- పక్కాప్లానింగ్‌తో కరోనా నియంత్రణ- అధికార వికేంద్రీకరణతో జిల్లాల్లో సిబ్బందికి పూర్తిస్వేచ్ఛ- ఫలితాన్నిస్తున్న.. టెస్టింగ్.. ఐసోలేషన్.. కంటైన్మెంట్..- కోవిడ్ ఆస్పత్రుల్లో సీరియస్ కేసులకు చికిత్స- స్వల్ప, మధ్యస్థాయి లక్షణాలున్న వారికి వేరుగా 'ఫస్ట్‌లైన్ కేంద్రాలు'- ఇతర రాష్ట్రాల్ని ఆలోచింపజేస్తున్న విజయన్ ప్రభుత్వ చర్యలు'
'కరోనాను ఎదుర్కోవాలి. నియంత్రించాలి. మీరేం చేస్తారో...మీ ఆలోచనలేంటో చెప్పండి.
అధికారాన్ని ఏమేరకు వినియోగిస్తారో వినియోగించండి. మీకు పూర్తి
స్వేచ్ఛనిస్తున్నాం. కరోనా ఓడిపోవాలి. వైరస్ వ్యాప్తిని అరికట్టాలి. జిల్లాల్లో
స్వంతప్రణాళికలతో ముందుకు వెళ్లండి...' కేరళ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్లకు,
పోలీస్ ఉన్నతాధికారులకు, ప్రభుత్వ వైద్య నిపుణులకు పినరరు విజయన్ ప్రభుత్వం
చెప్పిన మాటలివి. ఈ వ్యూహం కొద్ది వారాల్లోనే సత్ఫలితాల్ని ఇచ్చింది. ప్రతిరోజూ
నమోదవుతున్న పాజిటివ్ కేసుల (జులై 14నాటికి) సంఖ్య 350-450 మధ్య ఉంటున్నది.
ఇప్పుడక్కడ ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో రాజకీయ నాయకత్వంపై ఒక భరోసా..నమ్మకం
పెరిగాయి. ఈ విధానంపైనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చర్చ జరుగుతున్నది.
కేరళ తరహా విధానాన్ని అమలు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని ఇప్పటికే
మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు ప్రకటించాయి. కేరళ మోడల్‌ను తమ రాష్ట్రాల్లో అమలు
చేసేందుకు మిగతా ప్రభుత్వాలు కూడా చర్చిస్తున్నాయి.
న్యూఢిల్లీ: మానవాళిపై కోవిడ్-19 చేస్తున్నదాడి మామూలు దాడి కాదు. ఇది కేవలం
ఆరోగ్య సంక్షోభానికే పరిమితం కాలేదు. ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది.
ఇప్పుడాస్థాయి దాటి మొత్తం మానవాళే సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఏర్పడింది.
భారతదేశంలో వైరస్ క్రమంగా విస్తరిస్తున్న తీరు ప్రజల్ని తీవ్ర ఆందోళనకు
గురిచేస్తున్నది. ఇప్పుడు విడుదలవుతున్న గణాంకాల్ని పరిశీలిస్తే, లాక్‌డౌన్
తర్వాత వైరస్‌వ్యాప్తిని కేరళ విజ యవంతంగా నియంత్రించగలిగింది. మొదటి దశ, రెండో
దశను పకడ్బందీగా అడ్డుకోవటంలో కేరళ అను భవాలు దేశాన్ని ఆలోచింపజేస్తున్నాయి.
అక్కడి వైద్య వ్యవస్థ ఎలా పనిచేసింది? జిల్లా స్థాయిలో ఎలాంటి వ్యూహాలు
అమలుజేశారు? అనే వాటిపై ఇతరరాష్ట్రాల ఉన్నతాధికారులు సమాచారాన్ని
సేకరిస్తున్నారు. జాతీ య మీడియాలో కూడా ఆసక్తికర వార్తాకథనాలు వెలు వడుతున్నాయి.
అందులో పేర్కొన్న ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..
పనికొచ్చిన 'నిఫా వైరస్' అనుభవం
కేరళలో ఆరోగ్య వ్యవస్థ కరోనా వైరస్ మహ మ్మారిని ఎలా ఎదుర్కొంది? అనేదానిపై
డాక్టర్ ఆరతీ అజరుకుమార్, డాక్టర్ ఆయేషా మెహర్, డాక్టర్ జోసెఫ్‌లు
'కోవిడ్-19 మేనేజ్‌మెంట్ అండ్ కంట్రోల్: ద కేరళ స్టోరీ' అనే పేరుతో ఒక
అధ్యయనం విడుదలచేశారు. జనవరి 30న రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైంది. ఇటలీ
నుంచి వచ్చిన ఒక కుటుంబం లో ముగ్గురికి వైరస్ సోకిందని ఫిబ్రవరి 19న బయట పడింది.
దాంతో విదేశీ ప్రయాణాలు చేసి వస్తున్న వారిపై పక్కాగా నిఘా వేశారు. 2018లో 'నిఫా'
వైర స్‌ను విజయవంతంగా అడ్డుకున్న అనుభవం ఇప్పుడు కేరళకు బాగా పనికొచ్చింది.
ప్రభుత్వ యంత్రాంగం ఆరోగ్య వ్యవస్థను వేగంగా సిద్ధం చేసింది.
త్రిముఖ వ్యూహం
కాంటాక్ట్ ట్రేసింగ్, టెస్టింగ్, ఐసోలేషన్ వైరస్‌ను నియంత్రించడానికి కేరళ
అనుసరించిన త్రిముఖ వ్యూహమిది. మొదట కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి
కాంటాక్ట్స్‌ను పక్కాగా ట్రేసింగ్ చేశారు. ఇండెక్స్ కేస్, కాంటాక్ట్ కేస్,
సస్పెక్ట్ కేస్ ఇలా వివిధ రకాలుగా విడ గొట్టి వైరస్ గొలుసు చివరి వరకూ
వెళ్లారు. ఇందు కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేసుకున్నారు. రెండోది
టెస్టింగ్ కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతు లను మెరుగుపర్చారు. అనుమానితుల్ని,
లక్షణాలున్న వారిని వేరు చేసి జాబితా రూపొందించారు. పరీక్షలు జరిపి..వీరిని
ఇంటికే పరిమితం చేశారు. వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలుండి 'పాజిటివ్' అని
తేలినవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మంచి ఆహారం, వైద్య సేవలు రోగుల్లో
భయాన్ని పోగొట్టి త్వరగా కోలుకునేలా చేశాయి.
ఎవరేం చేయాలి?
రాజకీయ, ఆరోగ్య వ్యవస్థ, సామాజిక సహకారం, సాధారణ ప్రజలుఇలా నాలుగు విభాగాలుగా
విడగొట్టి బాధ్యతలు అప్పజెప్పారు. ఈ నాలుగు వ్యవస్థల మధ్య సమన్వయం జరపడానికి
ప్రతి జిల్లాలో కంట్రోల్ రూములు ఏర్పాటుచేశారు. ఎక్కడికక్కడ అధికారాన్ని
వికేంద్రీకరించారు. కంటైన్మెంట్లు ఏర్పాటుచేయటంలో జిల్లా అధికారులకు పూర్తి
స్వేచ్ఛనిచ్చారు. క్వారంటైన్ విధించిన ప్రాంతానికి సామాజిక కార్యకర్తలను, ఆశా
వర్కర్లను...పంపి...అక్కడి ప్రజల నిత్యావసరాలను తీర్చే ఏర్పాటుచేశారు. చిన్న
పిల్లల వస్తువుల దగ్గర్నుంచీ...పశువులకు, జంతువులకు అవసరమయ్యే ఆహారం వరకు అన్నీ
సరఫరా అయ్యేట్టు చూశారు.
కోవిడ్ ఆస్పత్రుల ఏర్పాటు
వైరస్ బారినపడినవారిలో సీరియస్ కేసులు, వృద్ధుల్ని గుర్తించి వారందర్నీ కోవిడ్
ఆస్పత్రులకు తరలించారు. మిగతావారిని 'కోవిడ్ ఫస్ట్ లైన్ ట్రీట్‌మెంట్
సెంటర్ల'కు పంపారు. స్వల్ప, మధ్యస్థాయి లక్షణాలున్నవారందరికీ ఇక్కడే చికిత్స
అందిస్తున్నారు. తద్వారా కోవిడ్ ఆస్పత్రుల వైద్య సిబ్బందిపై పని ఒత్తిడి లేకుండా
చేశారు. ఫస్ట్ లైన్ ట్రీట్‌మెంట్ సెంటర్లలో వైరస్ బాధితులకు తాగునీరు,
ఇంటర్నెట్, బాత్‌రూమ్ వసతులున్న సింగిల్ రూమ్ ఇచ్చారు. పౌష్టికాహారాన్ని
ఉచితంగా సరఫరా చేశారు.
సమాచారమే ఆయుధం
రవాణా, పర్యాటకం, ఉన్నత విద్య, సాధారణ విద్య, పౌర సరఫరా, ఆహార భద్రత, విద్యుత్,
తాగునీరు, మహిళలు, బాలల అభివృద్ధి, ఐటీ....అన్ని విభాగాల్లో కోవిడ్ సెల్స్‌ను
ఏర్పాటుచేశారు. వాటిని రాష్ట్ర ఆరోగ్యశాఖ నోడల్ విభాగాలతో అనుసంధానిం చారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఏ పనైనా ఈ కోవిడ్ సెల్స్ ద్వారానే జరుగుతున్నది.
కుటుంబశ్రీ వర్కర్లు, ఆశా వర్కర్లు, సామాజిక కార్యకర్తలు, పోలీసులు వీరందరి
సేవల్ని వినియోగించుకున్నారు. జూన్ 12నాటికి నమోదైన కేసుల్లో 74శాతం
పురుషులున్నా రు. ఏ ఏ వయసుల వారు వైరస్ బారిన ఎక్కువగా పడుతున్నారో గుర్తించి ఆ
దిశగా చర్యలు చేపట్టారు.