స్కూలు దూరమై.. నడక భారమై సొమ్మసిల్లి పడిపోయిన ఏడేళ్ల పిల్లాడు
గతేడాది వరకు దగ్గరలోని పాఠశాలకు
విలీనంతో 5 కి.మీ. నడవాల్సిన దుస్థితి...
ప్రార్థన సమయంలో పిల్లాడికి అస్వస్థత
మడకశిర టౌన్, జూలై 21: సర్కార్ 3, 4, 5 తరగతులను హైస్కూల్లో విలీనం చేయడంతో.. పాపం ఆ పిల్లాడికి కొత్త కష్టాలు మొదలయ్యాయి. పాఠశాల కోసం పొరుగూరుకు రోజూ రానూపోనూ 5 కి.మీ. నడ వాల్సిన పరిస్థితి వచ్చింది. అంతదూరం నడి చి అలసిపోయిన ఆ విద్యార్థి స్కూల్లో ప్రార్థన సమయంలో సొమ్ముసిల్లి పడిపోయాడు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మడకశిర నగర పంచాయతీ పరిధిలోని అక్కంపల్లి గ్రామానికి చెందిన వినయ్ మూడో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు ఉపాధికోసం బెంగళూరుకు వలస వెళ్లారు.
వినయ్ తాత హనుమయ్య వద్ద ఉంటూ బడికి వెళుతున్నాడు. రెండో తరగతి వరకు దగ్గరలోని ఆదిరెడ్డిపాళ్యం ప్రాథమిక పాఠశాలలో చదివాడు. ఈ ఏడాది 3, 4, 5 తరగతులను మడకశిర పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. దీంతో రోజూ వినయ్ పుస్తకాల సంచితో 5 కి.మీ. దూరం నడవాల్సి వస్తోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం ప్రార్థన సమయంలో సొమ్ముసిల్లి పడిపోవడంతో ఉపాధ్యాయులు ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.