సరిహద్దుల్లో భారత్ ను కవ్విస్తున్న పొరుగు దేశం చైనాకు గట్టి గా బుద్ధి
చెప్పేందుకు భారత్ సమాయత్తమవుతోంది. అయితే ఈ సారి సైన్యంతో కాదు. చైనా నుంచి మనం
దిగుమతి చేసుకునే అనేక రకాల ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు పెంచటం ద్వారా డ్రాగన్
దేశానికి చెక్ పెట్టాలని ఇండియా వ్యూహం. ఇదే జరిగితే చైనాకు ఆర్థికంగా ఇబ్బందులు
తలెత్తుతాయి. ఆ దేశం నుంచి జరగాల్సిన ఎగుమతులు తగ్గిపోయి అక్కడి కంపెనీలకు
ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి. ప్రజల ఉపాధి అవకాశాలపై కూడా ప్రభావం పడుతుంది.
కాబట్టి, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఎంపిక
చేసిన కొన్ని అతి ముఖ్యమైన ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాలు పెంచేయాలని, చైనా
ఉత్పత్తులకు ఇచ్చే లైసెన్సులను మరింత కఠినతరం చేయాలని భావిస్తోంది. దీంతో ఒకే
దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంలా భారత్ కు మేలు జరగనుంది. ఒకటేమో, బోర్డర్లో
చైనా దూకుడు తగ్గించేందుకు మార్గం సుగమం అవుతుంది. మరోవైపు మన దేశంలోనే సంబంధిత
ప్రోడక్టులు తయారు చేసే కంపెనీలకు మేలు జరుగుతుంది.
భారత్ లో తయారీ కి ఊతం...
ఎప్పటి నుంచో భారత్ లో తయారీ (MAKE IN
INDIA) కార్యక్రమాన్ని చేపడుతున్నా.... అనుకున్నంత పురోగతి లేదు. కానీ చైనాపై
అధిక సుంకాల భారం మోపితే ఆ మేరకు భారత పరిశ్రమలకు మేలు జరుగుతుంది. కొత్త
విభాగాల్లో కి విస్తరించి ఉత్పత్తి పెంచేందుకు వాటికి అవకాశం లభిస్తుంది.
ముఖ్యంగా మనం ఎలక్ట్రానిక్స్, మెడికల్ డివైస్లు సహా అనేక రకాల కీలక ముడిపదార్ధాలు
చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. వీటన్నిటిని మనం భారత్ లోనే తయారు
చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం చైనా సరఫరా చేసే ధరలకు ఇండియా లో వాటిని ఉత్పత్తి
చేయలేకపోతున్నాం. అదే చైనా ఉత్పత్తుల ధరలు పెరిగితే అప్పుడు మన దేశ ప్రొడక్టులకు
గిరాకీ పెరుగుతుంది. అది మేక్ ఇన్ ఇండియా కు ఊతమిచ్చేందుకు దోహదపడుతుందని
విశ్లేషకులు భావిస్తున్నారు. అది ఏమైనా, చైనా కు మాత్రం సరైన రీతిలో బుద్ధి
చెప్పాల్సిందేనని ప్రతి ఒక్క భారతీయుడూ కోరుకుంటున్న విషయం విదితమే.