ధ్రువీకరించిన అధికారులు, బంధువులపై కేసు నమోదు
బలరాంపూర్: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన విలయానికి వేల సంఖ్యలో బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా నదుల్లో కొన్ని మృతదేహాలు కొట్టుకురావడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అవి కొవిడ్ వల్ల చనిపోయిన వారి మృతదేహాలే అని అనుమానిస్తున్న సమయంలో తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని నదిలో ఓ మృతదేహాన్ని విసిరివేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అప్రమత్తమైన అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.
ఉత్తర్‌ప్రదేశ్ బలరాంపూర్ జిల్లాలోని రప్తి నదిపై ఉన్న ఓ బ్రిడ్జి వద్ద ఇద్దరు వ్యక్తులు ఓ మృతదేహంతో కనిపించారు. పీపీఈ కిట్ వేసుకున్న ఓ వ్యక్తితో పాటు మరోవ్యక్తి ఆ మృతదేహాన్ని నదిలోకి జారవిడుస్తున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. అదే సమయంలో కారులో వెళ్తున్న కొందరు వ్యక్తులు ఈ వీడియోను చిత్రీకరించారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో దర్యాప్తు జరిపిన జిల్లా వైద్యాధికారులు అది కొవిడ్ వ్యక్తి మృతదేహమేనని ధ్రువీకరించారు. చనిపోయిన వ్యక్తి బంధువులే నదిలో పడవేసినట్లు గుర్తించిన అధికారులు వారిపై కేసు నమోదు చేశారు. ‘కొవిడ్ సోకి తీవ్ర అస్వస్థతకు గురైన ఓ వ్యక్తి మే 25వ తేదీన ఆసుపత్రిలో చేరారు. మూడు రోజుల అనంతరం అతడు ప్రాణాలు కోల్పోయాడు.
కొవిడ్ నిబంధనల ప్రకారం, వ్యక్తి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాం. కానీ, ఆ దేహాన్ని వారు నదిలో విడిచిపెట్టినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చాం. దీనిపై ఇప్పటికే వారిపై కేసు నమోదు చేశాం. పూర్తి దర్యాప్తు అనంతరం వారిపై కఠిన చర్యలు ఉంటాయి’ అని బలరాంపూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ పేర్కొన్నారు. ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తోన్న వేళ.. నదుల్లో మృతదేహాలు కొట్టుకువస్తోన్న ఘటనలు వెలుగు చూశాయి. బిహార్‌లోని బక్సర్ జిల్లాలో ఒకేసారి 71మృతదేహాలు కొట్టుకురావడం ఆందోళనకు గురిచేసింది. అనంతరం బిహార్, యూపీల్లో ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం నదిలో మృతదేహాలను పడవేయకుండా చర్యలు చేపట్టాలని ఆయా రాష్ట్రాలను ఆదేశించింది. అయినప్పటికీ ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో ఇటువంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉండడం ఆందోళన కలిగించే విషయం.
शर्मनाक!
— UP Congress (@INCUttarPradesh) May 30, 2021
प्रदेश में स्वास्थ्य विभाग के बदहाली की पोल खुल चुकी है।
बलरामपुर में राप्ती नदी में PPE किट में सरेआम डेड बॉडी फेंकी जा रही है।@myogiadityanath जी टीम लगा दीजिये इसको भी झूठा साबित करने के लिये। pic.twitter.com/bKfhGxXdj2