‘విద్యా కానుక’లో గోల్‌మాల్‌!

ఫేజ్‌-1లో రూ.16 కోట్ల అవినీతి వెలుగులోకి

టెండర్లు, వస్తువుల సరఫరాలో అక్రమాలు

అస్మదీయుల కోసం నిబంధనల్లో మార్పులు

పాఠశాలలకు నాసిరకం వస్తువులు సరఫరా

అక్నాలెడ్జిమెంట్లు లేకుండానే బిల్లుల చెల్లింపు

‘సమగ్రశిక్ష’ గత ఎస్‌పీడీ, ఏఎస్‌పీడీ సూత్రధారులు

ఏఎస్‌పీడీకి షోకాజ్‌... విజిలెన్స్‌ విచారణకు సిఫారసు 

సీఎంకు ప్రస్తుత ఎస్‌పీడీ పంపిన లేఖతో గుట్టురట్టు. 

‘జగనన్న విద్యా కానుక’లో పెద్దఎత్తున గోల్‌మాల్‌ జరిగింది. ఈ పథకం తొలి దశలో దాదాపు రూ.16కోట్ల అవినీతి చోటు చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు కార్యాలయంలోనే గత ఎస్‌పీడీ చినవీరభద్రుడు, అడిషనల్‌ ఎస్‌పీడీ మధుసూదన్‌రెడ్డి కనుసన్నల్లో ఈ అవినీతి బాగోతం సాగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యా కానుక కిట్లలో చోటు చేసుకున్న అవినీతిపై ప్రస్తుత స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.వెట్రిసెల్వి తాజాగా సీఎం జగన్‌కు మెయిల్‌ చేయడంతో గుట్టురట్టయింది. విద్యాకానుక కిట్లకు సంబంధించిన వివిధ వస్తువుల కొనుగోళ్ల టెండర్ల ప్రక్రియ నుంచి వాటిని పాఠశాలలకు సరఫరా చేయడం, బిల్లుల చెల్లింపుల వరకు పెద్దఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

నాణ్యత లేని, నాసిరకం వస్తువులను మార్కెట్‌ ధర కన్నా అధిక రేట్లకు కొనుగోలు చేసేలా టెండర్లు ఖరారు చేయడం గమనార్హం. తమవారికి టెండర్లు కట్టబెట్టేందుకు షరతులు, నిబంధనల్లో మార్పులు చేయడం నుంచే కుంభకోణానికి తెరలేపినట్లు సమాచారం. పాఠశాలలకు నాసిరకం వస్తువులు సరఫరా చేసినట్లు, కొన్ని జిల్లాలకు తక్కువగా, పలు జిల్లాలకు డిమాండ్‌కు మించి కిట్లు పంపిణీ చేసినట్లు తెలిసింది. 

నిబంధనలకు నీళ్లు

విద్యాకానుక కిట్లను పాఠశాలలకు సరఫరా చేసినప్పుడు అవి అందినట్లుగా హెచ్‌ఎం, ఎంఈవో, కమ్యూనిటీ మొబైల్‌ ఆఫీసర్‌(సీఎంవో) సంతకాలతో రసీదు తీసుకోవాలి. కానీ సింహభాగం పాఠశాలల్లో ఈ నిబంధనను పాటించలేదు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై సరుకులు సరఫరా చేసినట్లు చూపించి బిల్లులకు చెల్లింపులు చేసేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థులకు 3జతల యూనిఫాం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించగా 2జతలు మాత్రమే పంపిణీ చేసినట్లు తెలిసింది. నాసిరకంగా ఉండటంతో అవి వెంటనే చినిగిపోతున్నాయని, బ్యాగుల జిప్పులు ఊడిపోతున్నాయని ఆరోపణలు వచ్చాయి.

విద్యా సంవత్సరం పూర్తి కావస్తున్నప్పటికీ పలు జిల్లాల్లో బూట్లు, స్కూలు బ్యాగులు పూర్తిగా పంపిణీ కాలేదంటున్నారు. రసీదులు లేకుండానే బిల్లులు చెల్లింపుల కోసం పంపడంపై సీరియస్‌ అయిన ఆర్థికశాఖ సమగ్ర శిక్ష ఏఎ్‌సపీడీకి షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ప్రస్తుత ఎస్‌పీడీ కూడా ఆయనకు మెమో జారీ చేసినట్లు సమాచారం. విద్యాకానుక కిట్లలో అవినీతిపై విజిలెన్స్‌ విచారణకు సిఫారసు చేయగా ప్రస్తుతానికి ఈ విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారులు గోప్యంగా ఉంచుతున్నట్లు తెలిసింది. 

అటెండర్‌ మధ్యవర్తిగా లావాదేవీలు 

గతేడాది కరోనా కారణంగా పాఠశాలలు జరగకపోవడంతో అక్రమాలు వెలుగు చూడలేదు. ఈ వ్యవహారంలో రూ.16కోట్లు చేతులు మారినట్లు ప్రాథమికంగా గుర్తించినప్పటికీ పూర్తిస్థాయి విచారణ జరిపితే మొత్తం అవినీతి దాదాపు రూ.64 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. విజయవాడలోని ఓ స్టార్‌ హోటల్‌ వేదికగా విద్యా కానుక కిట్ల బాగోతం నడిచినట్లు తెలుస్తోంది. గత ఎస్‌పీడీ వద్ద పనిచేసిన అటెండర్‌కు రూ.10లక్షలు ఇచ్చి తమ వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడంతో పాటు టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లతో లావాదేవీలు జరిపినట్లు సీఎంకు పంపిన లేఖలో ప్రస్తుత ఎస్‌పీడీ పేర్కొన్నట్లు తెలిసింది.

ఈ విషయం తెలుసుకున్న గత ఎస్‌పీడీ, ఏఎ్‌సపీడీ ఆయన్ను కలిసి విచారణ జరిగితే సమస్యలు ఉంటాయని, ఈ విషయంలో ముందుకు వెళ్లవద్దని కోరగా, గతంలో జరిగిన వాటిని సరిదిద్దుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో ఇరికిస్తారేమోనన్న యోచనతో తనను బదిలీ చేయాలని ప్రస్తుత ఎస్‌పీడీ కోరుతున్నట్లు సమాచారం. అయితే విద్యా కానుకలో ఎలాంటి అవినీతి జరగలేదని, ఫిబ్రవరిలో తాను సెలవులో ఉండగా ఎవరో కావాలనే తనపై ఈ ఆరోపణలు చేస్తున్నారని ఏఎ్‌సపీడీ మధుసూదన్‌రెడ్డి చెప్పారు. కిట్ల పంపిణీకి సంబంధించి జిల్లాల నుంచి సమాచారం తెప్పించుకున్నారని, బిల్లులు కూడా త్వరలో క్లియర్‌ కానున్నాయని ఆయన పేర్కొన్నారు. కాగా, గత ఎస్‌పీడీ హయాంలో కేజీబీవీల్లో చదివే పేద బాలికలకు పంపిణీ చేసే టాయిలెట్‌ కిట్ల టెండర్లు, కొనుగోళ్లలోనూ ఏఎ్‌సపీడీని అడ్డుపెట్టుకుని పలు అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. టాయిలెట్ల కిట్లు నాసిరకంగా ఉండటంతో వాటి పంపిణీని ఆపేయాల్సిందిగా మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో కర్నూలు, విశాఖ, కడప జిల్లాల్లో వాటిని పంపిణీ చేయలేదు.  


Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad