జగనన్న విద్యా దీవెన పథకం డబ్బును నేరుగా కాలేజీల అకౌంట్లలోనే జమ చేయాలని హైకోర్టు సంచలన ఆదేశాలు


జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇకపై ఈ డబ్బును నేరుగా సంబంధిత కాలేజీల అకౌంట్లలోనే జమ చేయాలని హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

జగనన్న విద్యా దీవెన కింద విద్యార్థులకు చెల్లించే ఫీజులను నేరుగా కాలేజీ ప్రిన్సిపాల్ అకౌంట్లోనే జమ చేయాలని న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్ కోర్టును ఆశ్రయించారు. కృష్ణదేవరాయ విద్యా సంస్థల తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరగింది. ఈ సందర్భంగా తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బు జమ చేస్తోందని, అయితే వారు ఫీజు చెల్లించకపోతే తమకు సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అయితే, ఫీజులను నేరుగా కళాశాలల ఖాతాల్లో జమ చేయాలని న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. జగనన్న విద్యా దీవెన డబ్బులు విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్‌ అకౌంట్లలో జమ చేయాల్సిందేనని కోర్టు ఆదేశించింది. నేరుగా కాలేజీల అకౌంట్లలో డబ్బులు జమ అవ్వాలని సంబంధిత అధికారులకు హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఇకపై, జగనన్న విద్యా దీవెన డబ్బు.. విద్యార్థులు తల్లుల అకౌంట్లలో కాకుండా నేరుగా కాలేజీలకే చెల్లించాల్సి ఉంటుంది. హైకోర్టు తీర్పుపై జగన్ సర్కార్ అప్పీల్‌కు వెళ్తుందా? లేక అమలు చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad