త్వరలో DEO , MEO పోస్టుల భర్తీ

♦త్వరలో డిఇఒ, ఎంఇఒ పోస్టుల భర్తీ

♦విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

♦️రాజమహేంద్రవరం ప్రతినిధి

త్వరలో డిఇఒ, ఎంఇఒ పోస్టులను భర్తీచేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానం అమల్లో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర మహాసభ సందర్భంగా 'జాతీయ విద్యా విధానం అమలు, ప్రధానోపాధ్యాయుల పాత్ర అనే అంశంపై సదస్సు నిర్వహించారు. మహాసభ సందర్భంగా మంత్రి సురేష్ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. 

ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో విద్యా వ్యవస్థలో మార్పులు వస్తున్నాయన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల అభివృద్ధికి సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ వహించారన్నారు. ఉపాధ్యాయుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఆంధ్రకేసరి యూనివర్సిటీలో ఉపాధ్యాయ కోర్సులు, శాశ్వత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 'నాడు-నేడు' కార్యక్రమానికి ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహం మరువలేనిదన్నారు. అనంతరం ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు కత్తి నరసింహారెడ్డి, పాకలపాటి రఘవర్మ, ఇళ్ల వెంకటేశ్వరావు మాట్లాడారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 50 వేల ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

పోస్టులను భర్తీ చేసినప్పుడే విద్యా విధానంపై ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. 500 ప్రధాన పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు లేరని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలు పోరాడి సాధించుకున్న ఏకీకృత సర్వీస్ రూల్స్ను తక్షణం అమలు చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాలల విలీనం ఉత్తర్వులను తక్షణం వెనక్కి తీసుకోవాలని, అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, నన్నయ యూనివర్సిటీ విసి మొక్కజగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు.


Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad