AP PRC: మళ్లీ మొదటికి పీఆర్సీ పంచాయితీ.. ఇక తేల్చేసేపనిలో ఉద్యోగ సంఘాలు..!

 మళ్లీ మొదటికి పీఆర్సీ పంచాయితీ.. ఇక తేల్చేసేపనిలో ఉద్యోగ సంఘాలు..!


ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో మలుపులు తిరిగి ఖరారైన పీఆర్సీ కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఫిట్ మెంట్ ఫిక్స్ చేసే సమయంలో సీఎస్ నేతృత్వంలోని అధికారుల కమిటీ నివేదిక ప్రకారం 14.29 శాతం ఫిట్ మెంట్ మాత్రమే ఇస్తామన్న ప్రభుత్వం.. చివరకు 23 శాతానికి అంగీకరించింది. దీనికి ఉద్యోగ సంఘాలు కూడా సంతృప్తి వ్యక్తం చేశాయి. అయితే తాజాగా హెచ్ఆర్ఏ విషయంలో ప్రభుత్వం.. అధికారుల కమిటీ సిఫార్సులనే పాటిస్తూ ఆ మేరకు జీవోలు జారీ చేసింది. దీంతో సీఎంవో అధికారులతో హెచ్ఆర్ఏ, సీసీఏ రద్దు అంశాలపై పండుగకు ముందు చర్చలు జరిపిన ఉద్యోగులు.. తాజా జీవోల జారీతో షాక్‌కు గురయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే.. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో అగ్గిని రాజేసింది

చరిత్రలో ఇంత వరకు కనివినీ ఎరుగని రీతిలో ఉద్యోగులకు నష్టం చేకూర్చేలా ప్రభుత్వం పీఆర్సీ విషయంలో నిర్ణయం తీసుకుందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.. దాదాపు అన్ని సంఘాలు ఏకతాటిపై వచ్చి ప్రభుత్వ జీవోను వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వానికి విధేయుడిగా ఉండే సచివాలయ ఉద్యోగ నేత వెంకట్రామిరెడ్డి కూడా సర్కార్‌ తీరును తప్పుబట్టడం చర్చనీయాంశమైంది. కొన్నింట్లో రాజీపడతామని.. కానీ అన్నింట్లో రాజీ పడుతూ పోతే తమను చరిత్ర క్షమించదన్నారాయన. ఇక, ప్రభుత్వం జీవోను ఉపసంహకరించుకోవాలని.. అవసరమైతే సమ్మెకైనా సిద్దమంటూ ప్రకటించారు ఉద్యోగ నేతలు. డీఏలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం పీఆర్సీని ప్రకటించిందని మండిపడ్డారు. ప్రభుత్వం ఈ స్థాయిలో ఉద్యోగులను నిర్లక్ష్యం చేయడానికి కారణం సంఘాల మధ్య అనైక్యతేననే విషయాన్ని గుర్తించినట్టుగా కన్పిస్తోంది. దీంతో తమ మధ్య ఉన్న విబేధాలను పక్కన పెట్టి.. ఉద్యోగ సంఘాలు ఏకమయ్యే సూచనలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. పీఆర్సీపై ఉద్యమ కార్యాచరణకు ఉద్యోగ సంఘాలు సిద్ధం అవుతున్నాయి.. ఇవాళ సమావేశం కానున్న ఏపీ ఎన్జీవో సంఘం నేతలు.. పీఆర్సీ, హెచ్ఆర్ఏ, సీసీఏ రద్దు వంటి అంశాల పై ప్రభుత్వం నిర్ణయంపై చర్చించనున్నారు.. మరోవైపు.. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి కార్యవర్గం వేర్వేరుగా సమావేశం కాబోతోంది.. రేపు సాయంత్రం ఉమ్మడిగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad