SSC విద్యార్థులకు నేరుగా మెమోలు!



హైదరాబాద్‌: రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు నేరుగా మెమోలను పంపించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం ఇటీవల ఆ పరీక్షలను రద్దుచేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విద్యార్థులందరినీ పాస్‌ చేసింది కూడా. అయితే ఇక విద్యార్థులకు వారి ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌ ఇవ్వడమే మిగిలింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పరీక్షల విభాగం  విద్యార్థుల ఇంటర్నల్‌ మార్కులు, వారికి సంబంధించిన వివరాల క్రోడీకరణ పనిని చేపట్టింది. ఇపుడు ఎంతమంది పాస్‌ అయ్యారు?, ఎంతమంది ఫెయిల్‌ అయ్యారనేది లేదు. పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసిన విద్యార్థులంతా పాస్‌ కాబట్టి వారికి మెమోలు జారీచేసే ప్రక్రియపైనే దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఫలితాల ప్రకటన అవసరం లేదని అధికారులు భావిస్తున్నారు. 

లక్షన్నర మందికి 10/10 జీపీఏ! 
రాష్ట్రవ్యాప్తంగా మార్చిలో జరగాల్సిన పరీక్షలకు 5,34,903 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇపుడు వారంతా పాస్‌ కాబట్టి వారికి ఇంటర్నల్స్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌ ఇవ్వడమే మిగిలింది. ప్రతి సబ్జెక్టులో 20 ఇంటర్నల్‌ మార్కులకు ఎన్ని వచ్చాయో వాటిని ఐదింతలుచేసి సబ్జెక్టుల వారీగా గ్రేడ్, గ్రేడ్‌ పాయింట్, మొత్తంగా గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌ (జీపీఏ) ఇవ్వడమే ప్రధానం. అందుకోసం పరీక్షల విభాగం చర్యలు చేపట్టింది. అవసరమైతే జీపీఏ వారీగా వివరాలను పది రోజుల్లోగా వెబ్‌సైట్లో పొందుపరిచేందుకు పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. దాంతోపాటే విద్యార్థులకు నేరుగా మెమోలు పంపించేలా చర్యలు చేపట్టింది. 

అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం పది పరీక్షలకు హాజరైన విద్యార్థుల్లో దాదాపు లక్షన్నర మందికి 10/10 జీపీఏ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. పరీక్షలు రాసేందుకు ఫీజు చెల్లించిన వారిలో రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులే దాదాపు 3.75 లక్షల మంది వరకు ఉన్నారు. వారిలో లక్షన్నర మంది విద్యార్థులకు యాజమాన్యాలు ఇంటర్నల్‌ మా ర్కులను 20కి 20 వేసినట్లు సమాచారం. వారందరికీ 10/10 జీపీఏ వచ్చే అవకాశం ఉంది.

అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ లేదు.. 

ఈసారి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ లేదు. పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ పాస్‌చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఫెయిలయ్యే విద్యార్థులు లేనట్లే. అందుకే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ నిర్వహణ ఉండదని విద్యాశాఖ చెబుతోంది

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad