దేశంలో ట్రిపుల్ మ్యుటెంట్ వైరస్

 దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ అలజడి సృష్టిస్తోంది. రోజువారి కేసులు లక్ష నుంచి 3 లక్షలకు చేరడం ఈ మహమ్మారి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పటికే డబుల్ మ్యూటెంట్‌ తో భయపెడుతున్న కరోనా వైరస్..తాజాగా ఉత్పరివర్తనం చెంది ట్రిపుల్‌ మ్యుటెంట్‌ స్ట్రెయిన్‌ వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. ప్రత్యేక జన్యువుతో రోగ నిరోధకశక్తిని దాటుకుని మరీ చొచ్చుకుపోయే కొత్త రకం మ్యూటెంట్ బి.1.618ను పశ్చిమ బెంగాల్‌ లో గుర్తించినట్టు సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు.

ట్రిపుల్‌ మ్యూటెంట్‌ అంటే వైరస్‌ మూడుసార్లు జన్యు మార్పిడికి లోనవడం. మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగాల్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో మూడుసార్లు జన్యు క్రమాన్ని మార్చుకున్న కరోనా కేసులు బయటపడ్డాయి. మొదట ఈ వైరస్‌ బెంగాల్‌లో గుర్తించినట్టుగా కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జెనోమిక్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయోలజీ శాస్త్రవేత్త వినోద్‌ స్కారియా తెలిపారు. ‘‘ట్రిపుల్‌ వేరియెంట్‌ వాయువేగంతో వ్యాప్తి చెందుతుంది. అత్యధిక మంది దీని బారిన పడతారు’’అని మెక్‌గిల్‌ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ మధుకర్‌ పాయ్‌ చెప్పారు. ట్రిపుల్‌ మ్యూటెంట్‌ కేసుల్ని పూర్తి స్థాయిలో విశ్లేషిస్తే తప్ప ఎంత హానికరమో చెప్పలేమని నిపుణులు అంటున్నారు.

ప్రస్తుతం వైరస్‌ తో వణుకుతున్న మహారాష్ట్ర, ఢిల్లీ సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఇండియన్ వేరియంట్‌గా చెబుతున్న డబుల్ మ్యూటెంట్ బి.1.617 రకం ఎక్కువగా వ్యాప్తిలో ఉన్నట్టు గుర్తించారు. దీనికి కూడా రోగ నిరోధకశక్తిని విచ్ఛిన్నం చేసే శక్తి ఉండడంతో ఎక్కువగా వ్యాపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాధికి కారణమయ్యే స్పైక్ ప్రొటీన్ భాగంలో ఈ484 క్యూ, ఎల్ 452 ఆర్‌ తో కలిసి ఇది డబుల్ మ్యూటెంట్‌ గా మారింది. ఈ484క్యూ మ్యుటేషన్ బ్రిటన్, దక్షిణాఫ్రికా నుంచి, కాలిఫోర్నియా నుంచి ఎల్452ఆర్ నుంచి వ్యాప్తి చెందాయి. ఈ రెండింటి కలయికతో దేశీయంగా డబుల్ మ్యూటెంట్ ఏర్పడిందని అంచనా వేస్తున్నారు.

తాజాగా బయటపడిన ట్రిపుల్ మ్యూటెంట్ బి.1.618 రకం వైరస్‌ లో స్పైక్ ప్రొటీన్‌ ఈ484కె, డి614జి రకాలను కలిగి ఉంది. దీంతో వైరస్ సంక్రమణ సామర్థ్యం పెరుగుతోందని ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ జినోమిక్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బీ.1.618 రకం స్ట్రెయిన్‌ ను మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌ లో తాజాగా గుర్తించినట్టు నిపుణులు చెప్పారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad