కోవిడ్ పాండమిక్ వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా ఇప్పటివరకు కోవిడ్ ఇంకా ఎన్ని రోజులు ఉండొచ్చు అనే విషయం పూర్తిగా తెలియటం లేదు. అయితే ఈ కోవిడ్ అనేక కొత్త విపత్తులకు దారి తీయవచ్చనేది మాత్రం ప్రస్ఫుటం. ఇందులో ప్రమాదకరమైనవి డయాబెటిస్, గుండె జబ్బుల పెనుముప్పులు. ఇవి ఎందుకు రాబోతున్నాయి, వీటిని నివారించటం ఎలా అనే విషయాలపై అవగాహన కోసమే ఈ కథనం.
డయాబెటిక్ ముప్పు పెరగడమెందుకు?
ఇప్పటికే మన దేశాన్ని డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తారు. అంటే మధుమేహంలో ప్రపంచ రాజధాని అన్న (అప)కీర్తి మనదే. భారతదేశంలో 7.7 కోట్లకు పైగా డయాబెటిక్ రోగులు ఉన్నారని అంచనా. గణాంకాల ప్రకారం చూస్తే ఇది ప్రపంచంలోనే అత్యధికమైన సంఖ్య. అంతేకాదు... ఇక్కడ సుమారు 50 శాతం మందికి షుగర్ జబ్బు ఉన్నప్పటికీ ఆ విషయం నిర్ధారణ కాకుండా ఉంటారని అంచనా. గ్రామీణ ప్రాంతాల్లో ఇది సుమారు 60 శాతం కావచ్చు. కోవిడ్ వచ్చినవాళ్లల్లో అనేకమందికి హాస్పిటల్లో చేరిన సందర్భంలో షుగర్ బయటపడింది. అయితే వీళ్లకి కోవిడ్ వల్ల షుగర్ వచ్చిందా లేక డయాబెటిస్ ఉన్నా ఆ విషయం తెలియక కోవిడ్ వచ్చినప్పుడు బయట పడిందా అన్నది స్పష్టంగా తెలియలేదు.
ఇంతకుముందు చాలా రకాల వైరల్ న్యుమోనియాలలో షుగర్ కొత్తగా రావడం డాక్టర్లకు తెలిసిన విషయమే. సార్స్ – 1 లో కూడా డయాబెటిస్ కొత్తగా రావటం గమనించారు. కోవిడ్ –19 లోనూ మధుమేహం కొత్తగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకుల అంచనా. దీనికి అనేక కారణాలున్నాయి. మొదటిగా సార్స్ సీవోవీ–2 వైరస్ శరీరంలో ప్రవేశించడానికి ఉపయోగించుకునే ఏసీఈ–2 రిసెప్టార్లు ప్యాంక్రియాస్‌లోనూ ఉంటాయి. కాబట్టి ఊపిరితిత్తులను పాడు చేసినట్లుగానే ఈ వైరస్ ప్యాంక్రియాస్‌ను కూడా ప్రభావితం చేయగలుగుతుంది. కోవిడ్ –19 రావటం అనేది శరీరానికి ఒక స్ట్రెస్. ఇన్ఫెక్షన్‌తో కూడిన ఈ ఒత్తిడి వల్ల మధుమేహం రావడం అనేది ఇప్పటికే తెలిసిన అంశం. ఇవి మాత్రమే కాకుండా కోవిడ్ – 19 చికిత్సకోసం స్టెరాయిడ్స్ వాడటం కొన్నిసార్లు అవసరం. వాటితో రక్తంలో షుగరు పెరగవచ్చు. చాలామందికి స్టెరాయిడ్స్ ఆపేసిన తర్వాత షుగర్ నార్మల్‌కి వచ్చేస్తుంది. కొంతమందికి మాత్రం స్టెరాయిడ్స్ ఆపేశాక కూడా షుగర్ అధికంగానే ఉంటుంది.
డయాబెటిస్ కి దోహదం చేస్తున్న కోవిడ్ ఇన్–అప్రాప్రియేట్ బిహేవియర్
మనం కరోనా నివారణకు కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ పాటించాలన్న విషయం తెలిసిందే. అంటే.. కోవిడ్ జాగ్రత్తలతో పాటు మంచి పుష్టికరమైన ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయడం లాంటివి కూడా కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్‌లోకి వస్తాయి. ఈ సందర్భంగా కొన్ని అనవసరమైన జాగ్రత్తలూ, మరికొన్ని అజాగ్రత్తల వల్ల షుగర్ వచ్చే అవకాశం బాగా ఎక్కువ అవుతుంది. కోవిడ్ సాకుతో వ్యాయామం చేయటం పూర్తిగా ఆగిపోయింది. బలమైన ఆహారం తీసుకుంటే కోవిడ్ ని ఎదుర్కోవడానికి శరీరంలో మంచి శక్తి వస్తుందని చెప్పటంతో... కొవ్వు పదార్థాలతో కూడిన ఆహారం తీసుకోవడం మొదలైంది. ఇలాంటి ఆహారంతో ఇమ్యూనిటీ వచ్చే అవకాశం ఏమేరకు ఉందో తెలియకపోయినా, బరువు పెరగటం జరుగుతోంది. దాంతో కోవిడ్ రిస్క్ తగ్గకపోగా ఊబకాయంతో వచ్చే రెండు అనర్థాలు కనిపిస్తున్నాయి. వాటిలో మొదటిది కోవిడ్ –19 వల్ల కలిగే ప్రమాదపు అవకాశాలు పెరగడం, రెండోది బరువు పెరిగిన కారణంగా షుగర్ జబ్బుకి దగ్గరవడం.
గుండెజబ్బుల పెనుముప్పు
కోవిడ్ జబ్బుకి మన రెస్పాన్స్ వల్ల రాబోతున్న మరొక సమస్య గుండెజబ్బుల అనర్థం. గుండె జబ్బుల చికిత్సల కోసం ఆసుపత్రులకు వెళ్లే వాళ్ల సంఖ్య కోవిడ్ ఉద్ధృతంగా ఉన్న సమయంలో తక్కువగానే ఉన్నప్పటికీ, కేసులు తగ్గిపోయే సమయానికి గుండెజబ్బులతో ఆస్పత్రికి వెళ్లే వాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీనికి అనేక కారణాలున్నాయి. మొదటిగా కోవిడ్‌లో షుగర్ పెరగటం, వ్యాయామం తగ్గడం, ఊబకాయం బాగా పెరిగిపోవడం... వంటి అంశాలన్నీ గుండె జబ్బులకి కూడా దోహదం చేస్తున్నాయి.
మానసిక ఒత్తిడి పెరగటం
కోవిడ్ పాండమిక్ వల్ల అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయాయి. ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం, దుకాణాలు మూత పడటం, శ్రమించినా ఉపాధి పొందే అవకాశాలు సన్నగిల్లడంతో ప్రజలు విపరీతమైన ఒత్తిడికి గురయ్యారు. ఆర్థికంగానూ, మానసికంగానూ, సామాజికంగానూ ఒక అభద్రతా భావం ప్రజల్లో నిండిపోయింది. ప్రతిరోజూ బంధువులను, తెలిసినవాళ్ళ లోనూ దుర్వార్తలు వినాల్సి రావటం, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ, సామాజిక మాధ్యమాల లోనూ భయోత్పాతాలు కలిగించే వార్తలు ఎక్కువగా వెలువడటంతోనూ భవిష్యత్తు పట్ల ఒక తెలియని భయం నెలకొంది. ఇక కోవిడ్ బారినపడి హాస్పటల్లో చేరాల్సి వచ్చిన వాళ్ల పరిస్థితి మరీ దయనీయం. భౌతిక దూరం సామాజిక దూరంగా మారిపోవడంతో ఒంటరితనం అందరినీ కలచివేసింది.
చెక్ అప్‌లు తగ్గడం
కోవిడ్ సందర్భంగా హాస్పిటల్ కి వెళ్లడానికి ప్రజల్లో విపరీతమైన భయం ఏర్పడింది. దాంతో క్రమం తప్పకుండా చేయించుకునే పరీక్షలు దాదాపు అందరూ వాయిదా వేశారు. దీనివల్ల చాలామందిలో బీపీ పెరిగిపోవడం, షుగర్ నియంత్రణలో లేకపోవడం సాధారణమైంది. దురలవాట్లు పెరగడం లాక్‌డౌన్ నిబంధనలు సడలించగానే మద్యం అలవాటు మళ్లీ బాగా పెరిగిపోయింది. మద్యం వల్ల రక్తపోటు పెరగడం, దానివల్ల గుండె మీద ఒత్తిడి పెరగడం కూడా జరుగుతుంది. దీంతోపాటు క్రమబద్ధమైన పరీక్షలూ, వైద్య పర్యవేక్షణ లేకపోవడంతో మద్యం, పొగతో కలిగే అనర్ధాలు బయటపడటం లేదు.
గుండె జబ్బులు వచ్చిన వాళ్లు ఎక్కువగా మృత్యువాత పడటం
గుండె జబ్బు వచ్చిన తర్వాత కూడా ఆ విషయం తెలియకుండా ఆస్పత్రికి వెళ్ళడానికి భయపడి, ఇంటి దగ్గరే వైద్యం తీసుకోవడానికి ప్రయత్నం చేసి, సమయం బాగా మించిపోయాక... అప్పుడు ఆస్పత్రికి వెళ్ళేవాళ్లు చాలామంది ఉన్నారు. గుండె జబ్బు వచ్చిన మొదటి ఆరు గంటల లోపులో సరైన వైద్యం అందక పోతే ప్రాణానికి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. కోవిడ్ పాండమిక్‌లో ఈ విధమైన ఆలస్యం వల్ల అనేక మందికి గుండె పూర్తిగా పాడైపోవడం జరిగింది.
ఒకసారి గుండె పంపింగ్ బలహీనం అయిపోయిన తర్వాత ఎంత అత్యాధునికమైన వైద్యం అందించినప్పటికీ సాధారణంగా గుండె మళ్లీ పూర్వ స్థితికి వచ్చే అవకాశం ఉండదు. గుండె పంపింగ్ బలహీనంగా ఉన్న వాళ్లకి ప్రాణహాని జరిగే అవకాశం నిత్యం పొంచి ఉంటుంది. ప్రస్తుతం బయటకు సునామీలా కనపడుతున్న కోవిడ్ పాండమిక్ గురించే అందరూ ఆలోచిస్తున్నారు. కానీ అదే సమయంలో చాప కింద నీరులా కమ్ముకు వస్తున్న మధుమేహం, గుండె జబ్బుల్ని ముందే గుర్తించి, నివారించడానికి చర్యలు చేపట్టకపోతే రానున్న రోజులో భారీ మూల్యమే చెల్లించవలసి వస్తుంది. ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటే ఆ అనర్థాలను నివారించుకునే అవకాశమూ ఇంకా ఉంది.
క్రమం తప్పకుండా వ్యాయామం
కరోనా గాలిలో వ్యాప్తి చెందుతుంది అన్న భయంతో బయట నడవడానికి కూడా ప్రజలు భయపడుతున్నారు. ఆరు బయట ప్రాంతాల్లోనూ మైదానాల్లోనూ నడిచేటప్పుడు కరోనా వచ్చే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ ఇంటి బయటకి వెళ్ళటానికి అవకాశం లేకపోతే ఇంట్లోనే అనేక రకాల వ్యాయామాలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంట్లో వ్యాయామానికి సంబంధించిన పనిముట్లు ఇప్పుడు తక్కువ ఖర్చుతో కూడా దొరుకుతున్నాయి. అసలు ఏ విధమైన పనిముట్లు అవసరం లేకుండా కూడా అనేకమైన వ్యాయామాలు ఇంట్లో చేసుకోవచ్చు. వ్యాయామం క్రమం తప్పకుండా చేయడం వల్ల బరువు పెరగకుండా ఉండవచ్చు. బరువు ఎక్కువ ఉన్న వాళ్లకి కరోనా వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అన్న విషయం కూడా మనకు తెలిసిందే.
ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
బలమైన ఆహారం తీసుకుంటే కోవిడ్ వచ్చే అవకాశం తక్కువగా ఉండకపోవచ్చు కానీ కోవిడ్ ని ఎదుర్కొనే అవకాశం మెరుగ్గా ఉంటుంది. ఇది నిజమే. కానీ బలమైన ఆహారం అంటే ఆహారం చాలా ఎక్కువ పరిమాణంలో తీసుకోవాలని కాదు. మాంసకృత్తులు, విటమిన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిదే కానీ అదే సమయంలో నూనె వస్తువులు, కొవ్వు పదార్థాలు, రెడీమేడ్ ఆహారాలు, జంక్‌ఫుడ్ వంటివి ఎక్కువగా తీసుకోవడం ప్రమాదం అనే విషయం మర్చిపోకూడదు. పిండి పదార్థాలు కొవ్వు పదార్థాలు రెండూ అధికంగా ఉండే ఆహారం వల్ల మధుమేహంతో పాటు గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మధుమేహం ఉన్నవారు అన్ని రకాల తాజా పండ్లు తీసుకోవచ్చు కానీ ఇవి భోజనంలో భాగంగా తీసుకోవాలి తప్ప భోజనం తర్వాత మరీ ఎక్కువగా తీసుకున్నట్లయితే కావలసిన కేలరీల కన్నా ఎక్కువ కేలరీలు శరీరంలో చేరే అవకాశం ఉంటుంది.
మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం
క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది అని అనేక పరిశోధనల్లో తేలింది. మెడిటేషన్‌తో కూడా స్ట్రెస్ బాగా తగ్గుతుంది. స్నేహితులకు బంధువులకు ఫోన్ లో టచ్‌లో ఉండటం, నెగిటివ్ న్యూస్ కి దూరంగా ఉండటం కూడా మానసిక ఒత్తిడిని తగ్గించడానికి దోహదపడతాయి. ఆత్మీయతా, ఆధ్యాత్మికతా, స్థితప్రజ్ఞతా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మూడు ముఖ్యమైన మార్గాలు.
బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుకోవడం
అనేక ఆసుపత్రుల్లో ఆన్‌లైన్ కన్సల్టేషన్ లు అందుబాటులోకి వచ్చాయి. ఇంట్లోనే బీపీ, షుగర్ పరీక్ష చేసుకునే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత ఆన్‌లైన్ కన్సల్టేషన్ ద్వారా వైద్యుల్ని సంప్రదించి మందులు క్రమబద్ధంగా వాడినట్లయితే రక్తపోటు, మధుమేహం నియంత్రణలో ఉండే అవకాశం ఎక్కువ. అదేవిధంగా కొలెస్ట్రాల్ మోతాదును తెలుసుకోవడానికి రక్త పరీక్షలు ఇంటికి వచ్చి చేసే వాళ్ళు ఇప్పుడు నగరాల్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి కొలెస్ట్రాల్ లెవెల్స్ తెలుసుకున్న తర్వాత వాటిని వైద్యుల సలహాతో నియంత్రించవచ్చు.
ఈ ముప్పులను నివారించాలంటే ఏం చేయాలి?
మధుమేహం, గుండె జబ్బులు పెద్దసంఖ్యలో రావడం తప్పనిసరిగా జరిగి తీరుతుందని కాదు. వీటిని నివారించుకోవడానికి సమయమింకా మించిపోలేదు. వీటిని ఎదుర్కోవాలంటే మన జీవన విధానంలో పూర్తిగా మార్పులు తేవాల్సిన అవసరం ఉంది. ఈ మార్పులను సరైన విధంగా తీసుకురాగలిగితే మనం అనేక ప్రాణాలను కాపాడగలుగుతాం.
వ్యసనాలకు దూరంగా ఉండటం
ఒత్తిడి అధికంగా ఉండటం ఉన్నప్పుడు వ్యసనాలకి దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. వ్యసనమేదైనా అది మానసిక ఒత్తిడిని పెంచుతుంది కానీ ఎప్పటికీ తగ్గించదు కాబట్టి ఈ పాండమిక్ తరుణంలో వ్యసనాలకు ఎంత దూరంగా ఉంటే అంతా ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. పొగ తాగటం వల్ల గుండె జబ్బు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని మర్చిపోకూడదు.
డా. ఎంఎస్‌ఎస్ ముఖర్జీ, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్