విలీనంతో విద్యా వ్యవస్థ తలకిందులు!
➤ విద్యార్థులొస్తారు.. మరి ఉపాధ్యాయులేరీ?
➤ ఏకోపాధ్యాయ పాఠశాలలు 11 వేలు
➤ ఆ ఒక్క ఉపాధ్యాయుడూ వచ్చేయాలా?
➤ కొత్తగా వచ్చే విద్యార్థులకు పాఠాలెలా?
➤ తల్లిదండ్రులు.. ఉపాధ్యాయుల్లో అసంతృప్తి
సార్! మా పాఠశాలలో ఉన్న 3, 4, 5 తరగతుల విద్యార్థుల్ని పంపించేస్తున్నాం. సరే. పంపించండి . మరి, ఉపాధ్యాయులు ఎంతమంది వస్తున్నారు. ఈ పాఠశాలలో ఉన్నదే ఒక్కడిని సర్. ఏకోపాధ్యాయ పాఠశాల. విద్యార్థులే వస్తారు. అదేంటి? టీచర్లు రాకుండా విద్యార్థులొస్తే మేమెలా పాఠాలు చెప్పగలం. మా దగ్గర ఉన్న టీచర్లే అంతంతమాత్రం. విద్యార్థుల్ని పంపొద్దు.సోమవారం. ఒక ప్రాథమిక పాఠశాల టీచర్ సమీపంలోని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫోన్ చేసినప్పుడు జరిగిన సంభాషణ ఇది!(అమరావ తి-ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వం తీసుకున్న పాఠశాలల విలీనం నిర్ణయం రాష్ట్ర విద్యావ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ‘‘1 నుంచి ఐదో తరగతి వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో ఇకపై ఒకటి, రెండు తరగతులే ఉంచాలి. 3, 4, 5 తరగతుల్ని సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేయాలి. ఆ తరగతుల్లోని పిల్లల్ని, టీచర్లను కూడా పంపించేయాలి. నవంబరు 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది’’ అంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విద్యార్థులకు పాఠాలెవరు చెప్పాలన్న మౌలిక ప్రశ్నను రేకెత్తించింది. విద్యార్థులకు విద్య నాణ్యంగా అందడాన్ని ప్రశ్నార్థకం చేసింది. రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలు(1-5 తరగతులు) సుమారు 34వేలు ఉన్నాయి. వీటిలో దాదాపు 11 వేల పాఠశాలల్లో ఒకే ఒక్క టీచర్ ఉన్నారు. మరో 15వేల పాఠశాలల్లో.. 5 తరగతులకు కలిపి ఇద్దరే ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. వీటిలో విలీనం జాబితాలో ఉన్న పాఠశాలలుంటే.. వాటి నుంచి ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాలకు వెళ్లేందుకు ఇక అవకాశమే ఉండదు. మరోవైపు అటు ఉన్నత పాఠశాలల్లోను ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటివరకు ఉన్న ఆరు నుంచి పది తరగతులకు చెప్పేందుకు తగిన ఉపాధ్యాయులు ఉన్నారు. ఒకవేళ ఎక్కడన్నా ఉంటే ఒకరిద్దరు ఉపాధ్యాయులు అదనంగా ఉన్నారు. కానీ, ఒకేసారి మూడు తరగతుల విద్యార్థులు కొత్తగా వస్తున్నారు. తరగతికి ఒక ఉపాధ్యాయుడు అనుకున్నా ముగ్గురు ఉపాధ్యాయులు అక్కడి నుంచి రావాలి. కానీ ఏకోపాధ్యాయ పాఠశాలల నుంచి వచ్చేవారు లేరు. అదే సమయంలో ఇక్కడా అదనంగా ఉపాధ్యాయులు లేరు.
మరి విలీనం ద్వారా కలిపేస్తున్న విద్యార్థులకు పాఠాలెలా చెప్తారన్నది ప్రశ్న. ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం నవంబరు 1 నుంచి పాఠశాలల్ని విలీనం చేసేయాలని నిర్ణయించింది. దీనివల్ల ఇప్పుడు విద్యార్థుల పరిస్థితి ఇబ్బందిగా మారింది. ఉపాధ్యాయుల సంఖ్యను, విలీనమయ్యే తరగతుల్లోని విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని.. సరైన ఏర్పాట్లు చేయకుండా ఉత్తర్వులు ఇచ్చేయడం చివరకు విద్యార్థుల చదువులపైనే ప్రభావం చూపనుందని అంటున్నారు విద్యా నిపుణులు. అసలు విలీనమే సరికాదన్న బలమైన అభిప్రాయం వినిపిస్తోంది.
ఉపాధ్యాయుల ఆవేదన
మరోవైపు విద్యాసంవత్సరం మధ్యలో ఈ విలీన ప్రక్రియను చేపపెట్టడంపై ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రుల్లోను ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక కొత్త ప్రయోగం అమలు చేయాలంటే వచ్చే ఏడాది నుంచి లేకుంటే విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి అమలుచేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొవిడ్ పరిస్థితి నుంచి తేరుకుని ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న విద్యా వ్యవస్థను ఇలా అతలాకుతలం చేయడం సరైంది కాదని వారు అంటున్నారు.
ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు
విలీనం చేసిన 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పాఠశాల ఉంటుందని సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చినవీరభద్రుడు ఉత్తర్వులు ఇచ్చారు. అంటే విద్యార్థులు 10 గంటలు పాఠశాలలోనే గడపాలి. సాయంత్రం 4-5 వరకు ఆటలకు సమయం కేటాయించారు. అది ముగిశాక 5-6 గంటల వరకు మళ్లీ పుస్తక పఠనం చేయాలి. అయితే, ఏకంగా 10 గంటలపాటు స్కూల్‌లోనే గడపడం అనేది ఎప్పుడూ లేదని, ఏ రాష్ట్రంలోనూ అమలుకావడం లేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రగులుతున్న ‘ఎయిడెడ్’ రగడ
వంగర, నవంబరు 1: ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనంపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కుతున్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా వంగర మండలం మగ్గూరులో ఆందోళనకు దిగారు. 68 ఏళ్ల కిందట ఎయిడెడ్ స్కూల్‌గా దాతల సహకారంతో ఇక్కడ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేశారు. విలీనం నేపథ్యంలో సోమవారం పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిలిపివేశారు. దీంతో పిల్లలు భోజనం కోసం ఇంటికి వెళ్లారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని ఎందుకు నిలిపివేశారని ప్రధానోపాధ్యాయుడిని ప్రశ్నించారు. సమాచారం అందుకున్న ఎంఈవో దుర్గారావు హుటాహుటిన చేరుకుని చర్చించారు. పాఠశాలను ఎత్తివేస్తే ఉద్యమం తీవ్రతరం చేస్తామని తల్లిదండ్రులు హెచ్చరించారు.