BLACK FUNGUS : బ్లాక్‌ ఫంగస్‌తో జాగ్రత్త

 నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు

ఇన్ఫెక్షన్‌ను త్వరగా గుర్తించాలి.. ఫంగస్‌ బాధితుల్లో మరణాలు 50 శాతం!

రోజురోజుకు పెరుగుతున్న బాధితులు.. కొవిడ్‌ రోగులు జాగ్రత్తగా ఉండాలి 

చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచుకోవాలి.. అవగాహనతోనే అడ్డుకట్ట

కేంద్రం, ఐసీఎంఆర్‌ వెల్లడి.. స్టెరాయిడ్ల అతి వినియోగంతోనే: గులేరియా


న్యూఢిల్లీ, మే 15: కరోనా మహమ్మారితోనే జనం అల్లాడిపోతుంటే.. ఇప్పుడు మరో వైరస్‌ వణుకు పుట్టిస్తోంది. అదే బ్లాక్‌ ఫంగస్‌ (మ్యుకోర్‌మైకోసిస్‌). వైరస్‌ బారిన పడి కోలుకున్న వారిని ఈ బ్లాక్‌ ఫంగస్‌ భయపెడుతోంది. ఈ ఇన్‌ఫెక్షన్‌ సోకిన వారికి చికిత్సలో నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదంగా మారుతోంది. కొవిడ్‌ రోగులకు ప్రాణాంతకంగా మారిన ఈ బ్లాక్‌ ఫంగ్‌సను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్‌లు కృషి చేస్తున్నాయి. ఈ ఫంగస్‌ సోకిన వారిలో మరణాలు 50 శాతంగా ఉన్నాయి. అంటే ప్రతి ఇద్దరు బాధితుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఫంగస్‌ సోకిన వారికి తలనొప్పి, ముక్కుదిబ్బడ, జ్వరం, కంటిచూపు తగ్గడం వంటి లక్షణాలు ఉంటాయి. రోజురోజుకూ ఈ ఫంగస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుండడంతో కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్‌ పలు సూచనలు చేశాయి. ‘‘బ్లాక్‌ ఫంగ్‌సను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం.

గాలి పీల్చుకున్నప్పుడు మ్యుకోర్‌ అనే ఫంగస్‌ సైనస్‌ లేదా ఊపిరితిత్తుల్లో చేరుతుంది’’ అని తెలిపాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ కూడా ఈ ఫంగ్‌సపై ప్రజలకు అవగాహన కల్పించేలా ఓ ట్వీట్‌ను షేర్‌ చేశారు. ఫంగస్‌ లక్షణాలు, దీని వల్ల కలిగే దుష్పరిణామాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏం చేయాలి? ఏం చేయకూడదు? వంటి వివరాలను వెల్లడించారు. త్వరగా ఈ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించడం, అవగాహన పెంచుకోవడం ద్వారానే బ్లాక్‌ ఫంగస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు. కాగా, కొవిడ్‌ రోగుల్లో బ్లాక్‌ ఫంగస్‌ పెరిగిపోవడానికి స్టెరాయిడ్ల దుర్వినియోగం కూడా కారణమని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా అన్నారు. కొవిడ్‌-19 కారణంగా ఇప్పుడీ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. కొవిడ్‌ బాధితుల్లో ఈ కేసులు పెరగడానికి ప్రధాన కారణం స్టెరాయిడ్లను ఇష్టానుసారం వినియోగించడమేనని చెప్పారు. ‘‘ఈ ఫంగస్‌ ముఖంపై ప్రభావం చూపుతుంది. కంటిచూపు కోల్పోయేందుకు కారణమవుతోంది. మెదడుకూ చేరుతోంది’’ అని గులేరియా తెలిపారు. ఆస్పత్రుల్లో ఇన్‌ఫెక్షన్లు సోకకుండా చూసే నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. 

ఏం చేయాలంటే..?

 కరోనా నుంచి కోలుకున్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచుకోవాలి. 

 రక్తంలో గ్లూకోజ్‌ శాతాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. 

 స్టెరాయిడ్లను తగిన మోతాదులో తీసుకోవాలి. 

 యాంటీబయాటిక్‌లు, యాంటీఫంగల్స్‌ ఔషధాలను కూడా తగిన మోతాదులో వాడాలి. 

 ఆక్సిజన్‌ థెరపీ సమయంలో తేమ కోసం శుభ్రమైన నీటినే ఉపయోగించాలి. 

చేయకూడనివి...

 ఫంగ్‌సకు సంబంధించిన సంకేతాలు, లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు.

 ముక్కుదిబ్బడ వేసిన ప్రతి కేసునూ బ్యాక్టీరియా సైనసైటిస్‌ కేసులుగా పరిగణించవద్దు. ప్రత్యేకించి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు లేదా కొవిడ్‌ రోగులు దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు. 

 ఫంగ్‌సను గుర్తించడానికి అవసరమైన విస్తృత పరీక్షలకు వెనకాడవద్దు. 

 బ్లాక్‌ఫంగ్‌సకు ప్రాథమికంగా చికిత్సను ప్రారంభించే కీలకమైన సమయాన్ని కోల్పోవద్దు

నివారణా చర్యలివే..

 రోగ నిరోధక శక్తిని పెంచే పౌష్టిక, సమతుల ఆహారాన్ని తీసుకోవాలి.

 ఎల్లప్పుడూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. 

 బయటకు వెళ్లినప్పుడు శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా చూసుకోవాలి. 

 వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. 

 ఆరోగ్యం, మందుల వాడకంలో జాగ్రత్తగా ఉండాలి

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad