AP PRC issue: పీఆర్సీపై చర్చలు అసంపూర్ణం.

 AP PRC issue: పీఆర్సీపై చర్చలు అసంపూర్ణం.. కొత్త జీవో రద్దు చేయాలన్న ఉద్యోగులు.. ప్రసక్తే లేదంటున్న సజ్జల!

Andhra Pradesh PRC Fight: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పీఆర్సీ (PRC)పై పీటముడి వీడటం లేదు. తాజాగా మంత్రుల కమిటీత స్టీరింగ్‌ కమిటీ నేతలు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సమ్మె ఆలోచన విరమించాలని మంత్రుల కమిటీ(Committee of Ministers) సూచిస్తుంటే, పాత వేతనాలు అమలు చేయాలని ఉద్యోగులు(Govt, Employees) డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ఈ వివాదం మరింత ముదురుతోంది. మరోవైపు, చర్చలు అంటూనే ప్రభుత్వం.. తాను చేయాల్సిన పని చేసుకుపోతోంది. ఓ వైపు ఉద్యోగంలో సహకరించని వారిపై చర్యలు తీసుకుంటోంది. మెమోలు జారీ చేస్తోంది. అక్కడితోనే ఆగకుండా.. పీఆర్సీ విషయంలో వెనక్కు తగ్గేదే లేదని.. కొత్త జీవోలను రద్దు చేసే ప్రసక్తి లేదని బహిరంగంగానే క్లారిటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే మంత్రుల కమిటీ మరోసారి క్లారిటీ ఇచ్చింది.

ఈ క్రమంలోనే మంత్రుల కమిటీతో స్టీరింగ్‌ కమిటీ చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. మంత్రుల కమిటీ ముందు 3 ప్రతిపాదనలు ఉంచారు స్టీరింగ్‌ కమిటీ నేతలు. పీఆర్సీకి సంబంధించి అశుతోష్‌ మిశ్రా నివేదిక బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని, పాత జీతాలే వేయాలని డిమాండ్‌ చేశారు. జీతాల విషయంలో తొందర ఎందుకని స్టీరింగ్‌ కమిటీ ప్రశ్నించింది. దీనిపై చర్చించి మళ్లీ చెబుతామని మంత్రుల కమిటీ సమాధానమిచ్చింది. దీంతో స్టీరింగ్‌ కమిటీతో మరోసారి భేటీ కానుంది మంత్రుల కమిటీ.

ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం పాత జీతాలే ఇవ్వాలని, కొత్త జీవోలను రద్దు చేయాలని కోరుతున్నారు. అప్పుడే మళ్లీ చర్చలు జరుపుతాయని చెబుతున్నారు. పీఆర్‌సీ అంశంపై ఇప్పుడు హైకోర్టులో కూడా విచారణ జరుగుతున్నందున ఉద్యోగులు సమ్మె, ఆందోళన కార్యక్రమాలు విరమించాలని సూచించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల. మరోవైపు ఉద్యోగులతో ఎన్నిసార్లయినా చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇదే సమయంలో సర్కార్‌పై ఒత్తిడి తీసుకొచ్చి, తమ డిమాండ్లు సాధించకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రయత్నిస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదంటున్నారు సజ్జల.

అటు ఉద్యోగుల పీఆర్సీ అంశంపై హైకోర్టులో కూడా విచారణ జరిగింది. నూతన జీవోలను సవాల్ చేస్తూ హైకోర్టు ఏపీ గెజిటెట్ ఫోరం అధ్యక్షుడు కృష్ణయ్య పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ వాదనలతో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్ట్‌. జీవోలో పేర్కొన్న విధంగా రికవరీ లేకుండా జీతాలు వేయాలని ప్రభుత్వనికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్ట్‌. జీతాల్లో రికవరీ చేయడం చట్ట విరుద్ధమని వెల్లడించింది. ఆశుతోష్ మిశ్రా నివేదికను కూడా ఇవ్వలేదన్న పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. జీవోల్లో ఏరియర్స్ కోత విధించడంపై కూడా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు న్యాయవాది.

అయితే రికవరీ అంశం ఏమి లేదని కోర్టుకు తెలిపారు ఏజీ. దీనిపై మూడు వారాల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది హైకోర్ట్‌. తదుపరి విచారణను ఈ నెల 23 కి వాయిదా వేసింది కోర్టు. మరోవైపు, ఉద్యోగులు సమ్మెకు వెళ్లే ఆలోచనను విరమించుకోవాలని ఏపీ సీఎస్‌ సమీర్‌శర్మ కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వెనక్కి తగ్గాలని సూచించారు. ఉద్యోగులు తమ సమస్యపై మంత్రుల కమిటీతో చర్చించాలని సూచించారు. మరోవైపు ఉద్యోగుల జీతాలు తగ్గించలేదని తెలిపారు ఏపీ సీఎస్‌. జనవరి నెల జీతాలు ఇవాళ తమ అకౌంట్లలో వేస్తామని, ఒకవేళ ఇవాళ శాలరీ జమ కాని వారి అకౌంట్లలో రేపు వేతనాల డబ్బులు వేస్తామని తెలిపారు.

ఒకవైపు మళ్లీ చర్చలు జరుపుతామని మంత్రుల కమిటీ చెబుతుంటే, కొత్త జీవోలు రద్దు చేయాలని స్టీరింగ్‌ కమిటీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో మళ్లీ చర్చలు ఎప్పుడు జరుగుతాయనేది సస్పెన్స్‌గా మారింది.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad