PRC పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు తగవు.. వెంకట్రామిరెడ్డి

పీఆర్సీపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు తగవు


సీఎం హామీపై విశ్వాసం ఉంది 

92 సంఘాలు నిరసన కార్యక్రమాలకు దూరం 

ఉద్యోగ సంఘాల ముసుగులో రాజకీయం 

సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి 

సాక్షి, అమరావతి: ఉద్యోగ సంఘాల ముసుగులో కొందరు రాజకీయాలు చేస్తున్నారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. సచివాలయ ప్రాంగణంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీఆర్సీ విషయంలో ఉద్యోగుల్లో లేనిపోని గందరగోళాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నిజానికి.. పీఆర్సీ జాప్యంపై ఉద్యోగుల్లో కొంతవరకు అసంతృప్తి ఉన్నా, వారు ప్రభుత్వానికి ఎక్కడా వ్యతిరేకంగా లేరని ఆయన స్పష్టంచేశారు. కానీ, కొన్ని సంఘాల నాయకులు పదేపదే ఉద్యోగులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, అది తగదని హితవు పలికారు. సీఎం హామీ మేరకు పది రోజుల్లో పీఆర్సీపై స్పష్టమైన ప్రకటన వెలువడుతుందన్న విశ్వాసం తమకుందన్నారు.

Also Readకొత్త పీఆర్సీ లో మీ బేసిక్ పే ఎంతో తెలుసుకోండి 

అందుకే ఏపీ ప్రభుత్వోద్యోగుల ఫెడరేషన్‌లోని 92 సంఘాలు నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉన్నాయని.. రెండు సంఘాలు మాత్రమే తమ ఉద్యమ కార్యాచరణ ప్రకటించుకున్నాయన్నారు. ఆందోళన చేస్తున్న వారు గతంలో సీఎంను మూడుసార్లు కలిసినప్పుడు తమ మాజీ అధ్యక్షుడికి పదవి ఇవ్వమని అడిగారే తప్ప పీఆర్సీ గురించి ప్రస్తావించలేదని వెంకట్రామిరెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు సీఎం జగన్‌కు మద్దతిచ్చారేమో గానీ సదరు నాయకులు కాదన్నారు. వీరు గతంలో కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని ప్రచారంచేసి, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి కొమ్ముకాశారని ఆరోపించారు. సీఎం చెప్పిన సమయం వరకూ వేచి చూడాల్సిన కనీస ధర్మం ఉద్యోగులుగా తమపై ఉందన్నారు. అప్పటికీ జాప్యం జరిగితే తమ సంఘాలతో సమావేశం ఏర్పాటుచేసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఆయన తెలిపారు.

సీఎం హామీ ఇచ్చిన తర్వాత నిరసనలెందుకు? 

అమలాపురం టౌన్‌: పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీపై ఉద్యోగులకు పూర్తి నమ్మకం ఉందని రాష్ట్ర రెవెన్యూ జేఏసీ చైర్మన్‌ వీఎస్‌ దివాకర్‌ తెలిపారు. సీఎం హామీ ఇచ్చిన తర్వాత కూడా నిరసనలు ఎందుకని ప్రశ్నించారు. పీఆర్సీ సాధన కోసం ఉద్యమిస్తున్నామని చెప్పుకుంటున్న రెండు జేఏసీల నిరసనల్లో రెవెన్యూ ఉద్యోగులెవరూ పాల్గొనడం లేదన్నారు. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో వీఎస్‌ దివాకర్‌ మీడియాతో మాట్లాడారు. రెవెన్యూ జేఏసీలో భాగస్వాములుగా ఉన్న ఏపీ గ్రామ సహాయకుల సంఘం, ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం, ఏపీ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్, ఏపీ తహసీల్దార్‌ అసోసియేషన్, డిప్యూటీ కలెక్టర్‌ అసోసియేషన్‌లు జేఏసీల నిరసనల్లో పాల్గొనడం లేదని చెప్పారు.

జేఏసీల చైర్మన్లు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు వెనుక రెవెన్యూ ఉద్యోగులెవరూ లేరన్నారు. పీఆర్సీ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత ఉద్యమ కార్యాచరణలోకి దిగడమేమిటని ప్రశ్నించారు. వారి తీరు అనుమానాస్పదంగా ఉందన్నారు. 2019 ఎన్నికలప్పుడు రాష్ట్ర సచివాలయం నుంచి బొప్పరాజు వెంకటేశ్వర్లు తహసీల్దార్లకు ఫోన్లుచేసి టీడీపీకి ఓటు వేయించాలంటూ ఆదేశాలిచ్చారని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు పీఏ డైరీలో బొప్పరాజుకు రూ.2 కోట్లు ఇచ్చినట్లు రాసి ఉందంటూ వచ్చిన వార్తలపై దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. భవన నిర్మాణాల కోసం చేసిన వసూళ్లపైనా బొప్పరాజు సమాధానం చెప్పాలన్నారు.  

సీఎంపై ఉద్యోగులకు నమ్మకముంది

ఏపీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సామల

సాక్షి, అమరావతి: పీఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి న్యాయం చేస్తారని నమ్ముతున్నట్లు ఏపీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ను ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఇటీవల వరద ప్రాంతాల పర్యటన సందర్భంగా కలసిన ఉద్యోగులకు సీఎం పీఆర్సీ అమలు చేస్తామని ప్రకటించడాన్ని గమనించాలన్నారు. 

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad