యూట్యూబర్లకు గూగుల్‌ షాక్..

యూట్యూబ్‌ చానల్‌ ద్వారా సంపాదించే సొమ్ముకు అమెరికాలో పన్ను కట్టాల్సిందే

అమెరికన్‌ వీక్షకుల ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను వసూలు చేసేలా గూగుల్‌ కొత్త విధానం

యూఎస్‌తో ఒప్పందాలున్న దేశాలకు 15% పన్ను

ఒప్పందాలు లేని దేశాలవారికైతే 30 శాతం పన్ను

మే 31 లోపు వివరాలివ్వకుంటే మొత్తం ఆదాయంపై 24% పన్ను చెల్లించాల్సిందే


 మీకు యూట్యూబ్‌ చానల్‌ ఉందా? దాని ద్వారా మీకు ఆదాయం వస్తోందా? మీ వీడియోలను చూసేవారిలో అమెరికన్లు/లేదా అమెరికాలో ఉండేవారు ఎక్కువగా ఉంటారా? మీకు వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం అమెరికా వీక్షకుల నుంచే వస్తోందా? అయితే గూగుల్‌ నుంచి మీకొక దుర్వార్త. అమెరికన్‌ వీక్షకుల వల్ల మీకు వచ్చే ఆదాయంలో కొంత మేర అక్కడ పన్నుగా చెల్లించాల్సిందే. ఈ వ్యవహారాన్ని కొద్దిగా అర్థమయ్యేలా చెప్పుకొందాం.

సెంట్రల్‌ డెస్క్‌ :

సాధారణంగా.. ప్రముఖ యూట్యూబ్‌ చానళ్లకు ప్రపంచవ్యాప్తంగా వీక్షకులుంటారు. ఆయా చానళ్లలోని వీడియోల్లో గూగుల్‌ వాణిజ్య ప్రకటనలను ప్రదర్శిస్తుంది. ఆ ప్రకటనలను వీక్షకులు స్కిప్‌ చేయకుండా చూస్తే.. యూట్యూబ్‌ చానళ్ల యజమానులకు గూగుల్‌ కొంత మొత్తాన్ని చెల్లిస్తుంటుంది. అలాగే.. యూట్యూబ్‌ ప్రీమియం ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా సబ్‌స్ర్కైబర్ల సంఖ్య ఆధారంగా చానళ్లకు చెల్లిస్తుంది. ఇంకా.. సూపర్‌ చాట్లు, సూపర్‌ స్టికర్ల ద్వారా, చానల్‌ మెంబర్‌షిప్‌ ద్వారా కూడా యూట్యూబ్‌ చానళ్లకు ఆదాయం వస్తుంది. ఇలా వచ్చే ఆదాయంపై యూట్యూబర్లు తమతమ దేశాల్లో పన్ను చెల్లిస్తారు. కానీ.. ఇలా వచ్చే ఆదాయంలో అమెరికన్‌ వీక్షకుల ద్వారా వచ్చే సొమ్ము మీద అమెరికాలో పన్ను కట్టాలన్నది గూగుల్‌ కొత్త విధానం. అయితే పన్ను శాతం అందరికీ ఒకేలాగా ఉండదు. అమెరికాతో పన్ను ఒప్పందాలున్న దేశాల వారి నుంచి గూగుల్‌ 15% పన్ను వసూలు చేయనుంది. 

అమెరికాతో పన్ను ఒప్పందాలు లేని దేశాల వారి నుంచి 30ు పన్ను వసూలు చేయనుంది. అందుకోసమే.. పన్ను వివరాలను యాడ్‌సెన్స్‌ అకౌంట్‌ ద్వారా సమర్పించాలంటూ గూగుల్‌ సంస్థ యూట్యూబర్లందరికీ మెయిల్స్‌ పంపిస్తోంది. ఆ వివరాలను మే 31లోగా పంపాల్సి ఉంటుంది. ఇందుకోసం.. ఇండివిడ్యువల్‌ యూట్యూబర్లయితే ‘డబ్ల్యూ-8బీఈఎన్‌’ ఫామ్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. అదే కంపెనీలైతే (వార్తాసంస్థల యూట్యూబ్‌ చానళ్ల వంటివి) ‘డబ్ల్యూ-8బీఈఎన్‌-ఈ’ పత్రాన్ని పూర్తిచేయాలి. మనదేశానికి అమెరికాతో పన్ను ఒప్పందాలున్నాయి కాబట్టి.. భారతీయులు, భారతీయ కంపెనీల చానళ్లు అమెరికన్‌ వీక్షకుల ద్వారా సంపాదించే సొమ్ములో 15ు పన్నుగా చెల్లిస్తే సరిపోతుంది.

ఇదీ లెక్క..

భారతదేశానికి చెందిన ఒక యూట్యూబర్‌కు నెలకు 1000 డాలర్ల ఆదాయం యూట్యూబ్‌ ద్వారా వస్తోందనుకోండి. అందులో అమెరికన్‌ వీక్షకుల ద్వారా వచ్చే ఆదాయం 100 డాలర్లు అనుకోండి. గూగుల్‌ కొత్త విధానం ప్రకారం.. ఆ యూట్యూబర్‌ తనకు వచ్చే ఆదాయంలో కట్టాల్సిన పన్ను వివరాలను గూగుల్‌కు సమర్పిస్తే.. అమెరికా వీక్షకుల ద్వారా సంపాదించే 100 డాలర్లపై 15ు పన్నును (అంటే 15 డాలర్లు మినహాయించుకుని) మిగతా సొమ్మును గూగుల్‌ చెల్లిస్తుంది.

అమెరికాతో పన్ను ఒప్పందాలు లేని దేశానికి చెందిన యూట్యూబర్‌.. గూగుల్‌ కోరినట్టుగా పన్ను వివరాలు సమ్పర్పిస్తే.. అమెరికన్‌ వీక్షకుల ద్వారా అతడికి వచ్చే ఆదాయంలో 30 శాతాన్ని పన్నుగా గూగుల్‌ మినహాయించుకుని మిగతా సొమ్మును చెల్లిస్తుంది.

ఏ దేశానికి చెందిన యూట్యూబరైనా సరే.. గూగుల్‌ కోరినట్టుగా పన్ను వివరాలు చెల్లించలేదనుకోండి. అప్పుడు అతడి మొత్తం ఆదాయం 1000 డాలర్లలో 24 శాతం.. అంటే 240 డాలర్లను పన్నుగా చెల్లించుకుని మిగిలిన సొమ్మును యూట్యూబర్‌కు చెల్లిస్తుంది.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad