• రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్
• రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల లోపు తల్లులు ఉన్నట్లు అంచనా
• 45 ఏళ్లు పైబడిన వారితో వ్యాక్సిన్
• రాష్ట్రంలో 3 చోట్ల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం
• రీజియన్ల వారీగా విశాఖ, తిరుపతి, విజయవాడ/గుంటూరులో ఏర్పాటు
• 144 సెక్షన్, కర్ఫ్యూ పొడిగింపుతో కరోనా తగ్గుముఖం : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి
అమరావతి, జూన్ 7 : కరోనా థర్డ్ వేవ్ వస్తుందన్న నిపుణుల సూచనలతో ముందు జాగ్రత్తతో రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్లలోపు పిల్లలు ఉన్న తల్లులకు వ్యాక్సిన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. రాష్ట్రంలో విశాఖ, తిరుపతి, విజయవాడ/గుంటూరులో మల్లీ స్పెషాల్టీ ఆసుపత్రులు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నెల 20 వ తేదీ వరకూ కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వ పొగించిందన్నారు. 144 సెక్షన్ ను ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటల వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకుందన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో 64,800 శాంపిళ్లు పరీక్షించగా, 4,872 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 86 మృతి చెందారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,729 ఐసీయూ బెడ్లు, 8,837 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో 11,035 మంది చికిత్స పొందుతున్నారని, గడిచిన 24 గంటల్లో 1,311 మంది డిశ్ఛార్జి కాగా, 603 మంది అడ్మిషన్ పొందారన్నారు. 104 కాల్ సెంటర్ కు గడిచిన 24 గంటల్లో 2,597 ఫోన్ కాల్స్ రాగా, వాటిలో అడ్మిషన్లకు 366 కాల్స్, వివిధ సమాచారాలకు 1,221 కాల్స్ వచ్చాయన్నారు. సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న 5 లక్షల మందికి 5 వేల మంది వైద్యులు టెలీ కాల్ మెడిసిన్ సెంటర్ ద్వారా ఫోన్లు చేశామన్నారు. గడిచిన 24 గంటల్లో 17,646 మంది ఫోన్ చేసి, వారి ఆరోగ్య పరిస్థితులుపైనా, మందుల వినియోగంపైనా సలహాలు సూచనలు అందజేశారన్నారు.
కరోనా నివారణకు 144 సెక్షన్, కర్ఫ్యూ పొడిగింపు...
రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి నివారణకు విధించిన 144 సెక్షన్, కర్ఫ్యూను జూన్ 20 వతేదీ వరకూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ నెల 11 వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ 144 సెక్షన్ పెంచుతూ నిర్ణయం తీసుకుందన్నారు. కర్ఫ్యూ మధ్యాహ్నం రెండు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకూ కర్ఫ్యూ విధిస్తూ... ఇదివరకటి నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసిందన్నారు. మరికొద్ది రోజులు కర్ఫ్చూ పొడిగిస్తే మరింత సత్ఫలితాలు వస్తాయని భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లోనూ పాజిటివిటీ రేటు తగ్గుముఖం పట్టిందన్నారు. గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పాజిటివిటీ రేటు పది శాతం లోపలే ఉంటోందన్నారు. ఆరోగ్య శ్రీ పథకం వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో జూన్ 6వ తేదీనాటికి 21,130 మంది చికిత్స పొందుతున్నారన్నారు. వారిలో 17,944 మంది(84.92 శాతం) ఆరోగ్య శ్రీ పథకం కింద వైద్య సేవలు పొందుతున్నారన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 9,659 మంది కరోనా చికిత్స పొందుతుంటే, వారిలో 6,473 మంది (67 శాతం) ఆరోగ్య శ్రీ కింద వైద్యసేవలు పొందుతున్నారన్నారు. రోజు రోజుకూ ఆరోగ్య శ్రీ కింద కరోనా చికిత్సలు పొందే వారి సంఖ్య పెరుగుతూ వస్తోందన్నారు.
కరోనా థర్డ్ వేవ్ నివారణకు ముందుస్తు జాగ్రత్తలు...
రాబోయే రోజుల్లో కరోనా థర్డ్ వేవ్ వ్యాపించ వచ్చునంటూ నిపుణుల సూచనల మేరకు ముందుస్తు జాగ్రత్తలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొవిడ్ సమీక్షా సమావేశంలో చర్చించారన్నారు. ఇప్పటికే థర్డ్ వేవ్ వస్తే చేపట్టే నివారణ చర్యలపై ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించిందన్నారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు, పిడియాట్రిక్ కేసులు వస్తే, నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేదానిపైనా సీఎం చర్చించారన్నారు. కరోనా రెండు వేవ్ ల ఆధారంగా తీసుకుని బాధితుల వయస్సు జాబితాను దేశ, రాష్ట్రం వారీగా చర్చించామన్నారు. దేశ వ్యాప్త డేటా చూస్తే... 0 నుంచి 10 ఏళ్ల లోపు దేశంలో 3.35 శాతం, ఏపీలో 2.72 శాతం, 11 నుంచి 20 ఏళ్ల లోపు దేశంలో8.38 శాతం, ఏపీలో 8,35, 21-30 ఏళ్ల లోపు 21.79 శాతం, ఏపీ లో 20.28 శాతం, 31-40 ఏళ్లలోపు దేశంలో 21.91 శాతం, ఏపీలో 21.29 శాతంగా నమోదయ్యిందన్నారు. మొత్తంగా ఏపీలో ఏపీలో 20 ఏళ్లలోపు 11 శాతం మందిగా గుర్తించామన్నారు. థర్డ్ వేవ్ లో పిడియాట్రిక్ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదయితే, ఐసీయూ, పిడియాట్రిక్ బెడ్లు, వెంటిలేటర్లు, పిల్లలకు ఇచ్చే సిరప్ లు, మాస్కులు, మందులు ఎన్ని కావాలి..? వాటిని ముందుగానే కొనుగోలు చేసేలా కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. అన్ని టీచింగ్ ఆస్పత్రుల్లో పీడియాట్రిక్ వార్డులు ఏర్పాటు చేయాలని, పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో అవకాశం ఉన్నచోట పిల్లలకు చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని, చిన్న పిల్లల వైద్యులను రిక్రూట్ మెంట్ చేసుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు.
5 ఏళ్లలోపు పిల్లల తల్లులకు వ్యాక్సిన్...
కరోనా చికిత్సల నిమిత్తం రాష్ట్రంలో 600లకు పైగా ప్రైవేటు ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతులిచ్చామన్నారు. థర్డ్ వేవ్ ను దృష్టిలో పెట్టుకుని వాటిలో పిడియాట్రిక్ కేసుల చికిత్స, వాటిలో పిడి యాట్రిక్ వార్డులు, ఇతర మౌలిక సదుపాయల కల్పనకు గల అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. చిన్న పిలల్లకు కరోనా పాజిటివ్ వస్తే, చికిత్స సమయంలో వారితో పాటు ఆసుపత్రుల్లో తల్లులు కూడా ఉండాల్సి ఉంటుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని, ముందుస్తుగా 5 ఏళ్లలోపు పిల్లలు కలిగిన తల్లులకు కరోనా వ్యాక్సిన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్లలోపు పిల్లలు కలిగిన తల్లులు 15 లక్షల నుంచి 20 లక్షల వరకూ ఉండొచ్చునని, వారికి కూడా 45 ఏళ్లు పైబడిన వారితో కలిసి టీకాలు వేయనున్నామని, దీనికి సంబంధించిన విధివిధానాలను అన్నిజిల్లా కలెక్టర్లకు జారీచేయనున్నామని తెలిపారు.
రాష్ట్రంలో 3 మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రుల నిర్మాణం...
రాష్ట్రంలో చిన్నారులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడానికి మూడూ పిడియాట్రిక్స్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. విశాఖలోని రాణి చంద్రమయి దేవీ గవర్నమెంట్ రిహాబిలిటేషన్ సెంటర్ పేరు మీదుగా 1965లో భూముల కేటాయించారన్నారు. వాటిలో రూ.200 కోట్ల వ్యయంతో 500 పడకల మల్టీ స్సెఫాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఏడాదిన్నర కిందట డీపీఆర్ రూపొందించారన్నారు. ఈ నిధులు వెంటనే మంజూరు చేసి ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీంతో పాటు రాయలసీమ రీజియన్ గా తిరుపతిలో, కోస్తాంధ్రా రీజియన్ గా గుంటూరు/విజయవాడలో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని, ఇందుకు అవసరమైన భూములు, డీపీఆర్ సిద్ధం చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. 45 ఏళ్లు పైబడిన వారు, హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 55 శాతం మందికి కనీసం ఒక డోసు ఇచ్చామన్నారు. వారిలో 57,07,706 మందికి ఒక డోసు, 25,80,432 మందికి రెండు డోసులు వేశామని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం(జూన్ 6) సాంయత్రం వరకూ 1,623 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయన్నారు. ఈ కేసుల నివారణకు కేంద్ర ప్రభుత్వం నుంచి 13,105 ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు వచ్చాయన్నారు. వాటిలో 1,225 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని, మిగిలినవి రోగులకు ఇంజక్షన్ చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 91,650 ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్ల కొనుగోలుకు ఆర్డర్లిచ్చిందన్నారు. ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లను కేంద్ర ప్రభుత్వమే కోటా ప్రకారం రాష్ట్రాలకు కేటాయిస్తోందన్నారు. బ్లాక్ ఫంగస్ నివారణకు అవసరమైన పొసకొనజోల్ ఇంజక్షన్లను, మాత్రలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్నారు. ఇప్పటి వరకూ 12,250 పొసకొనజోల్ ఇంజక్షన్లను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. వాటితో పాటు 1,01,980 పొసకొనజోల్ మాత్రలను కొనుగోలు చేయగా, ప్రస్తుతం 68,543 మాత్రలు అందుబాటులో ఉన్నాయన్నారు.
జారీచేసిన వారు : పబ్లిసిటీ సెల్, I&PR, సచివాలయం, అమరావతి