ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఉండగా.. ఇప్పుడు సడలించింది. ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ.. ఈనెల 22 నుంచి 31 వరకు బదిలీలకు అనుమతిస్తూ.. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే.. కొన్ని రూల్స్ కూడా పెట్టింది. 2023 ఏప్రిల్ నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులు బదిలీకి అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. రెండేళ్ల సర్వీసు పూర్తయిన వారు కోరితే బదిలీకి అవకాశం కల్పిస్తున్నారు.
DOWNLOAD AP EMPLOYEES TRANSFERS GO MS NO 71 Dt:17.05.2023
ఉద్యోగుల బదిలీల్లో గిరిజన ప్రాంతాల్లోని పోస్టులను ముందుగా బదిలీల ద్వారా భర్తీ చేసి ఆ తర్వాత ఇతర ప్రాంతాలపై దృష్టి సారిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. వాణిజ్య పన్నులు, స్టాంపుల రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, రవాణా, వ్యవసాయ శాఖల వంటి రెవెన్యూ శాఖలు కూడా నిబంధనలకు అనుగుణంగా బదిలీల ప్రక్రియను మే 31లోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశాయి. అయితే.. ఈ బదిలీల ప్రక్రియకు మినహాయింపు ఇస్తూ పాఠశాల విద్య, ఇంటర్, టెక్నికల్ ఉన్నత విద్యాశాఖలు ఉత్తర్వులు జారీ చేశాయి. బదిలీల ప్రక్రియలో ఏసీబీ కేసులు, విజిలెన్స్ విచారణలో పెండింగ్‌లో ఉన్న వారికి సమాచారం ఇవ్వాలని ఆయా శాఖలను ఆర్థిక శాఖ ఆదేశించింది. జూన్ 1 నుంచి మళ్లీ ఉద్యోగుల బదిలీలపై నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేశారు.
గతేడాది జూన్‌లో కూడా ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 7 నుంచి 17వ తేదీ వరకు బదిలీల ప్రక్రియ చేపట్టారు. ఒకేచోట 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు బదిలీకి అవకాశం కల్పించారు. అలాగే వ్యక్తిగత అభ్యర్థనలు, పరిపాలనా సౌలభ్యం ఆధారంగా.. ఆ తర్వాత బదిలీల ప్రక్రియ చేపట్టారు.