదేశాలు
టీచర్ల ఆస్తిని ప్రకటించాలనే ఉత్తర్వులపై వెనక్కి తగ్గింది తెలంగాణ ప్రభుత్వం. విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఉత్తర్వులను నిలిపివేయాలని ద్యాశాఖ కార్యదర్శి మంత్రి సబిత ఆదేశాలు జారీ చేశారు. నిలిపివేత ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని సూచించారు. అంతకుముందు విద్యాశాఖ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాదు టీచర్లు ఫ్లాట్ కొనుగోలు చేసినా, ప్లాట్ కొనుగోలు చేసినా, ఖరీదైన ఆభరణాలు కొన్నా లెక్కలు చెప్పాలని ఆదేశిస్తూ సర్క్యూలర్ జారీ చేశారు. అయితే తాజాగా ఆ ఉత్తర్వులను నిలిపివేయాలని మంత్రి ఆదేశించారు. టీచర్లలో గందరగోళం ఏర్పడటం.. ప్రతి పక్షాలకు ఇదో అస్త్రంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విజిలెన్స్ విభాగం సిఫారసుల ఆధారంగా ఉత్తర్వులు జారీ చేశారని, పొరపాటు జరిగిందని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. వెంటనే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.