GUIDELINES TO CONDUCT SCHOOLS

 కేంద్ర ప్రభుత్వం ఈనెల 21 నుంచి 9,10 తరగతుల విద్యార్థులకు తల్లిదండ్రుల అంగీకారంతో పాఠశాలలకు వచ్చే అవకాశం కల్పించడంతో ఆమేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. పాఠశాలల నిర్వహణకు ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసి ఉపాధ్యాయులు అందరూ అనుసరించాలని సూచించింది.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యావారధి కార్యక్రమం అమల్లో భాగంగా ఆన్‌లైన్‌ పాఠ్యాంశాల బోధన, విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడం తదితరాలకు 50శాతం మంది ఉపాధ్యాయులు హాజరుకావాల్సి ఉంటుంది. మిగిలిన సగమంది ఉపాధ్యాయులు ఆ తరువాత రోజు పాఠశాలకు రావాలి. ఇలా ఆయా పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులు సగం మంది చొప్పున రోజు విడిచి రోజు పాఠశాలకు హాజరు కావాలి.కంటైన్‌మెంట్‌ జోన్ల పరిధిలో ఉన్న వారికి మాత్రం అనుమతి లేదు.

ఎక్కడి వారు అక్కడే

జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు వసతిగృహాలు, గురుకులాలు, కేజీబీవీ, ఇతర రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చదువుతున్నారు. అలాంటి విద్యార్థులందరూ తమ నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉన్న పాఠశాలలను సందర్శించవచ్చని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఆ పాఠశాలల ఉపాధ్యాయులు ఈ విద్యార్థుల సందేహాలను నివృత్తిచేయడంతోపాటు పాఠ్యాంశాలపై అవగాహన కల్పించాలి.

అమలు చేస్తాం

ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను అన్ని పాఠశాలల్లో అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు మార్గదర్శకాల పత్రాలను అందజేశాం. ఒకటి నుంచి 8వ తరగతి విద్యార్థులను మాత్రం పాఠశాలకు పిలవకూడదు. వారికి ఇప్పటివరకు అమలు చేస్తున్న కార్యక్రమాలను యథావిధిగా కొనసాగించాలి. దీనికోసం రూపొందించిన అభ్యాస యాప్‌ను ఉపాధ్యాయులు అందరూ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. - యూవీ సుబ్బారావు, డీవైఈవో, మచిలీపట్నం

ఇవీ నిబంధనలు

  1. ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్‌లు విధిగా ధరించాలి. హాజరైన వారందరూ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.
  2. అవసరం మేరకు శానిటైజర్లను కనీసం 20 సెకన్ల పాటు వినియోగించాలి
  3. దగ్గు జలుబు, ముక్కు కారడం వంటి లక్షణాలు వారు తప్పనిసరిగా టిష్యూ, చేతిరుమాలు వినియోగించాలి. 
  4. తుమ్మడం, దగ్గడం లాంటివి చేసేటప్పుడు కచ్చితంగా ముంజేతిని అడ్డుగా పెట్టుకోవాలి.
  5. కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే ముందుగానే స్వచ్ఛందంగా తెలియజేయాలి
  6. బహిరంగంగా ఉమ్మివేయడం నిషేధం
  7. అందరూ ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని చరవాణిల్లో నిక్షిప్తం చేసుకోవాలి
  8. పాఠశాల ఆవరణలోని తరగతి గదులు, ప్రయోగశాలలు అందరూ వినియోగించే ప్రదేశాలతోపాటు తరచూ వినియోగించే వస్తువులను శానిటైజేషన్‌ చేయించాలి.
  9.  విద్యార్థులు కూర్చునే బల్లలు కుర్చీల మధ్య ఆరడుగుల దూరం ఉండేలా చూడాలి. 
  10. విద్యార్థుల రాతపుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, నీళ్ల సీసాలు లాంటివి ఇచ్చిపుచ్చుకోకుండా చూడాలి.

 ఈ నిబంధనలు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కచ్చితంగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కంటైన్‌మెంట్‌ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాలకు చెందిన 9,10, ఇంటర్‌ విద్యార్థులు తమ సందేహాల నివృత్తి కోసం తల్లిదండ్రుల అంగీకారంతో పాఠశాలలు, కళాశాలలను సందర్శించవచ్ఛు హైటెక్‌(ఆన్‌లైన్‌ సౌకర్యాలు ఉన్నవారు), లోటెక్‌(రేడియో, దూరదర్శన్‌ అందుబాటులో ఉన్నవారు), నోటెక్‌ (కంప్యూటర్‌, చరవాణి, రేడియో, దూరదర్శన్‌ లేనివారు) విద్యార్థులందరికీ ఉపాధ్యాయులు గతేడాది పాఠ్యాంశాలను పునఃసమీక్షించాలి.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad