ఇంటి పక్కనే బడి కావాలంటే కుదరదు
దూరమైనా ప్రైవేటు బడులకైతే వెళ్తున్నారుగా
టీచర్లు జీతాల గురించి అడగొచ్చు... విధానాలను ప్రశ్నించే హక్కు లేదు: బొత్స
అమరావతి, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): అందరికీ ఇంటి పక్కనే బడి కావాలంటే కుదరదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. తరగతుల విలీనంతో 3, 4, 5 తరగతుల విద్యార్థులు వెళ్తోంది పక్క ఊ రికి కాదని, పక్క వీధికి మాత్రమేనని స్పష్టం చేశారు. ‘ప్రభుత్వ స్కూళ్లు దూరమంటున్నారు. అదే ప్రైవేటు స్కూళ్లకైతే దూరమైనా వెళ్తున్నారు కదా’ అని బొత్స ప్రశ్నించారు. బుధవారం విజయవాడలో పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల విడుదల సందర్భంగా ఆయన విలీనంపై మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా పాఠశాలల విలీనం జరగడం లేదని, కేవలం తరగతులు మాత్ర మే విలీనం చేస్తున్నామని చెప్పారు. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయని, ఫలితాలూ వెంటనే కనిపించవన్నారు. 5,800 పాఠశాలల్లో విలీనం చేస్తుంటే కేవలం 400 పాఠశాలలపైనే అభ్యంతరాలొచ్చాయంటే మిగిలినవన్నీ సక్రమంగా ఉన్నట్టేకదా అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు జీతాల గురించి అడగొచ్చని, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే హక్కు వారికి లేదని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు వారి జాబ్ చార్ట్‌ను పాటించాలన్నారు. విలీనంపై తల్లిదండ్రుల్లో కేవలం ఒక శాతమే వ్యతిరేకత ఉందన్నారు. విలీనంపై ప్రజాభిప్రాయం ఎందుకు తీసుకోలేదని విలేకరులు ప్రశ్నించగా... ప్రతిసారీ ప్రజల అభిప్రాయాలు తీసుకోవడం సాధ్యం కాదన్నారు.
విద్యార్థుల సంఖ్య ముఖ్యం కాదుప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ విద్యార్థులు తగ్గొచ్చు లేదా పెరగొచ్చని బొత్స అన్నారు. ‘‘విద్యార్థుల సంఖ్య ముఖ్యం కాదు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు, బోధనా విధానం మెరుగుపరిస్తే విద్యార్థులు వారంతట వారే వస్తారు. విద్యార్థులను బలవంతంగా తీసుకురాలేం. కోవిడ్ సమయంలో ఆరు లక్షల మందికిపైగా విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారు. విద్యార్థులకు నచ్చినచోట చదువుకునే పరిస్థితి ఉండాలి. ప్రైవేటు పాఠశాలలకు మేం వ్యతిరేకం కాదు. వాటిని ఎవరు నడుపుతున్నా మాకు అభ్యంతరం లేదు. ఇష్టానుసారం చేస్తామంటే మాత్రం ఊరుకోం’’ అని అన్నారు. ఆగస్టు 15 తర్వాత విద్యార్థులు పెరిగినా, తగ్గినా వివరణ ఇస్తామన్నారు.