జగన్ ముద్దుల మీద సాంగ్ . వైరల్
సీఎం జగన్ చుట్టూ సమస్యల ముళ్లే ఉన్నాయి.ఆయన అవి దాటుకుని రావడం అనుకున్నంత సులువు కాదు.ముఖ్యంగా ఇవాళ ఆయన ఏదో ఒక సానుకూల నిర్ణయం తీసుకోకపోతే వైసీపీ ప్రభుత్వ మనుగడే ప్రమాదంలో పడబోనుందని అంటున్నారు విశ్లేషకులు.ఇప్పటికైనా పీఆర్సీకి సంబంధించి వివాదాస్పద జీఓలు వెనక్కు తీసుకోవాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ముక్త కంఠంతో కోరుతున్నారు.
ఈ దశలో నిరసనలను జిల్లా స్థాయిలో హోరెత్తించి తమ బాధనంతా వెళ్లగక్కారు.రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాఫ్టో నేతలు నిరసనలతో హోరెత్తించారు.ఉద్యోగులు,ఉపాధ్యాయులు ఈ నిరసనల్లో పాల్గొని తమకు కొత్త పీఆర్సీ కారణంగా జరిగిన నష్టాన్ని వివరిస్తూ పాట రూపంలో గొంతెత్తారు.ఓ మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి గారు అంటూ మొదలయ్యే ఓ పాట సీఎంని విమర్శిస్తూ,తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.ముఖ్యంగా ఐఆర్ నే పీఆర్సీ అని చూపించి సీఎం తమను మోసం చేశారని ఆవేదన చెందారు.తమకు హెచ్ఆర్ పేరిట, పీఆర్సీ పేరిట జరిగిన అన్యాయాన్ని వెంటనే సరిదిద్దాలని కోరారు.
అదేవిధంగా ఫ్యాప్టో నాయకులు పాడిన ఈ పాటలో…
ముద్దుల మీద ముద్దులు ఇచ్చే ముఖ్యమంత్రి గారు
మీ పాదయాత్ర లో ఇచ్చిన హామీ నిలుపుకోండి మీరు
అంటూ వ్యంగ్యార్థ రీతికి చెందిన ఈ పంక్తులు తెగ వైరల్ అవుతున్నాయి.పీఆర్సీల హెచ్ ఆర్ ఏ ల సంగతేంటి సారూ ఐఆర్ నే పీఆర్సీ అంటూ.. మాయచేసినారు..అంటూ ఉద్యోగులు ఉద్యమ బాటలో నిరసన గేయాలను అందుకుంటూ.. తోటి వారిని ఉత్సాహ పరుస్తూ, ప్రభుత్వ రీతిని దుయ్యబడుతున్నారు.సీపీఎస్ రద్దు చేస్తనని మాట ఇచ్చినారు..ఇచ్చిన మాట నిలుపుకోక ఎగతాళి చేసినారు అంటూ..ఈ పాటలో మరికొన్ని పంక్తులు సంచలనం అవుతున్నాయి. మొత్తం పాటలో సచివాలయం గురించి, టీచర్ల గురించి, అదేవిధంగా జడ్జిల గురించి వారి జీతభత్యాలు పెరగని తీరు గురించి వెక్కిరిస్తూ, పెదవి విరుస్తూ ప్రస్తావించిన తీరు బాగుందని కూడా మరికొందరు విపక్ష నాయకులు ప్రశంసిస్తున్నారు.పీఆర్సీ అంతా రివర్సు గేరు ఎందుకాయె సారు చెట్టును ఎక్కి మొదలు నరకడం మీకె ముప్పు యారు అంటూ చాలా ఘాటుగా విమర్శించారు.అదేవిధంగా అప్పులు మీద అప్పులు చేసి తిప్పలెందుకండి..వెనుకటి వారు ఏలిన రీతిన మీరు నడుచుకోండి.. అని హితవు చెప్పారు.