విద్యా శాఖ పై హై కోర్ట్ సీరియస్

 రుజువు చూపకపోతే జైళ్లలో మీకు సీట్లు.. మాటల్లో కాదు చేతల్లో': ఏపీ హైకోర్టు సీరియస్

ఏపీ హైకోర్టు జగన్ సర్కార్‌ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆర్థికంగా వెనకబడిన వర్గాల పిల్లలకు.. ఆర్టీఈ చట్టం నిబంధనల ప్రకారం ప్రైవేటు స్కూళ్లలో మొదటి తరగతిలో 25% సీట్లను ఉచితంగా కేటాయించాలంటూ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పును అమలుచేయడం లేదంటూ లాయర్ యోగేష్‌ హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. గతంలో పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులివ్వగా.. గురువారం ఈ పిటిషన్‌పై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది.

ఈ సీట్ల భర్తీ వ్యవహారంలో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ విస్తృత ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని లాయర్ యోగేష్ వాదనలు వినిపించారు. రాష్ట్రంలోని 16వేల ప్రైవేటు స్కూళ్లలో ఒక్కోచోట కనీసం ఐదు సీట్లు కేటాయించినా మొత్తం 80 వేల మంది చిన్నారులకు మంచి జరిగేది అన్నారు. ఈవివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఇచ్చిన ఆదేశాల అమల్లో నిర్లక్ష్యం చేస్తే సహించబోమని వ్యాఖ్యానించింది. అయితే సీట్ల భర్తీ ప్రక్రియను సిద్ధం చేశామని, కోర్టు ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నామని.. వివరాలను కోర్టు ముందుంచేందుకు ప్రభుత్వ లాయర్ గడువు కోరారు

ఈ సీట్లు భర్తీ చేయడంలో ప్రభుత్వ తీరు సరిగాలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విద్యాసంవత్సరానికి (2022-23) ఈ సీట్లను ఇవ్వాలంటూ తామిచ్చిన ఆదేశాలను సరైన స్ఫూర్తితో అమలు చేయకుండా ప్రైవేటు స్కూళ్లకు పరోక్షంగా సాయపడేలా ప్రభుత్వ చర్యలున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పేద విద్యార్థుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని.. మాటలు కాదు, చేతల్లో చూపాలని సీరియస్ అయ్యింది. పేద పిల్లలతో 25% సీట్లు భర్తీ చేసినట్లు రుజువు చూపకపోతే జైళ్లలో మీకు సీట్లు కేటాయిస్తామని ఘాటుగా స్పందించింది. ఈ కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న సీఎస్, పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌లను హైకోర్టు హెచ్చరించింది.

విద్యార్థులు స్కూల్లో అయినా ఉండాలి.. లేదా అధికారులు జైల్లో అయినా ఉండాలని హైకోర్టు సీరియస్‌గా హెచ్చరించింది. ప్రభుత్వం వేసిన అఫిడవిట్‌పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మాటలు చెప్పడం కాదని.. రుజువులు చూపించాలని వ్యాఖ్యానించింది. నిరుపేద విద్యార్ధుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని.. ఎంతమంది పిల్లలకు స్కూళ్లలో అడ్మిషన్లు కల్పించారన్న వివరాలను కోర్టు ముందుంచాలని ఆదేశించింది. ఆ వివరాలపై సంతృప్తి చెందకపోతే వ్యక్తిగత హాజరుకు ఆదేశిస్తామని.. వివరాలను తమ ముందుంచాలంటూ విచారణను ఈనెల 7కు వాయిదా వేసింది హైకోర్టు ధర్మాసనం.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad