టార్గెట్‌ టీచర్‌! ఒక్కొక్కరికి 42 పీరియడ్లు .. ‘మిగులు’ పేరుతో సర్దుబాటు

 టార్గెట్‌ టీచర్‌! ఒక్కొక్కరికి 42 పీరియడ్లు

ఉపాధ్యాయులపై పెరుగుతున్న ఒత్తిళ్లు

హేతుబద్ధీకరణతో పెనుభారం

ఒక్కొక్కరికి 42 పీరియడ్లు

‘మిగులు’ పేరుతో సర్దుబాటు

జిల్లావ్యాప్తంగా 3015 సర్‌ప్లస్‌ టీచర్లు 

2వేలకుపైగా పోస్టులు మాయం

ఉపాధ్యాయులపై మరో పిడుగు. సవరించిన చైల్డ్‌ ఇన్ఫోడేటా ప్రకారం టీచర్ల సర్‌ప్లస్‌ (మిగులు), హేతుబద్ధీకరణల అనంతరం పాఠశాలల వారీగా ఉపాధ్యాయ పోస్టుల సంఖ్యను విద్యా శాఖ విడుదల చేసింది. దీని ప్రకారం జిల్లాలో భారీగా టీచర్‌ పోస్టులు గల్లంతు కానున్నాయి. అంతేగాక మిగులు టీచర్లను అవసరం ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేయనున్నారు. ఈ రెండు కారణాలతో ఉన్న ఉపాధ్యాయులపై పనిభారం పెరగనుంది. 

నెల్లూరు (విద్య), సెప్టెంబరు 12 : రాష్ట్ర ప్రభుత్వం(YCP Govt.) తమపై కక్ష కట్టిందని ఉపాధ్యాయులు(Teachers) ఆందోళన చెందుతున్నట్లుగానే తాజా పరిణామాలు జరుగుతున్నాయి. విద్యాశాఖ(Education Department) తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో 1:20 చొప్పున ఉపాధ్యాయుడు, విద్యార్థుల నిష్పత్తిన టీచర్‌ పోస్టులను నిర్ధారిస్తారు. ఈ లెక్కన జిల్లాలో ఏకోపాధ్యాయ పాఠశాలలు సంఖ్య పెరిగిపోతుందని టీచర్లు చెబుతున్నారు. ఒకవేళ టీచర్‌ సెలవుపెడితే సదరు పాఠశాలను నిర్వహించేదెవరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయుల పరిస్థితి మరింత కఠినంగా మారనుంది. 3 నుంచి 8వ తరగతి వరకు ఉన్న యూపీ స్కూళ్లలో 97లోపు విద్యార్థులు ఉంటే అక్కడ స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌ ఉపాధ్యాయులను తొలగించి కేవలం ఎస్జీటీ పోస్టులనే ఇస్తారు. 1:30 నిష్పత్తి ప్రకారం ముగ్గురు ఎస్జీటీలు మాత్రమే ఉంటారు. హైస్కూళ్ల విషయానికి వస్తే సబ్జెక్ట్‌ల వారీగా టీచర్ల సంఖ్యను సెక్షన్‌ల వారీగా నిర్ధారించారు. ఒక్కో సెక్షన్‌లో విద్యార్థుల సంఖ్యను పెంచేసి ఒకరిద్దరు సబ్జెక్ట్‌ టీచర్లపైనే పనిభారం పెంచునున్నారు. 

పెరగనున్న పనిభారం 

తాజా లెక్కలతో హైస్కూల్‌ ఉపాధ్యాయులపై పనిభారం అధికం కానుంది. ప్రస్తుతం ఉన్న పాఠశాలల్లో ఒక్కో ఉపాధ్యాయుడు వారానికి 28 నుంచి 32 పీరియడ్లు  బోధిస్తుండగా, ఇకపై గరిష్ఠంగా 42 పీరియడ్లు బోధించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సబ్జెక్ట్‌ పీరియడ్లు వారానికి 36తోపాటు మరో సబ్జెక్ట్‌ను అదనంగా కరికులంగా చేర్చి మరో ఆరు పీరియడ్లు బోధించేలా పనిభారం పెంచనున్నారు. సవరించిన జీఓ 128 ప్రకారం హైస్కూళ్లలో సెక్షన్‌ల సంఖ్యను నిర్ధారించి టీచరు పోస్టులను రేషనలైజేషన్‌ అనంతరం సర్‌ప్లస్‌ టీచర్లను ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేయడంతో మిగతా ఉపాధ్యాయులపై అదనపు పనిభారం పడుతుందని స్పష్టంగా తెలుస్తోంది. 

2వేల పోస్టులు మాయం

జిల్లావ్యాప్తంగా 2వేలకుపైగా టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయాల్సిన అవసరం లేకుండా తాజాగా చేపట్టిన రేషనలైజేషన్‌ను వినియోగించుకోనున్నారు. వాస్తవంగా ఈ ఖాళీలను డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌తో భర్తీ చేయాలి. కానీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందంటూ ఈ పోస్టుల ఊసెత్తకపోగా, ప్రభుత్వం కొన్ని పోస్టులను తన ఆధీనంలో ఉంచుకుంటోంది. దీంతో భవిష్యత్‌లో ఈ పోస్టులన్నింటికీ ప్రభుత్వం మంగళం పాడినట్లేనని ఉపాధ్యాయులు చెబుతున్నారు. 

3,015 మంది మిగులు టీచర్లు

జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులు, రేషనలైజేషన్లపై జరుగుతున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. అధికారిక లెక్కల ప్రకారం సర్‌ప్ల్‌స (మిగులు) ఉపాధ్యాయులు జిల్లాలో 3,015 మంది ఉన్నట్లు ధ్రువీకరించారు. ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీ నాటి చైల్డ్‌ ఇన్ఫో డేటా ఆధారంగా పాఠశాలల వారీగా సబ్జెక్ట్‌ టీచర్ల సంఖ్యను నిర్ధారించారు. వీటిలో జడ్పీ విభాగంలో హెచ్‌ఎంలు 18, ఎస్‌ఏ తెలుగు 209, హిందీ 51, ఫిజికల్‌ సైన్స్‌ 235, బయాలజీ 154, సోషల్‌ 207, ఎస్‌జీటీలు 1700, పీఎస్‌ హెచ్‌ఎంలు 351, పీఈటీ 11 కలిపి  2,936 సరప్లస్‌ ఉపాధ్యాయులు ఉన్నారు. అలాగే ప్రభుత్వ విభాగంలో ఎస్‌ఏ తెలుగు 10, ఫిజికల్‌ సైన్స్‌ 4, బయాలజీ 9, సోషల్‌ 5, ఎస్‌జీటీలు 37, పీఈటీలు 6, లాంగ్వేజ్‌ పండిట్‌ తెలుగు 4, హిందీ 4  కలిపి మొత్తం 79 మంది సరప్లస్‌ ఉపాధ్యాయులు ఉన్నారు. జడ్పీ మేనేజ్‌మెంట్‌, ప్రభుత్వ మేనేజ్‌మెంట్లలో కలిపి మొత్తం 3,015 సరప్లస్‌ ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. అలాగే ఉపాధ్యాయ ఖాళీల విషయానికి వస్తే జడ్పీ మేనేజ్‌మెంట్‌లో ఎస్‌ఏ ఇంగ్లీష్‌ 70, మ్యాథ్స్‌ 36, పీడీలు 50, ఉర్దూ 18 పోస్టులు, ప్రభుత్వ మేనేజ్‌మెంట్‌లో హెచ్‌ఎం 1, ఎస్‌ఏ హిందీ 6, ఇంగ్లీష్‌ 8, మ్యాథ్స్‌ 1, పీడీ 7 ఖాళీలున్నాయి. రెండు మేనేజ్‌మెంట్‌లలో కలిపి 201 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నిర్దారించారు. జిల్లాలో సరప్లస్‌ వేకెన్సీలు, ఖాళీల సంఖ్య ఓ కొలిక్కి రావడంతో త్వరలోనే టీచర్ల పదోన్నతులకు, బదిలీలకు షెడ్యూల్‌ విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ సన్నద్దమవుతోంది. జిల్లా విద్యాశాఖ విడుదల చేసిన ఈ జాబితాలపై డీఈఓ,  డిప్యూటీ ఈఓలు, ఎంఈఓలు తుది పరిశీలన చేసి స్వల్పమార్పులు చేర్పులు చేపడతారని జిల్లా విద్యాశాఖ సిబ్బంది తెలిపారు.  

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad