IT Jobs: ఐటీ కంపెనీల్లో లక్ష పైగా ఉద్యోగాలు
నిరుద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది దేశంలో భారీగా ఫ్రెషర్స్‌ను నియమించుకోనున్నట్లు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ కంపెనీలు ప్రకటించాయి. మన దేశంలో ఐటీ సెక్టార్ తో పాటు డిజిటల్ సేవలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో టీసీఎస్,ఇన్ఫోసిస్,విప్రో, హెచ్‌సీఎల్ కంపెనీల్లో ఉద్యోగుల అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలస) తీవ్రంగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరంలో 1,20,000 ఫ్రెషర్లను నియమించుకోవాలని భావిస్తున్నాయి. భారీ ఎత్తున ఉద్యోగుల నియామకం కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి.
టీసీఎస్
టీసీఎస్ గత ఆరు నెలల్లో రికార్డు స్థాయిలో 43,000 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాల్ని కల్పించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్వితీయార్థంలో మరో 35,000 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను ఎంపిక తీసుకోన్నట్లు చీఫ్ హెచ్‌ఆర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. తద్వారా మొత్తం ఆర్థిక సంవత్సరంలో 78,000 మందిని నియమించుకున్నట్లు అవుతుందని అన్నారు.
ఇన్ఫోసిస్
ఇన్ఫోసిస్‌ని ఉద్యోగుల అట్రిషన్ రేటు తీవ్రంగా వేధిస్తుంది. ఈ సమస్య నుంచి బయట పడేందుకు కాలేజ్ గ్రాడ్యుయేట్స్ హైరింగ్ ప్రోగ్రామ్ ద్వారా 45 వేల మందిని నియమించుకోవాలని నిర్ణయించింది.ఇక సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో జూన్ చివరినాటికి 13.9 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు 20.1 శాతానికి పెరిగింది.
విప్రో
విప్రోసైతం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 25 వేల మంది ఫ్రెషర్లను ఎంపిక చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస‍్తోంది. విప్రో తన రెండవ త్రైమాసిక ఆదాయాల ప్రకటన సందర్భంగా రెట్టింపు స్థాయిలో ఫ్రెషర్ల నియామకాలు చేపట్టినట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ థియరీ డెలాపోర్టే తెలిపారు.
హెచ్‌సీఎల్
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఈ ఏడాది 20వేల నుంచి 22వేల మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్ల కాలేజీ క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేసుకుంది. వచ్చే ఏడాది 30,000 మంది ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నామని హెచ్‌సీఎల్ తెలిపింది.
అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలస)
కాగ్నిజెంట్ సంస్థ భారీ స్థాయి అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలస) సమస్యను ఎదుర్కొంటుంది. సెప్టెంబర్ త్రైమాసికంలో 33శాతం మంది ఉద్యోగులు సంస్థ నుంచి బయటకొచ్చినట్లు తెలుస్తోంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 11.9%, ఇన్ఫోసిస్ 20.1%,విప్రో 20.5శాతం, టెక్ మహీంద్రా 21శాతంతో ఇబ్బందులు పడుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు ఫ్రెషర్స్‌ను నియమించుకునే పనిలో పడ్డాయి.