కరోనా వ్యాక్సిన్‌ రేస్‌ - కొన్ని వాస్తవాలు

కోవిడ్‌19 ప్రపంచ వ్యాపితంగా ఎంత వేగంగా విస్తరిస్తున్నదో అంతే వేగంగా దానికి విరుగుడు -కరోనా వ్యాక్సిన్‌- కనిపెట్టడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచంలోని వందలాది లాబరేటరీల్లో జరుగుతున్న ప్రయోగాల్లో సుమారు 218 వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్క వ్యాక్సిన్‌ కూడా పూర్తిగా విజయవంతం కాకపోయినప్పటికీ సుమారు రెండు డజన్ల వ్యాక్సిన్‌లు ప్రాథమిక స్థాయిలను దాటుకుని క్లినికల్‌ పరీక్షల దశకు చేరుకున్నాయి. వీటిలో మూడు నాలుగు పురోగమన స్థితిలో ఉండి ప్రపంచానికి కొన్ని మాసాల్లో వ్యాక్సిన్‌ అందించే ఆశలు కల్పిస్తున్నాయి. 



వాటిలో ఒకటి బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనికా-ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాయాల సంయుక్త ఆధ్వర్యంలో రూపొందుతోంది. రెండు వ్యాక్సిన్‌లు చైనాకు చెందిన సినోఫామ్‌, సినోవాక్‌ కంపెనీలవి. అమెరికాకు చెందిన మోడెర్నా సంస్థ రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ కూడా వీటితో పోటీ పడుతోంది. నోవల్‌ కరోనా వైరస్‌ 2019 డిసెంబర్‌లో బయటపడడంతోనే ప్రపంచ వ్యాపితంగా ఈ వ్యాధినుండి రక్షణ కోసం వ్యాక్సిన్‌ల తయారీకి ప్రయత్నాలు ప్రారంభమైనాయి. 

వైరస్‌ మొదట చైనాలోని వూహాన్‌ నగరంలో కనబడింది. వెనువెంటనే చైనా శాస్త్రవేత్తలు ఈ కొత్త వైరస్‌ జన్యు నిర్మాణాన్ని కనిపెట్టి 2020 జనవరి 11న ఇంటర్‌నెట్‌లో పెట్టేశారు. ఇది ప్రపంచ వ్యాపితంగా పరిశోధనకు తోడ్పడింది. ఫిబ్రవరి నాటికే అనేక లేబరేటరీల్లో వ్యాక్సిన్‌ తయారీ ప్రయోగాలు ప్రారంభమైనాయి. సాధారణంగా ఒక వ్యాక్సిన్‌ తయారీకి అనేక సంవత్సరాలు ఒక్కోసారి 10 అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు కూడా పడుతుంది. ఇంత చేసినా చివరి దశలో వ్యాక్సిన్‌ అనుకున్న లక్ష్యాలు సాధించడంలో విఫలం కావచ్చు. అప్పుడు వ్యాక్సిన్‌ తయారీ కోసం ఖర్చు చేసిన కోట్లాది రూపాయలు, శ్రమ వృధా అవుతాయి. అందువల్లనే వ్యాక్సిన్‌ పరిశోధనల్లో విశ్వవిద్యాలయాలు, పరిశోధనాశాలలు బహుళజాతి సంస్థలతో చేతులు కలుపుతుంటాయి. వ్యాక్సిన్‌ విజయవంతమైతే బహుళజాతి సంస్థలు అపారమైన లాభాలు పోగుచేసుకుంటాయి. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్‌ తయారీ కూడా దాదాపు 60 శాతం బహుళజాతి సంస్థల ఆధ్వర్యంలో జరుగుతోంది. వ్యాక్సిన్‌ తయారీలో మూడు ప్రధానమైన దశలుంటాయి. మొదటిది ప్రణాళిక వేసుకుని వ్యాక్సిన్‌ తయారు చేయడం. రెండవది ప్రీక్లినికల్‌ దశ. తయారైన వ్యాక్సిన్‌ను వివిధ రకాల జంతువుల మీద ప్రయోగించి పరీక్షిస్తారు. ఈ దశలో సరైన ఫలితాలు వస్తే మనుషులపై ప్రయోగించే మూడవ దశలోకి ప్రవేశిస్తారు.

మూడవది క్లినికల్‌ దశ. ఇందులో మళ్లీ మూడు దశలుంటాయి. 1వ దశలో కొద్ది మంది అత్యంత ఆరోగ్యవంతులైన వాలంటీర్లపై ప్రయోగించి వ్యాక్సిన్‌ సురక్షితమైనదా కాదా తెలుసుకుంటారు. 2వ దశలో వ్యాక్సిన్‌ సామర్ధ్యాన్ని పరీక్షిస్తారు. సామర్ధ్యం 60 దాటక పోతే ఆ వ్యాక్సిన్‌ పనిచేయదనే లెక్క. 70 దాటితే అది విజయవంతమైనట్లు. ఈ దశ దాటితే మూడవ దశ ప్రయోగాలు వేలాది మంది ప్రజలపై చేస్తారు. పిల్లల మీద, వృద్ధుల మీద, గర్బిణీల మీద వ్యాక్సిన్‌ ప్రభావాన్ని పరిశీలిస్తారు. ఈ దశ పూర్తియి మంచి ఫలితాలు వచ్చాక వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేస్తారు. వీటితోబాటు వ్యాక్సిన్‌ను ఎలా ఎక్కించాలి (కండరాలకు ఇంజక్షన్‌, చర్మానికి టీకాల రూపంలో, నోటి చుక్కలు వగైరా), ఎలా నిల్వ ఉంచాలి, ఎలా రవాణా చేయాలి వంటి అంశాలను కూడా నిర్ణయిస్తారు. ఆయా దశల్లో వచ్చిన పరిశోధనల డేటాను పరిశీలించి ఆమోదించే రెగ్యులేటరీ సంస్థలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి. అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) రెగ్యులేటరీ సంస్థగా వ్యవహరిస్తోంది. ప్రతి వ్యాక్సిన్‌ చివరి దశకు చేరుతుందన్న గ్యారంటీ లేదు. ఇప్పటి వరకు ఉన్న అనుభవాన్ని బట్టి మూడవ దశలో 84 నుండి 90 శాతం వాక్సిన్‌లు విఫలమైనాయి.

సాధారణంగా వ్యాక్సిన్‌ తయారీకి అనేక సంవత్సరాలు పడుతుంది. కానీ కరోనా ప్రమాదం ప్రపంచాన్ని ముంచెత్తుతోంది కనుక ఈ వ్యాక్సిన్‌ తయారీని వేగవంతం చేసే విధంగా రెగ్యులేటరీ నిబంధనలు రూపొందించబడ్డాయి. ఏళ్ల పాటు జరిగే క్లినికల్‌ పరీక్షలను కొద్ది నెలలకు కుదించారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తి విషయంలో అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున సమన్వయం జరుగుతోంది. అలాగే దేశాల మధ్య, కార్పొరేట్‌ సంస్థల మధ్య పోటీ కూడా నెలకొని ఉంది. వ్యాక్సిన్‌ను అతి త్వరగా ఉత్పత్తి చేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో అంటువ్యాధుల నివారణ ఐక్యసంఘటన (సిఇపిఐ-సెపి) పనిచేస్తున్నది. ఇది కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తి కోసం 200 కోట్ల డాలర్ల (సుమారు రూ.14,000 కోట్లు) నిధిని ఏర్పాటు చేసింది. మే 4వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు మరో 810 కోట్ల డాలర్ల నిధి ఇవ్వడానికి 40 దేశాలు అంగీకరించాయి. ఇవి కాకుండా మిలిందా ఫౌండేషన్‌, ఇంకా అనేక కార్పొరేట్‌ దాతృత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సహాయం ప్రకటించాయి. వ్యాక్సిన్‌ ఉత్పత్తి, పరిశోధనల్లో చైనా ముందుపీఠిన ఉంది. ఇప్పటివరకు 22 వ్యాక్సిన్‌లు క్లినికల్‌ దశకు చేరుకోగా వాటిలో అత్యధికంగా 8 వ్యాక్సిన్‌లు చైనావే. మూడవ దశ క్లినికల్‌ పరీక్షలకు చేరుకున్న నాలుగు వ్యాక్సిన్‌లలో రెండు చైనావే. వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో చైనాకు గతంలో పెద్ద అనుభవం లేదు. కానీ ఇటీవలి కాలంలో టెక్నాలజీలో ఉరకలు వేస్తున్న చైనా ఈ రంగంలో కూడా ప్రథమ స్థానానికి చేరుకున్నది. 

చైనా ప్రభుత్వం, సైన్యం, ప్రయివేటు సంస్థలు కలిసి కట్టుగా వ్యాక్సిన్‌ ఉత్పత్తికి కృషి చేస్తున్నాయి. భారత దేశానికి సంబంధించి ఏడు వ్యాక్సిన్‌ల ఉత్పత్తికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతిచ్చింది. వాటిలో హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ తయారు చేసిన కోవాక్సిన్‌ క్లినికల్‌ పరీక్షలకు అనుమతి పొందింది. 385 మంది వాలంటీర్లపై మొదటి దశ క్లినికల్‌ పరీక్షలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగు తున్నాయి. అహమ్మదాబాద్‌కు చెందిన జైడస్‌ కాడిలా తయారు చేసిన జైకోవ్‌-డి వాక్సిన్‌ కూడా ఇటీవలే మొదటి దశ క్లినికల్‌ పరీక్షలకు అనుమతి పొందింది. మిగిలిన ఐదు వ్యాక్సిన్‌లు ప్రాథమిక దశల్లో ఉన్నాయి. వ్యాక్సిన్‌ల ఉత్పత్తిలో భారత్‌కు సుదీర్ఘ అనుభవం ఉంది. ప్రపంచంలోని 60 నుండి 70 శాతం వ్యాక్సిన్‌లను భారత దేశమే ఎగుమతి చేస్తోంది.

పట్టికలో మొదటి స్థానానికి చేరుకున్న నాలుగు వ్యాక్సిన్‌లు ఈ ఏడాది చివర లేక వచ్చే ఏడాది జనవరికి ఉత్పత్తి ప్రారంభించవచ్చు. నిజానికి క్లినికల్‌ పరీక్షల మూడో దశలోనే వ్యాక్సిన్‌ ఉత్పత్తికి సన్నాహాలు ప్రారంభిస్తున్నాయి.

వ్యాక్సిన్‌ తయారైన తరువాత దాని పంపిణీలో అనేక సవాళ్లు ఎదురవుతాయి.
1. వ్యాక్సిన్‌ ఓకె అయితే ప్రజలందరికీ సరిపడా ఉత్పత్తి చేయడం పెద్ద సవాలు. ఒక డోస్‌ వ్యాక్సిన్‌ ఇస్తే సరిపోతుందా లేక రెండు డోసులు ఇవ్వాలా అన్నది ఇంకా తేలలేదు. 1,2 క్లినికల్‌ పరీక్షలు చెబుతున్నదేమంటే కొందరికి ఒక డోస్‌ ఇస్తే సరిపోయింది. కానీ దాని సామర్ధ్యం కొంతకాలానికి తగ్గిపోతోంది. అప్పుడు మళ్లీ కరోనా సోకే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు రెండు డోస్‌ల వ్యాక్సిన్‌ వేయాల్సి ఉంటుంది. జానాభా అంతటికీ ఒక్కో డోస్‌ వేయాలంటేనే 700 కోట్ల డోస్‌లు కావాలి. ఇది ఉత్పత్తి చేయడానికే కనీసం ఒక సంవత్సరం పడుతుందంటున్నారు. మరి రెండు డోస్‌లు వేయాలంటే...!
2. ఉత్పత్తి అయిన వ్యాకిన్‌ ముందుగా ఎవరికి ఇవ్వాలి, తరువాత ఎవరికి అన్నది రెండో సవాలు. దేశాలు సహజంగానే తమ జాతీయ ప్రయోజనాలను ముందుకు తెస్తాయి. అలాగే బహుళజాతి మందుల కంపెనీల నుండి ధనిక దేశాలు, ధనికులు ముందుగా కొనుగోలు చేస్తే, పేద దేశాలకు, పేదలకు వ్యాక్సిన్‌ అందకుండా పోయే ప్రమాదం ఉంది. ఉదాహరణకు ఆస్ట్రాజనికా-ఆక్స్‌ఫర్డ్‌ విశ్వ విద్యాలయం తయారు చేస్తున్న వ్యాక్సిన్‌ 30 కోట్ల డోస్‌ల కోసం అమెరికా ఇప్పటికే 120 కోట్ల డాలర్ల బయానా ఇచ్చేసింది. తమ దేశానికీ, ప్రపంచ దేశాల అవసరాలకు సరిపడా ఉత్పత్తి చేస్తామని చైనా గత మే నెలలో ప్రకటించింది.
3. వ్యాక్సిన్‌ ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటాయా అన్నది మరో సమస్య. కొద్ది కాలంలోనే కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న బహుళజాతి సంస్థలు వ్యాక్సిన్‌ నుండి లాభాలు దండుకోడానికి ప్రయత్నిస్తే సామాన్యునికి, పేద దేశాలకు అవి అందుబాటులో ఉండకపోవచ్చు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ, సెపి వివిధ మార్గాల ద్వారా తమ వద్దకు వచ్చిన నిధులను వ్యాక్సిన్‌ సమతుల్య పంపిణీకి ఉపయోగించాలని నిర్ణయించాయి. అంతే కాకుండా వ్యాక్సిన్‌లను మొదట ఆరోగ్య రంగంలో సేవలు చేస్తున్న వారికీ, తరువాత వృద్ధులు, ఇతర రోగాలతో బాధపడుతున్న వారికీ ఇచ్చే విధంగా ప్రాధాన్యతలు నిర్ణయించాలని సూచించాయి. లాభాలే పరమావధిగా భావించే బహుళజాతి సంస్థలు ఈ సూచనలను ఎంతవరకు పాటిస్తాయో వేచి చూడాలి.

* ఎస్‌. వెంకట్రావు సెల్‌ : 9490099333

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad