అధికారుల లెక్కలన్నీ బుస్సే… కరోనా మరణాలు ఎక్కువే.. ఇదిగో సాక్ష్యం..!!

 అధికారుల లెక్కలన్నీ బుస్సే… కరోనా మరణాలు ఎక్కువే.. ఇదిగో సాక్ష్యం..!!

దేశంలో అధికారుల లెక్కల కంటే కరోనాతో మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తోంది. దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు సమర్పించిన గణాంకాలే ఈ వాస్తవాన్ని తెలుపుతున్నాయి. కరోనాతో మరణించిన ప్రతి బాధిత కుటుంబానికి రూ.50 వేల పరిహారం చొప్పున ఇవ్వాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న సమయంలో… పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మరణాలపై నివేదికలను సమర్పించాయి. ఈ నివేదికల ద్వారా కరోనా మరణాల సంగతి వెలుగులోకి వచ్చింది.

ఉదాహరణకు తెలంగాణనే చూసుకుంటే.. ప్రభుత్వ లెక్కల ప్రకారం 4,100కు పైగా మరణాలు నమోదయ్యాయి. కానీ కరోనా పరిహారం కోసం 29,969 దరఖాస్తులు వచ్చాయని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం నివేదించింది. ఇప్పటికే 12వేలకు పైగా కేసుల్లో పరిహారం చెల్లించడం పూర్తయిందని తెలిపింది. అటు ఏపీలోనూ అధికారుల లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 14,514గా ఉండగా… 36 వేలకు పైనే దరఖాస్తులు వచ్చాయని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. ఇప్పటివరకు 11,464 దరఖాస్తుదారులకు పరిహారం మంజూరైందని తెలిపింది.

అటు ప్రధాని మోదీ సొంత జిల్లా గుజరాత్ లో అధికారిక కరోనా మృతులు 10 వేలుగా ఉంటే పరిహారం కోసం 90 వేల దరఖాస్తులు వచ్చాయి. దాదాపు మెజారిటీ రాష్ట్రాల్లో మృతుల సంఖ్యకు మించి పరిహారం కోసం దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. కరోనాతో ఆస్పత్రుల్లో కంటే బయటే ఎక్కువ మంది ప్రజలు మృతి చెందారని సమాచారం. అయితే అలా మరణించిన వారి వివరాలు గణాంకాల్లోకి చేరలేదని.. ఇప్పుడు దరఖాస్తులు ఎక్కువగా రావడానికి ఇదే కారణమని తెలుస్తోంది. కరోనా పాజిటివ్‌గా తేలిన తర్వాత నెల రోజుల్లోపు మరణించిన అందరికీ పరిహారం ఇవ్వాల్సిందేనని గతంలో సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొన్న సంగతి తెలిసిందే.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad