పాత పెన్షన్‌పై ఆశలొద్దు అది అమలయ్యే అవకాశం తక్కువ

 పాత పెన్షన్‌పై ఆశలొద్దు

అది అమలయ్యే అవకాశం తక్కువ

ఆర్టీసీ ఉద్యోగులకు కృష్ణబాబు స్పష్టీకరణ

ఉద్యోగ సంఘాలతో భేటీ

అమరావతి, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి):

 ఓల్డ్‌ పెన్షన్‌ ఆశలు ఎవ్వరూ పెట్టుకోవద్దు. అది అమలయ్యే అవకాశం తక్కువ. సీపీఎస్‌ విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మీకు వర్తిస్తుంది. ఇతర సమస్యల్లో ప్రభుత్వానికి నివేదించేవి, యాజమాన్యం పరిష్కరించేవి ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుని సానుకూల నిర్ణయాలు తీసుకుందాం’ అని  ప్రజా రవాణా సంస్థ ఉద్యోగులకు ప్రభుత్వం, యాజమాన్యం స్పష్టం చేశాయి. ఏపీఎ్‌సఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం తరఫున రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, యాజమాన్యం తరపున ఎండీ ద్వారకా తిరుమలరావు సోమవారం విజయవాడలో ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారు.

సిబ్బంది సమస్యల గురించి ఉద్యోగ సంఘాల నేతలు ప్రస్తావించగా..  ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులపై ఇరువురు ఉన్నతాధికారులు మాట్లాడారు. ఏ ఒక్క సమస్యపైనా నిర్దిష్ట పరిష్కార హామీ లేదా గడువు లేకుండానే చర్చలు ముగిశాయి. ప్రభుత్వంలో సిబ్బంది విలీనం తర్వాత ఏపీఎ్‌సఆర్టీసీలో పనిచేస్తున్న 52 వేల మందికి 2020 జనవరి 1 నుంచి కష్టాలు మొదలయ్యాయి. జీతం తప్ప ఇతరత్రా సమస్యలేవీ తీరలేదు. ఎన్‌ఎంయూ, ఈయూ, ఎస్‌డబ్ల్యూఎ్‌ఫతోపాటు వైఎ్‌సఆర్‌ యూనియన్‌ సైతం సిబ్బంది సమస్యలపై పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా స్పందన కనిపించలేదు.  ప్రధాన యూనియన్లు ఎన్‌ఎంయూ, ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ తదితర(వైఎ్‌సఆర్‌ యూనియన్‌ మినహా) సంఘాలు ఇటీవల ఐక్య కార్యాచరణ కూటమిగా ఏర్పడేందుకు సిద్ధమయ్యాయి. వారంతా విజయవాడలో ఏర్పాటు చేసుకున్న సమావేశానికి పోలీసులు ఆటంకాలు కలిగించారు. ఆ తర్వాత ప్రభుత్వం పీటీడీ ఉద్యోగులతో చర్చలు జరపాలని నిర్ణయించింది.

రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు నుంచి ఆహ్వానం అందిన 14 అసోసియేషన్ల నేతలు సోమవారం సమావేశానికి హాజరయ్యారు. ఎస్‌డబ్ల్యూఎ్‌ఫకు ఆహ్వానం పంపకపోవడంతో హాజరుకాలేదు. ప్రభుత్వ ఉద్యోగులయ్యాక పాత పెన్షన్‌ స్కీమ్‌ వర్తిస్తుందన్న సీఎం హామీని ఈ సమావేశంలో యూనియన్ల నేతలు గుర్తు చేశారు. 2004కు ముందున్న పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఆకస్మిక మరణానికి స్టాఫ్‌ బెనిఫిట్‌ ట్ర స్ట్‌(ఎ్‌సబీటీ) పథకం ఉండేదని, ఎస్‌ఆర్‌బీఎస్‌, సర్వీస్‌ రూల్స్‌ మార్పు తదితర అంశాలపై ఎన్‌ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి, ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు, కార్మిక పరిషత్‌ నాయకుడు వైఎస్‌ రావు మాట్లాడారు.

ఓపీఎస్‌ తమ డిమాండ్‌ అని, ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకూ ఎస్‌ఆర్‌బీఎస్‌ అమ లు కొనసాగించాలని రమణారెడ్డి కోరారు. యాజమాన్యం పరిష్కరించాల్సిన సమస్యలతోపాటు ఈహెచ్‌ఎ్‌సలో ఉన్న ఇబ్బందులను వైఎ్‌సఆర్‌ పీటీడీ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య వివరించారు. అన్ని సంఘాల నాయకుల అభిప్రాయాలు విన్న కృష్ణబాబు, తిరుమలరావు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తాం.. పరిష్కారానికి కృషి చేస్తాం.. అనే మాటలు తప్ప ఏ ఒక్కటీ నిర్ణీత సమయంలోగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వలేదు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad