Semaglutide Drug : ప్రపంచానికి గుడ్‌న్యూస్.. అధిక బరువును తగ్గించే సరికొత్త డ్రగ్.. ఇదో గేమ్‌ఛేంజర్..!
Semaglutide Drug : ప్రపంచవ్యాప్తంగా అధిక బరువుతో బాధపడే వారందరికి శుభవార్త.. ఎన్ని మందులు వాడినా.. గంటల కొద్ది వ్యాయామాలు చేసిన బరువు తగ్గడం లేదా? ఎన్ని వెయిట్ లాస్ ట్రీట్ మెంట్స్ చేయించుకున్నప్పటికీ ఎలాంటి ఫలితం లభించడం లేదా? స్థూలకాయ సమస్యతో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్న ఎంతోమందికి అతిత్వరలోనే ఉపశమనం కలగనుంది. అధిక బరువు సమస్యకు చెక్ పెట్టే తరుణం వచ్చేసింది. సుదీర్ఘ కాలంగా స్థూలకాయ సమస్యతో బాధపడుతున్న వారికి సులువుగా బరువు తగ్గించుకునేందుకు ఓ సరికొత్త డ్రగ్ అందుబాటులోకి వచ్చేస్తోంది.
ఇదో గేమ్ ఛేంజర్ డ్రగ్..
అదే.. సెమాగ్లుటైడ్ (Semaglutide) డ్రగ్.. దీన్ని ఇంజెక్ట్ చేసుకోవడం ద్వారా అతికొద్ది రోజుల్లోనే సులభంగా బరువు తగ్గించుకోవచ్చునని తేలింది. ఇప్పుడు ఈ సెమాగ్లుటైడ్ వినియోగానికి NICE (National Institute for Health and Care Excellence) ఆమోదం తెలిపింది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో బరువు (Weight Loss Treatments) తగ్గేందుకు ఎన్నో చికిత్సలు, ఔషధాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఈ సరికొత్త వెయిట్ లాస్ డ్రగ్ ట్రీట్ మెంట్ ఓ గేమ్ ఛేంజర్ కానుంది. ఈ కొత్త వెయిట్ లాస్ డ్రగ్.. ఊబకాయంతో బాధపడే వేలాదిమంది బాధితుల పాలిట వరంగా మారనుంది. ఇంగ్లాండ్‌లో అధిక బరువు సమస్యతో బాధపడే వారికి NHSలో ఈ కొత్త వెయిట్ లాస్ డ్రగ్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది.
ఈ (Semaglutide) డ్రగ్ వారాలపాటు తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై నిర్వహించిన ట్రయల్స్‌లో ఏడాదిపాటు ఇంజెక్షన్లు తీసుకున్న ఊబకాయుల బరువు సగటున 12శాతం తగ్గినట్టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ ఎక్సలెన్స్ (NIC) పేర్కొంది. ఈ డ్రగ్‌కు Wegovy అని కూడా పేరుంది. అయితే.. అధిక బరువు సమస్యతో బాధపడేవారిలో (obstructive sleep apnoea) లేదా గుండె జబ్బులు అధికంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి బాధితుల్లో కనీసం 35 బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ఉన్నవారి కోసం ప్రత్యేకించి Wegovy అనే సెమాగ్లుటైడ్ డ్రగ్ సిఫార్సు చేస్తున్నట్టు మార్గదర్శకాల్లో తెలిపింది. అయితే కొందరిలో అత్యవసర పరిస్థితుల్లో Body Mass Index (BMI) 30 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ పెన్ ఇంజెక్టర్ ద్వారా వినియోగించుకోవచ్చు. ఈ డ్రగ్ ఎవరికి వారే ఇంజెక్ట్ చేసుకోవచ్చు అనమాట..
ఇంగ్లండ్‌లో ప్రతి నలుగురిలో ఒకరికి ఊబకాయం :
ఇంగ్లండ్‌లో ప్రతి నలుగురిలో ఒకరి కంటే ఎక్కువ మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. అంటే.. 30 లేదా అంతకంటే ఎక్కువ BMI కలిగిన వారే ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి ఊబకాయుల్లో అనారోగ్య సమస్యలకు దారితీసే ముప్పు ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు.. వీరంతా శారీరకంగా బలహీనంగా ఉంటారు. ఫలితంగా జీవితకాలం పాటు తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. NHS ద్వారా ఏడాదికి ఈ అధిక బరువు సమస్యపైనే బిలియన్ల పౌండ్ల ఖర్చు చేస్తున్నారట..
ఈ డ్రగ్‌లోని హార్మోన్.. ఆకలిని అణిచివేస్తుంది..
అయితే.. ఈ కొత్త డ్రగ్ సెమాగ్లుటైడ్‌తో తీసుకున్న వారిలో గ్లూకాగాన్ పెప్టైడ్ 1 (GLP-1) అనే హార్మోన్ (glucagon-like peptide 1) విడుదల అవుతుంది. ఫలితంగా వారిలో ఆకలిని అణిచివేస్తుంది. బాధితులు సులభంగా తమకు తామే ఇంజెక్ట్ చేసుకోవచ్చు. ఇది తీసుకున్నాక వారిలో కడుపు నిండిన అనుభూతిని కలుగుతుంది. దీని కారణంగా తక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటారు. తద్వారా క్రమంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
అధిక బరువు, ఊబకాయం సమస్య అనేది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటని పోషక నిపుణులు అంటున్నారు. దాదాపు మూడింట రెండు వంతుల మంది బాధితులు అధిక బరువు లేదా ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారని NICE లోని ప్రోగ్రామ్ డైరెక్టర్ హెలెన్ నైట్ అభిప్రాయపడ్డారు. ఈ ఊబకాయ సమస్య ఒకసారి మొదలైతే.. జీవితకాలంగా బాధిస్తుందని అన్నారు. దీని కారణంగా చాలామంది మానసికంగానూ, శారీరకంగానూ ఇబ్బంది పడుతుంటారని, అది వారి జీవితంపై ప్రభావితం చేస్తుందని హెలెన్ చెప్పారు.
అధిక ముప్పు ఉన్నవారికే ఈ డ్రగ్ :
స్థూలకాయ సమస్యకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న డ్రగ్ ట్రీట్ మెంట్స్ కోసం ప్రీడయాబెటిస్, హృదయ సంబంధ వ్యాధుల ముప్పు ఉన్నవారికి మాత్రమే ఈ కొత్త డ్రగ్ పరిమితం చేసినట్టు NICE పేర్కొంది. దక్షిణాసియా, చైనా, ఆఫ్రికన్ లేదా కరేబియన్ ప్రాంతానికి చెందిన ఊబకాయ బాధితులు వైద్యుడి సలహాతో తక్కువ BMI ఉంటేనే ఈ డ్రగ్ తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది.
అయితే, బాధితులకు నిపుణులు, స్పెషలిస్ట్ వెయిట్ మేనేజ్‌మెంట్ ప్రిస్క్రిప్షన్‌పై మాత్రమే సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. గరిష్టంగా రెండు ఏళ్ల పాటు ఈ కొత్త సెమాగ్లుటైడ్ డ్రగ్‌పై క్లినికల్ ట్రయల్ నిర్వహించగా.. అందులో పాల్గొన్నవారంతా ఎక్కువ బరువు తగ్గినట్టు తేలింది. ఇప్పుడు నిపుణులు సైతం.. ఈ డ్రగ్‌ను “గేమ్‌ఛేంజర్”గా అభివర్ణించారు.