Pre Primary Schools : ఫౌండేషన్‌ స్కూళ్లుగా 34 వేల ప్రీప్రైమరీ స్కూళ్లు-

 జగన్‌ మరో కీలక నిర్ణయం- ఫౌండేషన్‌ స్కూళ్లుగా 34 వేల ప్రీప్రైమరీ స్కూళ్లు- ప్రతిపాదనలివే..


ఏపీ విద్యావ్యవస్ధలో మరో కీలక మార్పుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రిప్రైమరీ, ప్రైమరీ విద్యార్థులకు గట్టి పునాదులపై విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఇందులో అధికారులు సీఎంకు కొత్త ప్రతిపాదనలు సమర్పించారు. వీటి ప్రకారం రాష్ట్రంలో 34 వేల ప్రీప్రైమరీ స్కూళ్లను ప్రభుత్వం ఫౌండేషన్‌ స్కూళ్లుగా మార్చబోతోంది.

ఫౌండేషన్ స్కూళ్ల ప్రతిపాదన

 అధికారుల ప్రతిపాదన ప్రకారం పీపీ-1, పీపీ-2, ప్రిపరేటరీ, ఒకటో తరగతి, రెండో తరగతి ఫౌండేషన్ స్కూళ్లు ఏర్పాటు చేస్తారు. స్ధానికంగా ఉండే ప్రాధమిక పాఠశాలలో దీనికి ఆనుకుని ఉన్న అంగన్ వాడీ కేంద్రాలు విలీనమవుతాయి. తద్వారా ఫౌండేషన్‌ స్కూళ్లకు అంకురార్పణ చేస్తారు. నైపుణ్యం స్థాయి పెంపు. ఇంకా వాటిలో మల్టీలెవల్‌ లెర్నింగ్‌పై ఫౌండేషన్‌ స్కూళ్ల ద్వారా దృష్టి సారిస్తారు. ఫౌండేషన్‌ స్కూళ్ల పరిధిలోకి వాటికి సమీపంలోని పీపీ-1, పీపీ-2లుగా మారుస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలు విలీనం అవుతాయి. అలాగే ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న 3, 4, 5 తరగతులు సమీపంలోని అప్పర్‌ ప్రైమరీ (యూపీ) స్కూళ్లు, హైస్కూళ్లకు బదలాయిస్తారు. ఆ మేరకు యూపీ స్కూళ్లు, హైస్కూళ్లగా మార్పు చేస్తారు. అవసరాలకు అనుగుణంగా తరగతి గదుల నిర్మాణం చేపడతారు.

మార్పు ఎందుకంటే ...

ఫౌండేషన్‌ స్కూళ్ల ఏర్పాటు వల్ల అధ్యాపక స్రవంతిలోకి అంగన్‌వాడీ టీచర్లను తీసుకురావాలనే ప్రతిపాదన చేస్తున్నారు. వారు సరైన సామర్ధ్యం పొందేలా శిక్షణ కార్యక్రమాలు. ప్రమోషన్ల ద్వారా ప్రైమరీ స్కూళ్లలో ఎస్‌జీటీలు (టీచర్లు)గా అవకాశం కల్పిస్తారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలు వైయస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్, అర్బన్‌ క్లినిక్స్‌కు బదలాయింపు చేస్తారు. ఆరోగ్యం, పౌష్టికాహారంపై అవగాహన, ఆరోగ్య పరిశీలన, వ్యాధి నిరోధకత కోసం ఇచ్చే వ్యాక్సిన్లు, రిఫరల్‌ సర్వీసులన్నీ వాటికి బదలాయిస్తారు. సుశిక్షితులైన ఆరోగ్య సిబ్బంది ఉన్నందు వల్ల వీరికి మంచి సేవలు అందే అవకాశం ఉంటుందని సీఎం జగన్‌ తెలిపారు.

జగన్‌ ప్రతిపాదనలివే 

పిల్లల్లో 6 ఏళ్ల వయసులోపే 80 శాతం మేధో వికాసం చెందుతుందని, అందుకే ఈ ఆలోచన చేస్తున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. నిరుపేద విద్యార్థులకు కూడా అత్యుత్తమ ప్రమాణాలతో విద్య అందించాలని తన తపన, ఆరాటం అన్నారు. తాజా ప్రతిపాదనల వల్ల కాస్ట్‌ ఇంపార్ట్, ఎడ్యుకేషన్‌ ఇంపాక్ట్‌పె పరిశీలన చేయాలని అధికారులకు సూచించారు. ప్రతీ మండలానికీ ఒక జూనియర్‌ కాలేజీ పెట్టాలనుకున్నామని, ఇది కాకుండా ప్రస్తుతం ఉన్న హైస్కూళ్లలో 11, 12 తరగతులను పెట్టడమా? లేక మండలానికి ఒక జూనియర్‌ కాలేజీని పెట్టాలా? అలాగే కొన్ని మండలాల్లో అవసరాల మేరకు 2 జూనియర్‌ కాలేజీలు పెట్టాలా? అన్నదానిపై పూర్తి స్థాయి పరిశీలన చేయాలని అధికారుల్నిఆదేశించారు. దీని తర్వాత తుది నిర్ణయం తీసుకుందామన్నారు. ఈ నిర్ణయం వల్ల 11, 12 తరగతులకు ప్రభుత్వ రంలోనే మంచి విద్య అందించే అవకాశం ఉంటుందన్నారు.

ఫౌండేషన్ స్కూళ్లు ఇలా ..

తాజాగా ఏర్పాటు చేయదలచిన ఫౌండేషన్‌ స్కూళ్లు అన్నీ కూడా ఒక కిలోమీటర్‌ దూరం లోపల ఉండాలని సీఎం జగన్‌ సూచించారు. అలాగే అన్ని హైస్కూళ్లు (3 తగతి నుంచి 10 లేదా 12వ తరగతి) 3 కిలోమీటర్ల దూరం లోపల ఉండాలన్నారు. వైయస్సార్‌ ప్రిప్రైమరీ స్కూళ్లు పిల్లలకు చాలా దగ్గరగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు.. ఆ విధంగా ఆ స్కూళ్ల మ్యాపింగ్‌ చేయాలన్నారు. టీచర్లలోని బోధనా సామర్థ్యాని మరింత వినియోగించుకునేలా తగిన హేతుబద్ధీకరణ చేపట్టాలని, తద్వారా పిల్లలకు ఇంకా అత్యుత్తమ విద్యను అందించవచ్చన్నారు. కొత్త ప్రతిపాదనల అమలు వల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతుందన్న దానిపై పూర్తిస్థాయిలో అధికారులు ఆలోచనలు చేసి.. తదుపరి సమీక్షలో నివేదించాలని సీఎం ఆదేశించారు. ఒకవేళ వాటిని అమలు చేయాల్సిన పక్షంలో ముందుగా 3, 4, 5 తరగతులను యూపీ స్కూళ్లకు, హైస్కూళ్లకు బదిలీ చేయాల్సి ఉంటుందన్నారు. ఇవన్నీ ఖరారు అయిన తర్వాత ఫౌండేషన్‌ స్కూళ్లలో చేపట్టాల్సిన నాడు-నేడు కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలన్నారు.

డిజిటల్‌ టీచింగ్‌ 

స్థానిక ప్రాథమిక పాఠశాలలో అంగన్‌ వాడీలు (పీపీ-1, పీపీ-2), 1, 2 తరగతుల ఫౌండేషన్‌ స్కూళ్ల ఏర్పాటు తర్వాత డిజిటల్‌ బోధన ప్రక్రియ (డిజిటల్‌ టీచింగ్‌)పై దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆమేరకు డిజిటిల్‌ బోధనా పద్ధతులు (టీచింగ్‌ మెథడాలజీ) రూపొందించాలని కోరారు. మనం బ్లాక్‌ బోర్డు నుంచి గ్రీన్‌ బోర్డ్స్‌కు మారాం. ఇక ముందు డిజిటిల్‌ బోర్డ్స్‌కు వెళ్లే పరిస్థితి వస్తుందన్నారు. డిజిటల్‌ బోర్డుల డ్యూరబులిటీ (దీర్ఘకాలం పని సామర్థ్యం) ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. మనం ఏర్పాటు చేసే పరికరం ఒక రోబస్ట్‌గా ఉండాలి. మరమ్మతులకు అవకాశం తక్కువగా ఉండే డివైజ్‌లను గుర్తించాలన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని పరిశీలన్నారు. ఎన్ని స్కూళ్లలో, ఎన్ని క్లాస్‌రూమ్‌లలో ఏర్పాటు చేయగలం? ఎంత వ్యయం అవుతుంది? అన్నవాటినీ సమీక్షించాలని అధికారులకు సూచించారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad