SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు హెచ్చరిక! ఇలాంటి మెసేజ్ మీకు వచ్చిందా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే

 


SBI Phishing Attack: మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ వివరాలను అడుగుతూ లేదా కేవైసీ పేరుతో మీకు మెసేజ్‌లు వచ్చాయా.. మీ బ్యాంక్ నుంచి వచ్చినట్లే మాయగాళ్లు మిమ్మల్ని మభ్యపెడతారు. కానీ, మీరు మాత్రం అలాంటి మెసేజ్‌లను ఏ మాత్రం నమ్మకండి. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లను వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారం కోరుతూ ఎలాంటి మెసేజ్(SMS)లు పంపించదు. ఇలాంటివన్ని ఫిషింగ్ మెసేజ్‌లు అని పిలుస్తుంటారు. ఇలాంటి మెసేజ్‌ల విషయంలో మీరు జాగ్రత్తగా లేకపోతే మీరు పొదుపు చేసిన సొమ్మంతా పోయే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి మెసేజ్‌లు వచ్చినప్పడు జాగ్రత్తగా ఉండాలి. ఈమేరకు ఎస్‌బీఐ కస్టమర్లను జాగ్రత్తగా ఉండాలంటూ అవగాహన కల్పిస్తోంది.

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ.. ఇటీవల తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ చేస్తూ.. తమ వినియోగదారులు మోసపోకుండా అవగాహన కల్పిస్తోంది. ఈ మేరకు ‘ వ్యక్తిగత సమాచారం లేదా బ్యాంకింగ్ తదితర వివరాల కోసం ఈమెయిల్స్/మెసేజ్(SMS)/ఫోన్ కాల్స్ ద్వారా కస్టమర్లను సంప్రదించం. మీ సమాచారం కోరుతూ వచ్చిన ఎలాంటి మెసేజ్‌లను నమ్మకండి. ఏదైనా సమచారం కావాలంటే దగ్గరలోని బ్యాంకును సంప్రందించండి. మీ వ్యక్తిగత వివరాలు పంపమని ఎస్‌బీఐ అస్సలు కోరదు. ఇలాంటి SMiShing మెసేజ్‌లపై Report.phishing@sbi.co.in లేదా సైబర్ క్రైమ్‌ హెల్ప్‌లైన్ నంబర్ 155260 కి కాల్ చేయాలి” అంటూ ట్విట్టర్లో పేర్కొంది.

వినియోగదారులు ఇలాంటి అనుమానాస్పద మెసేజ్‌లు ఏవైనా వస్తే వెంటనే తొలగించాలని ఎస్‌బీఐ కోరింది. మీ కార్డు నంబర్/ సీవీవీ (CVV)/ పిన్ (PIN) నంబర్, ఇతర వ్యక్తిగత వివరాలను ఎవరితో పంచుకోకూడదని వినియోగదారులను హెచ్చరించింది.

వినియోగదారుల వ్యక్తిగత డేటా, ఖాతా వివరాలను దొంగిలించడానికి ఫిషింగ్ దాడులు జరుగుతున్నాయని, వాటిపై జాగ్రత్తగా ఉండాలంటూ SBI కస్టమర్‌లను హెచ్చరించింది. ఫిషింగ్ దాడులు ఎలా జరుగుతాయో తెలుసుకోవాలని ఎస్‌బీఐ కోరింది. ఇలాంటి వాటిని SBI కస్టమర్‌లు తప్పక తెలుసుకోవాలని సూచించింది. ఈ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1) ఇంటర్నెట్ బ్యాంకింగ్ వినియోగదారుడు మోసపూరిత ఈ-మెయిల్‌ను అందుకున్నాడు.

2) మెయిల్‌లో సూచించిన హైపర్‌లింక్‌పై క్లిక్ చేయలంటూ మోసగాళ్లు సూచిస్తారు.

3) యూజర్ హైపర్‌లింక్‌ని క్లిక్ చేయగానే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సైట్‌ లాగే ఉండే నకిలీ వెబ్‌సైట్‌కి ఆ లింక్ తీసుకెళ్తుంది.

4) సాధారణంగా, ఈమెయిల్‌ను క్లిక్ చేస్తే బహుమతులు లభిస్తాయంటూ మభ్యపెడుతుంది. లేదంటే పెనాల్టీ పడుతుందంటూ భయపెడతారు.

5) లాగిన్/ప్రొఫైల్ లేదా లావాదేవీ పాస్‌వర్డ్‌లతో పాటు బ్యాంక్ ఖాతా నెంబర్ల లాంటి వ్యక్తిగత అకౌంట్ వివరాలను అందించాలంటూ వినియోగదారులను కోరుతుంటారు.

6) వినియోగదారులకు అవగాహన లేకపోవడం వల్ల వ్యక్తిగత అకౌంట్ వివరాలను అందించి సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేస్తారు.

7) అనంతరం ఎర్రర్ పేజీ దర్శనమిస్తుంది.

8) దాంతో వినియోగదారుడు ఫిషింగ్ దాడికి గురయ్యాడని అర్థం.

ఇలాంటి ఫిషింగ్ దాడుల గురించి ఎస్‌బీఐ కస్టమర్‌లు కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే మోసాల బారిన పడతారు. ఎలాంటి అనుమానం వచ్చినా.. దగ్గరలోనే ఎస్‌బీఐ బ్యాంక్ వద్దకు వెళ్లి పూర్తి సమాచారం తెలుసుకోవాలి. అంతేకాని, వ్యక్తిగత అకౌంట్ వివరాలను ఇతరులకు చెప్పకూడదు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad