బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ షాక్ ఇచ్చింది. ఏటీఎం లావాదేవీలకు సంబంధించి బ్యాంకులు అధిక ఇంటర్‌ఛేంజ్ ఫీజులు వసూలు చేయడానికి అనుమతి ఇచ్చింది.
ATM Interchange Fees : బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ షాక్ ఇచ్చింది. ఏటీఎం లావాదేవీలకు సంబంధించి బ్యాంకులు అధిక ఇంటర్‌ఛేంజ్ ఫీజులు వసూలు చేయడానికి అనుమతి ఇచ్చింది. దీంతో బ్యాంక్ కస్టమర్లపై మరీ ముఖ్యంగా ఏటీఎం లావాదేవీలు నిర్వహించే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఏటీఎం ఇంటర్‌ఛేంజ్ చార్జీలను పెంచుకోవచ్చని బ్యాంకులకు ఆర్బీఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మీరు మీ బ్రాంచ్ ఏటీఎం కాకుండా మరో బ్యాంక్ ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసుకుంటే.. అప్పుడు మీ బ్యాంక్ ఆ ఏటీఎం బ్యాంక్‌కు డబ్బులు చెల్లించాలి. దీన్నే ఇంటర్‌ఛేంజ్ ఫీజు అని అంటారు.
ఆర్బీఐ అనుమతితో.. బ్యాంకులు ఇకపై ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌పై రూ.17 వరకు చార్జీ వసూలు చేయొచ్చు. ఈ ఫీజు ఇదివరకు రూ.15గా ఉండేది. అలాగే నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు ఈ చార్జీని రూ.5 నుంచి రూ.6కు పెంచింది
అంతేకాదు ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాత కస్టమర్లు ఏటీఎం ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తే.. అప్పుడు బ్యాంకులు గరిష్టంగా ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ.21 వరకు వసూలు చేయొచ్చు. ఈ చార్జీ ప్రస్తుతం రూ.20గా ఉంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ల ఫీజు పెంపు నిర్ణయం 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. అదే నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ల ఫీజు పెంపు నిర్ణయం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుంది. మొత్తంగా తరచుగా ఏటీఎంలలో డబ్బు డ్రా చేసే వారికి ఇది చేదు వార్తే అని చెప్పాలి.