లోక్డౌన్ కాలం మారటోరియం రుణాలపై వడ్డీ మాఫీ చేస్తారా

 లాక్‌డౌన్ నేపథ్యంలో ఆరుమాసాల మారటోరియం వ్యవధిలో రుణాలపై వడ్డీ వసూలు చేసే విషయంలో కేంద్రం తీరును తప్పుబడుతూ దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో... మార్చి నెల నుంచి ఆగస్టు మాసం వరకు రుణ చెల్లింపుదారులకు ఆర్బీఐ ఆరు మాసాల మారటోరియం వసతి కల్పించడం తెలిసిందే. అయితే మారటోరియం వ్యవధిలోనూ రుణాలపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని ఇప్పటికే ఆర్బీఐ స్పష్టంచేసింది. ఆ మేరకు మారటోరియం విషయంలో బ్యాంకులు తమ రుణ చెల్లింపుదారులకు క్లారిటీ ఇచ్చాయి. అయితే మారటోరియం వ్యవధిలో రుణాలపై వడ్డీ వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది.

ఈ విషయంలో కేంద్రం తీరు పట్ల జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం కాస్త అసహనం వ్యక్తంచేసింది.

మారటోరియంపై వడ్డీ విషయంలో ఆర్బీఐ పేరు చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించొద్దంటూ కేంద్రానికి ధర్మాసనం చురకలంటించింది. విపత్తు నిర్వహణ చట్టం కింద కేంద్రం వద్ద పలు అధికారాలు ఉన్నా...మారటోరియంపై వడ్డీ విషయంలో ఆర్బీఐ పేరు చెప్పి కేంద్రం తప్పించుకోవాలని చూడటం సరికాదని పేర్కొంది. ఎప్పుడూ వ్యాపార ధోరణితోనే కాకుండా...ప్రజల ఇబ్బందులను కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. మారటోరియం ప్రయోజనాలు ప్రజలకు దక్కేలా చూపాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని..ఈ నేపథ్యంలో మారటోరియంపై వడ్డీ మాఫీ చేయాలని వస్తున్న అభ్యర్థనల విషయంలోనూ కేంద్రమే ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా..ఈ విషయంలో ఆర్బీఐతో సమన్వయంతో కేంద్రం పనిచేస్తున్నట్లు చెప్పారు. ఆర్బీఐ పేరు చెప్పి కేంద్రం తప్పించుకోవాలని అనుకుంటున్నట్లు ధర్మాసనం పేర్కొనడం సరికాదన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ స్పందన తెలియజేసేందుకు ఒక వారం గడువు ఇవ్వాలని కోరారు. ఆయన విజ్ఞప్తిని మన్నించిన ధర్మాసనం...సెప్టెంబర్ 1కల్లా ప్రభుత్వం తన స్పందన తెలియజేయాలని ఆదేశించింది.

మారటోరియం వ్యవధిలో రుణాలపై బ్యాంకులు వడ్డీని మాఫీ చేస్తాయని రుణ చెల్లింపుదారులు ఆశలు పెట్టుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ విషయంలో మరో వారం రోజుల్లో కేంద్రం స్పష్టత ఇవ్వనుండటం రుణ చెల్లింపుదారుల్లో ఆసక్తిరేపుతోంది.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad