AP PRC: ‘చలో విజయవాడ’పై ఉత్కంఠ.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల అడ్డగింతలు

 AP PRC: ‘చలో విజయవాడ’పై ఉత్కంఠ.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల అడ్డగింతలు

అమరావతి: ఏపీలో పీఆర్సీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ‘పీఆర్సీ సాధన సమితి’ రేపు తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం ఉత్కంఠ రేపుతోంది. కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఉద్యోగులను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ వెళ్లొద్దని వివిధ జిల్లాల్లో ఉద్యోగ సంఘాల నేతలకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఉత్తర్వులు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. కొన్ని చోట్ల ముందుగానే గృహనిర్బంధాలు చేశారు. నిర్బంధాలతో పోరాటాన్ని ఆపలేరని ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఉద్యమ కార్యాచరణ యధావిథిగా కొనసాగిస్తామని వారు వెల్లడించారు.


మరోవైపు ఉద్యోగ సంఘాల నాయకుల ఇళ్ల చిరునామాలను పోలీసులు సేకరిస్తున్నారు. విజయవాడ వచ్చేవారి వివరాలు సేకరించాలని వాలంటీర్లకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఉద్యమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పీఆర్సీ సాధన సమితి ఆందోళనలు కొనసాగిస్తోంది. ఉద్యోగులు ఇవాళ ప్రభుత్వ యాప్‌లను నిలిపేయనున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు వేతన స్లిప్పులు, పీఆర్సీ జీవోల దహనానికి ఉద్యోగ సంఘాల పిలుపునిచ్చాయి.


‘చలో విజయవాడ‘ కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమైన అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గ ఎన్జీవో అధ్యక్షుడు నరసింహులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. హిందూపురం పాలిటెక్నిక్‌ కళాశాల సమీపంలోని ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనకు నోటీసులిచ్చారు. విజయవాడ వెళ్తున్న ప్రకాశం జిల్లా ఉద్యోగ సంఘాలకు పోలీసులు నోటీసులిస్తున్నారు. కొవిడ్‌ నిబంధనలు ఉన్నందున అనుమతి లేదంటూ ఉద్యోగులను అడ్డుకుంటున్నారు. ఒంగోలులో ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శరత్‌ను గృహనిర్బంధం చేశారు. నెల్లూరు జిల్లాలో నెల్లూరు, గూడురు, వాకాడు, వరికుంటపాడులో ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. ఆత్మకూరులో ఉపాధ్యాయులను గృహనిర్బంధం చేశారు. పీఆర్సీ సాధన సమితి నేత చేజర్ల సుధాకర్‌రావును నెల్లూరు ఒకటో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.


చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి ఉపాధ్యాయుల ఇళ్లకు వెళ్లిన పోలీసులు నోటీసులిచ్చారు. అనంతపురం నుంచి విజయవాడ వెళ్లే మార్గాల్లో పోలీసులు మోహరించారు. చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు నిఘా ఉంచారు. జిల్లాలోని కళ్యాణదుర్గం, బుక్కరాయసముద్రం, నార్పల క్రాస్‌ వద్ద పోలీసులు తనిఖీల చేపట్టారు. ‘చలో విజయవాడ’కు వెళ్లకుండా విజయనగరం పోలీసుల చర్యలు తీసుకుంటున్నారు. బొబ్బిలిలో యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి విజయగౌరిని గృహనిర్బంధం చేశారు.


‘చలో విజయవాడ’ అనుమతి లేదని విశాఖలోనూ ఉద్యోగులకు పోలీసులు ముందస్తు సమాచారం అందించారు. విశాఖ, అనకాపల్లి, కశింకోట, ఎలమంచిలి, పాయరావుపేట పరిధిలో పోలీసులు ఉద్యోగులకు సమాచారం ఇచ్చారు. కృష్ణా జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. విజయవాడకు వెళ్లొదంటూ పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. నందిగామ, కంచికచర్ల ప్రాంతాల్లో ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి పోలీసులు ఆదేశాలిచ్చారు. స్టేషన్‌కు రావాలని సంఘ నాయకులను కోరారు. ఉద్యోగ సంఘాలతో నిన్న రాత్రి నందిగామ డీఎస్పీ సమావేశమయ్యారు. ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని ఉద్యోగ సంఘాలు ఆందోళకు చేపట్టాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.

గుంటూరు జిల్లాలోనూ ‘చలో విజయవాడ’కు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులను గృహనిర్బంధం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్యోగ సంఘ నాయకులకు పోలీసులు ఫోన్లు చేశారు. విజయవాడకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు రాత్రే ఉద్యోగ సంఘం జిల్లా ప్రధాన నాయకులు విజయవాడకు వెళ్లారు.

SOURCE: EENADU.NET

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad