Adimulapu Suresh : కరోనా వస్తే.. ఆ స్కూలు మాత్రమే మూసివేస్తాం

 Adimulapu Suresh : కరోనా వస్తే.. ఆ స్కూలు మాత్రమే మూసివేస్తాం


Adimulapu Suresh : దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా ఉధృతి నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఏపీ పొరుగు రాష్ట్రం తెలంగాణలోనూ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఏపీలో మాత్రం విద్యాసంస్థలు నడుస్తూనే ఉన్నాయి. అయితే.. విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగింది. ఏపీలోనూ స్కూళ్లకు సెలవులు ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. వెంటనే సెలవులు ఇవ్వాలని ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నాయి.

ఈ క్రమంలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మరోసారి స్కూళ్లకు సెలవుల అంశంపై స్పందించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. ప్రతి రోజూ కలెక్టర్‌ స్థాయి అధికారులతో పాఠశాలల పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు

”సంక్రాంతి తర్వాత 80శాతం మంది విద్యార్థులు స్కూళ్లకు వస్తున్నారు. కరోనా బారినపడ్డ టీచర్లకు తక్షణమే సెలవులు ఇస్తున్నాం. స్కూళ్లలో పూర్తిస్థాయిలో శానిటైజ్‌ చేస్తున్నాం. టీచర్లు, విద్యార్థులు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలకు హాజరుకావాలి. కరోనా వస్తే.. ఆ స్కూలు వరకే మూసివేస్తాం. మిగతా స్కూళ్లు యథావిధిగా నడుస్తాయి. అవనసరంగా తల్లిదండ్రులు ఆందోళన పడొద్దు” అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.

కాగా, ఏపీలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. పాజిటివ్‌ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా కొత్త కేసుల సంఖ్య పది వేలు దాటడం ఆందోళనకు గురి చేస్తోంది.

గత 24 గంటల్లో 41 వేల 713 మంది శాంపిల్స్‌ పరీక్షించగా, 10వేల 057 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ఒకరోజులో పదివేలకు పైగా కేసులు వెలుగుచూడడం ఇదే తొలిసారి. కోవిడ్‌ వల్ల విశాఖలో ముగ్గురు.. చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. మరో 1,222 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు.

నిన్నటితో పోలిస్తే ఈ రోజు కోవిడ్‌ కేసులు మూడువేలకు పైగా పెరిగాయి. విశాఖలో అత్యధికంగా 1,827 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. చిత్తూరులో 1822, గుంటూరులో 943, తూర్పు గోదావరి జిల్లాలో 919 కోవిడ్‌ బారిన పడగా అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 216 కోవిడ్‌ కేసులు వెలుగు చూశాయి.

రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 44 వేల 935కి చేరింది. కరోనా మరణాల సంఖ్య 14 వేల 522కి పెరిగింది. నేటి వరకు రాష్ట్రంలో 3,19,64,682 కోవిడ్ టెస్టులు చేశారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad