వంటింటిపై ‘గ్యాస్’ బాంబు!
మరో వారంలో గృహ వినియోగ సిలిండర్ ధర భారీగా పెరిగే అవకాశం
రూ.50కి పైగానే పెరిగే చాన్స్ ఉందంటున్న మార్కెట్ వర్గాలు
19 కిలోల సిలిండర్ ధరపై ఏకంగా రూ.105 పెంపు
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత డొమెస్టిక్ బాదుడు!
సాక్షి, హైదరాబాద్: నాలుగు నెలల నుంచి స్థిరంగా ఉన్న గృహ వినియోగ గ్యాస్ ధరలు వారం రోజుల్లో పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మంగళవారం 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను చమురు సంస్థలు ఏకంగా రూ.105 మేరకు పెంచాయి. 5 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.27 పెరిగింది. అయితే ప్రస్తుతానికి గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధరను మాత్రం పెంచలేదు. అయితే ఉత్తరప్రదేశ్‌తో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల చివరి విడత పోలింగ్ ఈనెల 5న ముగియనున్న నేపథ్యంలో.. వచ్చే వారంలో గృహ వినియోగ గ్యాస్ ధర భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
SBI వినియోగదారులకు శుభవార్త.. తక్కువ వడ్డీకే 3 లోన్లు
SB కస్టమర్స్ కి గుడ్ న్యూస్…వడ్డీ రేట్లు పెంపు ..
SBI కీలక నిర్ణయం, బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త!!
ఉక్రెయిన్ , రష్యాల మధ్య యుద్ధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే దేశంలో బల్క్ డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. తాజాగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోల్, డీజిల్‌తో పాటు వంట గ్యాస్ ధరలను కూడా చమురు సంస్థలు పెంచుకునేందుకు కేంద్రం పచ్చజెండా ఊపినట్లు మార్కెట్ నిపుణులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలోనే వాణిజ్య సిలిండర్ ధర గణనీయంగా పెరిగింది. 19 కిలోల సిలిండర్ ధరను రూ.105 మేర పెంచగా, 5 కిలోల సిలిండర్‌పై రూ. 27 పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.2,086 నుంచి రూ.2,191కి పెరిగింది. ఈ సిలిండర్ల ధరల పెంపు భారం పరోక్షంగా సామాన్యులపై కూడా పడనుంది.
నాలుగు నెలలుగా పెండింగ్!
చమురు ఉత్పత్తుల ధరల పెంపుదల తథ్యం అని తెలిసినప్పటికీ... ఆయిల్ కంపెనీలు ఎంత మేర ధరలను పెంచుతాయనే దానిపై స్పష్టత లేదు. బల్క్ డీజిల్, కమర్షియల్ గ్యాస్ ధరలను పెంచడం ద్వారా డొమెస్టిక్ గ్యాస్, రిటైల్ ఆయిల్ ధరల పెంపును సైతం ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉండా లని కేంద్రం సంకేతాలిచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.952గా ఉంది. ఆదిలాబాద్‌లో రూ.976.50 ఉండగా, ఖమ్మంలో అత్యల్పం గా రూ.939 ఉంది. 2021 అక్టోబర్ 6 నుంచి ఈ డొమెస్టిక్ గ్యాస్ ధరల్లో మార్పులేదు. తాజా పరిస్థితుల్లో రూ.50కి పైగానే ధర పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.